మునుగోడుకు ముందే ముందస్తు.. కేసీఆర్ వ్యూహమిదేనా?
posted on Sep 21, 2022 @ 1:45PM
తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర రావు రాజకీయ విజ్ఞత, వివేచన విషయంలో ఎవరికీ ఎలాంటి అనుమనాలు అక్కరలేదు. సమయానుకూలంగా స్ట్రాటజీలను మార్చడంలో ఆయన దిట్ట. అందులో సందేహం లేదు. అయితే, కారు జోరు రివర్స్ లో పరుగులు తీస్తున్న ప్రస్తుత సమయంలో కేసీఆర్ అడుగులు తడబడుతున్నాయి. జాతీయ స్థాయిలో జెండా ఎగరేసే విషయంలో అయితే నేమి, రాష్ట్రంలో రోజు రోజుకు పైకి పాకుతున్న ప్రభత్వ వ్యతిరేకతను కట్టడి చేసే విషయంలో అయితే నేమి కేసేఆర్ వ్యూహాలు గతంలో పనిచేసినంత చురుగ్గా పనిచేయడం లేదు. జాతీయ రాజకీయాలకు ఒక బ్రేక్ ఇచ్చి, రాష్ట్రం మీద దృష్టిని కేంద్రీకరించారు.
కేంద్ర ప్రభుత్వం ,బీజేపీపై యుద్ధాన్ని కొనాసగిస్తునే, రాష్ట్రంలో కరిగి పౌతున్న ఓటు బ్యాంకు కాపాడు కునేందుకు కొత్త వ్యూహాలను రచిస్తున్నారు. కొత్త పథకాలతో కొత్త కొత్త ఎత్తులతో, పోగుట్టుకున్న ప్రతిష్టను, నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే ముఖ్యమంత్రి కేసీఆర్, గిరిజనుల రిజర్వేషన్ ను ప్రస్తుతమున్న 6 శాతం నుంచి 10 శాతానికి పెంచుతున్నట్ల ప్రకటించారు. అది కూడా ఎప్పుడో కాదు, జస్ట్ ఒక వారం రోజుల్లోనే జీవో వస్తుందని తెలంగాణ విమోచన దినం ( సెప్టెంబర్ 17) రోజున ప్రకటించారు. అంతేకాదు, తెలంగాణ ఏర్పాటయ్యాక గిరిజనుల రిజర్వేషన్‌ను 10 శాతానికి పెంచాలని అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రానికి పంపినా.. ఇప్పటికీ స్పందన లేదని విమర్శించారు.
కేంద్రానికి మొరపెట్టుకొని.. విసిగిపోయామని..ఇక ఓపిక లేదని.. వారం రోజుల్లోనే రిజర్వేషన్ల జీవోను జారీ చేస్తామని కేసీఆర్ స్పష్టం చేశారు. ఆ జీవోను గౌరవించి అమలు చేస్తావా? లేదంటే దానిని ఉరి తాడు చేసుకుంటావా? అని ప్రధాని నరేంద్రమోడీ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
అయితే ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయం, చేసిన ప్రకటన విషయంలో, ఎవరికుండే అనుమానాలు వారికున్నాయి. ముఖ్యంగా, ఎస్సీలు, ఇతర వెనకబడిన కులాలు, గిరిజనుల రిజర్వేషన్ పెరిగితే, మొత్తం రిజర్వేషనలు, సుప్రీం కోర్టు విధించిన 50 శాతం పరిధ్జిని దాటి పోతాయనే ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.అయితే ముఖ్యంత్రి, అధికార పార్టీ నాయకులు మాత్రం తమిళనాడులో 69 శాతం రిజర్వేషన్లను అనుమతించిన సుప్రీం కోర్టు, తెలంగాణలో ఎందుకు అనుమతించదని ప్రశ్నిస్తున్నారు. అయితే, గతంలో ఇదే వ్యూహంతో అడుగులు వేసిన ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు బొక్కబోర్లా పడ్డాయని, రాజకీయ విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు.
తాజాగా, ఛత్తీస్ సగఢ్‌లో ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్లను పెంచుతూ పదేళ్ల క్రితం అప్పటి బీజేపీ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను హైకోర్టు కొట్టివేసింది. ఈ నిర్ణయం కారణంగా మొత్తం రిజర్వేషన్లు 58 శాతానికి పెరిగాయని, ఇది రాజ్యాంగ విరుద్ధమని తేల్చిచెప్పింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అరుప్ కుమార్ గోస్వామి, జస్టిస్ పి.పి.సాహూల ధర్మాసనం రెండు రోజుల క్రితం (సోమవారం) తీర్పు వెలువరించింది. 50 శాతం పరిమితికి మించి రిజర్వేషన్లను పెంచడం సమాన అవకాశాలను ప్రసాదించే రాజ్యాంగంలోని 16(1) అధికరణానికి విరుద్ధమని ధర్మాసనం అభిప్రాయపడింది. ఉద్యోగాల్లో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల ప్రాతినిధ్యంపై ఎలాంటి అధ్యయనం కూడా చేయలేదని పేర్కొంది. ఛ త్తీస్ గఢ్ ప్రభుత్వం కూడా తమిళనాడు ఉదాహరణను ఉతకిస్తూ తెలంగాణ ప్రభుత్వ చేసిన వాదనే చేసింది.అయినా, న్యాయస్థానం పెంపు చెల్లదని తీర్పునిచ్చింది.
