కెసిఆర్ ని బిజెపి పట్టించుకోవడం లేదు!!

 

 

 

టీఆర్ఎస్‌ని తమ పార్టీలో కలిపేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్ని ప్లాన్లు వేసినా టీఆర్ఎస్ కొరకరాని కొయ్యలా తయారైంది. దాంతో టీఆర్‌ఎస్ తనలో విలీనం కాదని కాంగ్రెస్ ఫిక్స్ అయిపోయింది. కాంగ్రెస్‌తో విలీనం మాటని అటకెక్కించిన టీఆర్ఎస్ ఇప్పుడు బీజేపీ వైపు చూస్తోంది. బీజేపీతో ఎన్నికల పొత్తు కుదుర్చుకుని తెలంగాణలో పోటీ చేసిన ఎంపీ, ఎమ్మెల్యే సీట్లన్నిటిలో విజయం సాధించాలని టీఆర్ఎస్ భావిస్తోంది. దేశవ్యాప్తంగా వీస్తున్న మోడీ ప్రభంజనాన్ని తమకు అనుకూలంగా తిప్పుకోవాలని టీఆర్ఎస్ పథకరచన చేస్తోంది. దీనిలో భాగంగా తెరాస నాయకత్వం సుష్మాస్వరాజ్, రాజ్ నాథ్ సింగ్‌ల దగ్గరకి రాయబారాన్ని పంపినట్టు తెలుస్తోంది.

 

అయితే ఏరు దాటేదాకా ఓడ మల్లయ్య అని ఏరు దాటిన తర్వాత బోడిమల్లయ్య అనే టైపు అయిన టీఆర్ఎస్‌ని నమ్మడానికి, పొత్తు కుదుర్చుకోవడానికి బీజేపీ నాయకత్వం ఆసక్తి చూపించనట్టు తెలుస్తోంది. పొత్తు సందర్భంగా భారీ స్థాయిలో సీట్లు కేటాయిస్తామని టీఆర్ఎస్ ఆఫర్ల మీద ఆఫర్లు కురిపిస్తున్నా బీజేపీ అగ్ర నాయకత్వం పట్టించుకోవడం లేదన్నట్టు సమాచారం.