కేబినెట్ లో స్థానం దక్కని సీనియర్లకూ కీలక పోస్టులు.. చంద్రబాబు కసరత్తు!

చంద్రబాబు కేబినెట్ లో సీనియర్లకు స్థానం దక్కకపోవడంపై పలువురు విస్మయం వ్యక్తం చేశారు. కేబినెట్ కూర్పు పాత కొత్తల మేలు కలయికగా ఉందన్న అభిప్రాయం వ్యక్తం అవుతున్నప్పటికీ పార్టీకి కష్టకాలంలో అండగా నిలిచి, జగన్ సర్కార్ వేధింపులను ఎదుర్కొని, కేసుల్లో ఇరుక్కుని పోరాడిన అయ్యన్నపాత్రుడు వంటి వారికి కూడా స్థానం లేకపోవడం ఏమిటన్న ఆశ్చర్యం మాత్రం పలువురిలో వ్యక్తం అయ్యింది.

అలాగే ఏడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన గోరంట్ల బుచ్చయ్య చౌదరి, రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీ సాధించిన గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావుకు, అదే విధంగా పరిటాల సునీత, యనమల రామకృష్ణుడు వంటి వారికి స్థానం లేకపోవడంపై పలువురు విస్మయం వ్యక్తం చేశారు. అనుభవజ్ణుడైనప్పటికీ నిన్న మొన్నటి వరకూ వైసీపీలో ఉన్న ఆనంకు కేబినెట్ లో స్థానం కల్పించిన చంద్రబాబు తొలి నుంచీ పార్టీని అంటిపెట్టుకుని అనేక ఆటుపోట్లను ఎదుర్కొన్న వారికి కేబినెట్ లో చోటు దక్కకపోవడంపై ఒకింత అసంతృప్తి కూడా వ్యక్తం అయ్యింది. గోరంట్ల బుచ్చయ్య చౌదరి అయితే తాను కేబినెట్ లో చోటుదక్కుతుందని ఆశించానని మీడియాతో చెప్పేశారు కూడా.   

అయితే మెల్లమెల్లగా చంద్రబాబు సీనియర్లను పార్టీ కోసం పని చేసిన వారిని విస్మరించలేదనీ, కేబినెట్ లో స్థానం కల్పించకపోయినా, అందుకు సమాన స్థాయి పదవులను ఇచ్చే యోచనలోనే ఉన్నారనీ తెలుస్తోంది. ఇప్పటికే గాజువాక ఎమ్మెల్యే పల్లాకు తెలుగుదేశం ఆంధ్రప్రదేశ్ అధ్యక్ష పదవి ఇచ్చారు. అలాగే యనమల రామకృష్ణుడిని ఏదో ఒక రాష్ట్రానికి గవర్నర్ గా పంపించే యోచన ఉందనీ, ఈ మేరకు ఇప్పటికే బీజేపీ అగ్రనాయకత్వంతో చర్చలు కూడా జరిగాయనీ విశ్వసనీయంగా తెలుస్తుంది. అలాగే మరో సీనియర్ నేత పూసపాటి అశోక్ గజపతి రాజుకు టీటీడీ చైర్మన్ పదవి, లేదా గవర్నర్ గా పంపించే యోచన ఉందని అంటున్నారు.

ఇక పరిటాల సునీతకు సైతం ఏదో ఒక కీలక పోస్టు ఖాయమని చెబుతున్నారు. ఇప్పటికే ఆమెకు ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి పిలుపు వచ్చిందని చెబుతున్నారు. ఇక అయ్యన్న పాత్రుడిని అసెంబ్లీ స్పీకర్ గా ఎంపిక చేసే అవకాశాలున్నాయని గట్టిగా వినిపిస్తోంది. అదే విధంగా గోరంట్ల బుచ్చయ్య చౌదరికి కూడా ఆయన స్థాయికి తగ్గట్టుగా, ఆయన గౌరవానికి భంగం వాటిల్లకుండా ఏదో ఒక కీలక పోస్టు ఇచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.