కేసీఆర్ భయం.. దాచేస్తే దాగేది కాదు!
posted on Jul 11, 2022 @ 12:19PM
ముచ్చటగా మూడో సారి అధికారం కేసీఆర్ కు అందని ద్రాక్షగా మిగిలిపోనుందా? ఓటమి భయం కేసీఆర్ ను వెంటాడుతోంది. పార్టీ నుంచి వలసలతో ఆయన ఆందోళన చెందుతున్నారా? ఈ ప్రశ్నలకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఔననే సమాధానం ఇస్తున్నారు. ఎంత దాచుకుందామని ప్రయత్నించినా కేసీఆర్ లో ఓటమి భయం దాగడం లేదంటున్నారాయన. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం సాయంత్రం విలేకరుల సమావేశంలో చేసిన ప్రసంగమే ఆయనలోని బయాన్ని పట్టిచ్చిందని అంటున్నారు
బండి. అందుకు ఉదాహరణగా ఆయన మీడియా సమావేశంలో పదే పదే షిండే పేరు ప్రస్తావించడాన్ని బండి ఎత్తి చూపారు. వాస్తవానికి మహారాష్ట్రీయులు కూడా షిండే పేరును అన్ని సార్లు తలుచుకుని ఉండరనీ, షిండే తిరుగుబాటుతో పదవీ చ్యుతుడైన ఉద్ధవ్ ఠాక్రే నోట కూడా షిండే పేరు అన్ని సార్లు రాలేదని, కానీ కేసీఆర్ కు టీఆర్ఎస్ లో ఒకరూ, ఇద్దరూ కాదు అనేక మంది షిండేలు కనబడుతున్నారనీ అందుకే ఆయన షిండే నామస్మరణ చేస్తున్నారనీ ఎద్దేవా చేశారు.
సీఎం మోడీని పదవి నుంచి దింపేస్తామనడం తన లోని భయాన్ని దాచుకునేందుకేనన్న బండి సంజయ్ దమ్ముంటే వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ ను గెలిపించుకోవాలని సవాల్ చేశారు. ఉడత ఊపులంటూ కేసీఆర్ మోడీపై విమర్శలు చేయడం హాస్యాస్పదంగా ఉందనీ, వాస్తవానికి జాతీయ రాజకీయాలలో చక్రం తిప్పుతానంటూ కేసీఆర్ చేస్తున్న ప్రగల్భాలే ఉడుత ఊపులనీ, వాటికి బీజేపీ భయపడదనీ స్పష్టం చేశారు.
కేసీఆర్ మాట్లలో, బాషలో, బాడీ లాంగ్వేజిలో కనిపిస్తున్న తేడా ఆయనలోని ఓటమి భయాన్ని ఎత్తి చూపుతోందని అన్నారు. టీఆర్ఎస్ లో తిరుగుబాటు అనివార్యమని ఊహిస్తున్న కేసీఆర్.. ముందుగానే టీఆర్ఎస్ లో ముందు ముందు జరగనున్న వలసల నెపాన్ని ఇప్పుడే బీజేపీపై నెట్టివేయడానికి ప్రయత్నిస్తున్నారన్నారు.
2018 ఎన్నికల తరువాత ఆయన విపక్షాలపై ప్రయోగించిన ఆపరేషన్ ఆకర్ష్ ఇప్పుడు బూమరాంగ్ అవుతుందన్న భయం కేసీఆర్ ను వెంటాడుతోందన్నారు. జాతీయ రాజకీయాలు అంటే ఆయన నేల విడిచి సాము చేస్తున్నారనీ, ఆయన వైఖరిని తెరాస శ్రేణులే తప్పుపడుతున్నాయనీ బండి పేర్కొన్నారు. దక్షిణ తెలంగాణను ఎడారిగా మార్చిన మూర్ఖుడిగా బండి కేసీఆర్ ను అభివర్ణించారు.