ఈ నేపధ్యంలో, తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం ఎంతవరకు న్యాయ విచారణకు నిలుస్తుందనే విషయంలో సందేహాలున్నాయి. నిజానికి, ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయం వెనక గిరిజనులకు మేలు చేయాలనే సంక్సల్పం కంటే, పార్టీ, కుటుంబ సభ్యలను కేంద్ర దర్యాప్తు సంస్థల ఉచ్చు నుంచి కాపాడుకునే కాపాడుకునే సంకల్పమే బలంగా పనిచేస్తోందని, అంటున్నారు. అంతే కాదు ముఖ్యమంత్రి, అక్కడితోనూ ఆగలేదు. హుజురాబాద్ ఉపఎన్నిక సందర్భంగా ప్రకటించిన దళిత బంధు తరహాలో, గిరిజన బంధు పథకం అమలు చేస్తామని ప్రకటించారు. ఈ పథకం ద్వారా ప్రతి గిరిజన కుటుంబానికి రూ.10 లక్షలు ప్రయోజనం చేకూరుతుందని ముఖ్యమంత్రి ప్రకటించారు.అయితే, హుజురాబాద్ ఉప ఎన్నికలో దళిత బంధుతో పాటుగా ఇంకా అనేక ప్రయోజనాలు వెదజల్లినా తెరాస అభ్యర్థి ఓడిపోయిన విషయాన్ని ముఖ్యమంత్రి ఉద్దేశపూర్వకంగా మరిచి పోతున్నారని అంటున్నారు.
ఆదలా ఉంటే, గిరిజనులకు ఈ జంట వరాలను ప్రసాదించడం వెనక ముఖ్యమంత్రి కేసీఆర్ మరోమారు ముందస్తు ఎన్నికలకు వెళ్ళే అలోచన చేస్తున్నారా, అనే సదేహలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఎవరు అవునన్నా కాదన్నా, ప్రభుత్వ వ్యతిరేకత రోజు రోజుకు పెరుగుతోంది. అది ఆందోళనల రూపంలో స్పష్టంగా కనిపిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకం, పారదర్శకం అటూ తెచ్చిన ధరణి పోర్టల్ దగాకు మోసపోయిన నలుగురు రైతులు ఒకే రోజు ఆత్మహత్యా ప్రయత్నం చేశారంటే, ఒక్క ధరణి ఎకౌంటులో ప్రభుత్వ ప్రతిష్ట ఎంతగా దిగజారిందో, ప్రభుత్వ వ్యతిరేకత ఏ స్థాయికి చేరిందో, వేరే చెప్పనవసరం లేదు. అందుకే దీపం ఉండగానే ఇల్లు చకక్దిద్దుకునే ఆలోచన చేస్తున్నారని అంటున్నారు. నిజానికి, ప్రభుత్వ వ్యతిరేకత ఇప్పుడు కాదు, తెరాస రెండవసారి, అధికారంలోకి వచ్చిన మొదట్లోనే మొదలైంది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 46.86 శాతం ఓట్లతో అధికారంలోకి వచ్చిన తెరాస, సంవత్సరం తిరగకుండా 2019 లోక్ సభ ఎన్నికల నాటికే, 41.29 శాతం ఓట్లతో తొమ్మిది లోక్ సభ స్థానాలను గెలుచుకుంది.
అంటే సంవత్సర కాలంలోనే ఐదు శాతం ఓటు కోల్పోయింది . మరో వంక అసెంబ్లీ ఎన్నికలలో కేవలం 7.1 శాతం ఓటుతో, ఒకే ఒక్క స్థానం గెలుచుకున్నబీజేపీ, లోక్ సభ ఎన్నికలలో 19.45 శాతం ఓటుతో, 4 లోక్ సభ స్థానాలను గెలుచుకుంది. అంటే ఒకే ఒక్క సంవత్సరంలో బీజేపీ ఓటు షేర్ 12 శాతం పెరిగింది. ఆతర్వాత జరిగిన దుబ్బాక, హుజురా బాద్ ఉపఎన్నికలు, జీహెచ్ఎంసి ఎన్నికలు బీజేపీ లో జోష్ ను పెంచాయి. ఈ నేపథ్యంలో మునుగోడు ఉప ఎన్నిక ఫలితం తారుమారైతే, ఇక ఆతర్వాత ఏ బంధు ప్రకటించినా ఫలితం ఉందని ముఖ్యమంత్రి గమనించారు. అందుకే, మునుగోదుకు ముందే ముందస్తు ఎన్నికలకు పోవడం మంచిదనే ఆలోచన చేస్తున్నారని అంటున్నారు. అందుకే, మునుగోడు అభ్యర్ధిని ప్రకటించే విషయంలోనూ ముఖ్యమంత్రి వెనకా ముందు అవుతున్నారని అంటున్నారు.