Read more!

కొరివితో తల గోక్కుంటున్న కేసీఆర్!

బీఆర్ఎస్ నాయకుడు కేసీఆర్ కొరివితో తల గోక్కుంటున్నారు. ఇప్పటికే ఆయన పార్టీ ఇటు రాష్ట్రంలో అట్టడుగుకి వెళ్ళిపోయింది. అటు కేంద్రంలో శూన్యం అయిపోయింది. గతంలో మాదిరిగా ఆయన బిల్డప్ మాటలు, ఉడత ఊపులు ఊపితే భయపడేవారు, నమ్మేవారు ఎవరూ లేరు. చింత చచ్చినా పులుపు చావలేదని అన్నట్టుగా, అధికారం పోయి పాతాళంలోకి పడిపోయినా కేసీఆర్‌లో పొగరు ఎంతమాత్రం తగ్గలేదు. లక్షల పుస్తకాలు చదివిన ఈ కుహనా మేధావికి ఎక్కడ నెగ్గాలో, ఎక్కడ తగ్గాలో తెలియడం లేదు. ఈయన నిరంకుశ విధానాల ఫలితంగా ఆయన కుమార్తె కల్వకుంట్ల కవిత తీహార్ జైల్లో విశ్రాంతి తీసుకుంటున్నారు. కాళేశ్వరం కేసులో కావచ్చు, ఫోన్ ట్యాపింగ్ కేసులో కావచ్చు, మిగతా అవినీతి కేసులలో కావచ్చు కేసీఆర్ కుటుంబం మొత్తం జైలుకు వెళ్ళే సూచనలు కనిపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో రాజకీయ చాణక్యం ప్రదర్శించి ముళ్ళ కంప మీద పడ్డ గుడ్డను మెల్లగా బయటకి తీసుకునేలాగా వ్యవహరించాల్సిన కేసీఆర్ అలా చేయడం లేదు. కొరివితో తల గోక్కునే విధంగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే పాతాళంలోకి పడిపోయిన ఆయన, అక్కడ కూడా గోతులు తవ్వుకుంటూ వాటిలో పడిపోవడానికి సిద్ధమవుతున్నారు.

కేసీఆర్ అధికారంలోకి రాగానే కోతికి కొబ్బరిచిప్ప దొరికినట్టుగా సంబరపడిపోయారు. నేనేం చేసినా నడుస్తుంది.. నన్నెవరూ ఏమీ అడగలేరు.. నేను ఎవరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదన్నట్టుగా వ్యవహరించారు. సాధారణంగా ఒక రాష్ట్రం ఇంకో రాష్ట్రం నుంచి విద్యుత్ కొనుగోలు చేయాలంటే టెండర్లు పిలిచి, ఎవరు తక్కువ కోట్ చేస్తే వాళ్ళ దగ్గర కొనుగోలు చేయాల్సి వుంటుంది. అయితే కేసీఆర్ మాత్రం తనను తాను నిబంధనలకు అతీతుడైన మహారాజులా భావించుకున్నారు. ఎలాంటి టెండర్లను ఆహ్వానించకుండా, ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రం నుంచి చాలా ఎక్కువ రేటుకు కరెంట్ కొనే ఒప్పందాలను చేసుకున్నారు. ఇప్పుడు ఆ ఒప్పందాలు కేసీఆర్ పీకకి చుట్టుకున్నాయి. ఈ అంశం మీద రేవంత్ రెడ్డి ప్రభుత్వం జస్టిస్ నరసింహారెడ్డి నేతృత్వంలో విచారణ కమిషన్‌ని ఏర్పాటు చేసింది. 

జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ ఈనెల 15 లోగా కేసీఆర్ ఈ అంశం మీద వివరణ ఇవ్వాలని సీరియస్‌గా ఆదేశించింది. దానికి కేసీఆర్ జులై 30 వరకు తనకు గడువు కావాలని అడిగారు. అలా కుదరదు.. జూన్ 15 లోగా వివరణ ఇవ్వాల్సిందేనని కమిషన్ ఆదేశించింది. ఈ నేపథ్యంలో కేసీఆర్ జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్‌కి వివరణ ఇస్తూ 12 పేజీల సుదీర్ఘ లేఖ రాశారు. ఈ లేఖ వివరణ ఇస్తున్నట్టుగా లేదు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద విరుచుకు పడుతున్నట్టుగా వుంది. జస్టిస్ నరసింహారెడ్డిని అవమానించే విధంగా వుంది.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు రాష్ట్రానికి కేటాయించిన విద్యుత్ రాష్ట్ర అవసరాలకు సరిపోయే విధంగా లేదని కేసీఆర్ తన వివరణలో చెప్పారు. అందుకే రాష్ట్ర అవసరాల కోసం కరెంట్ కొనుగోలు చేశామని కేసీఆర్ వివరించారు. అక్కడితో ఆగకుండా, రేవంత్ రెడ్డి ప్రభుత్వం తన మీద రాజకీయ కక్ష సాధించడం కోసం ఈ విచారణ కమిషన్ ఏర్పాటు చేసిందని విమర్శించారు. పనిలోపనిగా విచారణ కమిషన్ మీద, జస్టిస్ నరసింహారెడ్డి మీద కూడా కేసీఆర్ విమర్శలు చేశారు. ‘‘మా ప్రభుత్వం గణనీయ మార్పుతో కరెంటు ఇచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. మా మార్పును తక్కువచేసి చూపించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. విలేకరుల సమావేశంలో విచారణ కమిషన్ ఇష్టమొచ్చినట్టు మాట్లాడింది. విచారణ అనేది ఒక పవిత్రమైన బాధ్యత. ఇరుపక్షాల మధ్య మధ్యవర్తిగా నిలిచి నిగ్గుతేల్చాలి. అన్ని కోణాల్లో సమగ్రంగా పరిశీలించి నిర్ణయాలు వెల్లడించాలి. కానీ, ఈ కమిషన్ మా ప్రభుత్వానికి వ్యతిరేకంగా రిపోర్టు ఇవ్వాలి అన్నట్టుగా మాట్లాడుతున్నట్టు వుంది. మీ విచారణలో నిస్పాక్షికత ఎంతమాత్రం కనిపించడం లేదు. నేను మీ ముందు హాజరై ఏం చెప్పినా ప్రయోజనం వుండదు. మేం చెప్పిన విషయాలను పరిగణనలోకి తీసుకుని జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ బాధ్యతల నుంచి వైదొలగితే మంచిదని వినయపూర్వకంగా కోరుతున్నా’’ అని కేసీఆర్ తన వివరణలో పేర్కొన్నారు.

ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిషన్‌కి నాయకత్వం వహిస్తున్న న్యాయమూర్తిని వ్యక్తిగతంగా విమర్శించడం, ఆయన మీద లేనిపోని ఆరోపణలు చేయడం కొరివితో తల గోక్కోవడమే అవుతుంది. కేసీఆర్ తన వంతు బాధ్యతగా కొరివితో తల గోక్కున్నారు. ఇక కొరివి తన బాధ్యతను తాను నిర్వర్తిస్తుంది.