ఖాకీల నేరాల వెనక కనిపించని దోషులు...?
posted on Jul 11, 2022 @ 12:19PM
ఈ నగరానికి ఏమైంది.. కాదు, కాదు ఈ రాష్ట్రానికి ఏమైంది? ఒక్కప్పుడు ఉత్తమ పోలీసు వ్యవస్థగా అంతో ఇంతో పేరున్న తెలంగాణ పోలీసు వ్యవస్థ, ఎందుకిలా, వంకరలు పోతోంది? ఒకప్పుడు జాతీయస్థాయిలోనే శభాష్ అనిపించుకున్న నగర పోలీసు అధికారులు ఎందుకిలా రోజు రోజుకు తమ స్థాయిని దిగాజార్చు కుంటున్నారు? ఖాకీలు కొందరు ఎందుకు కీచకులుగా మారుతున్నారు? రాష్ట్రంలో మరీ ముఖ్యంగా రాష్ట్ర రాజధాని, భాగ్యనగరంలో నేరాలు, ఘోరాలు ఎందుకు పెరిగిపోతున్నాయి? ఎందుకు, పోలీసు వ్యవస్థ నేరాలకు కొమ్ముకాసే స్థితికి చేరిందనే విమర్శలు వస్తున్నాయి? చివరకు ఖాకీలే, తుపాకి ఎక్కు పెట్టి, అత్యాచారాలు చేసే దౌర్భాగ్య స్థితికి పోలీసు వ్యవస్థ ఎందుకు దిగజారింది? మంచి అధికారులుగా రివార్డులు, అవార్డులు అందుకోవడంతో పాటుగా ప్రజలలోనూ పోలీసు వ్యవస్థ పట్ల విశ్వాసం నింపిన అధికారులు కూడా, కథా రచయితలుగా మారి కట్టు కథలతో వాస్తవాలను కప్పెడుతున్నారనే అపవాదును ఎందుకు మోస్తున్నారు?
ఈ ప్రశ్నలు అన్నిటికీ ఒకటే సమాధానం. రాజకీయం. అవును, మితిమీరిన రాజకీయ జోక్యం కారణంగానే పోలీసు వ్యవస్థ దినదిన ప్రవర్థమానంగా దిగజారి వస్తోందనే విశ్లేషణ/విమర్శ ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో వుంది. ముఖ్యంగా పోస్టింగులు, బదిలీల విషయంలో రాజకీయ జోక్యం పెరిగి పోవడం, ఒక కారణం అయితే, హోం మంత్రి అసమర్ధత, అనాసక్తి కూడా ... అందుకు కారణమని అంటున్నారు. అంతే కాకుండా గడచిన ఎనిమిది సంవత్సరాలలో ముఖ్యమంత్రి కేసీఆర్, హోం శాఖను తమ గుప్పిట్లో ఉంచుకున్నారనే విమర్శలు కూడా లేక పోలేదు. అందుకే, హోం శాఖను తమ చెప్పుచేతల్లో ఉండే, ‘సీనియర్ల’ చేతిలో పెట్టారు. అప్పుడు నాయని నరసింహ రెడ్డి అయినా ఇప్పడు ,ముహ్మదాలీ అయినా, ముఖ్యమంత్రి వీర విధేయుల జాబితాలో ముందు వరసలో ఉంటారని,అందుకే వయసు రీత్యా, ఇతరత్రా వారి సామర్ధ్యం ఏమిటో తెలిసి కూడా ముఖ్యమంత్రి వారికి కీలక హోం శాఖ బాధ్యతలు అప్పగించారని, అందుకే హోం శాఖ అభాసుపాలవుతోందని, పోలీసు అధికారులే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రౌతు కొద్దీ గుర్రం అన్నట్లుగా మంత్రులు మెత్తగా ఉండడం వలన కూడా అధికారులలో అలసత్వం, అరాచకం పెరిగిపోతున్నాయని అంటున్నారు. అలాగే,కొందరు అవినీతి అధికారులు కమీషన్లకు కక్కుర్తిపడి తప్పటడుగులు వేస్తున్నారు. పోలీసు వ్యవస్థకు మచ్చ తెస్తున్నారు. కంచే చేను మేసిందన్న విధంగా, పోలీసు స్టేషన్లలోనూ మహిళలకు రక్షణ లేని పరిస్థితి, వచ్చిందంటే, పరిస్థితి ఏ స్థితికి చేరిందో అర్థం చేసుకోవచ్చని అంటున్నారు. ఒకటి రెండు కాదు, వరసగా పోలీసుల అరాచకాలు, అఘాయిత్యాలకు సంబదించిన వార్తలు వస్తూనే ఉన్నాయి. నిజానికి వెలుగు చూస్తున్న సంఘటనల కంటే, వెలుగు చూడని పోలీసు నేరాలు ఎక్కువగా ఉంటాయని అంటున్నారు.
తాజాగా హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసు కమిషనరేట్ల పరిధుల్లో ముగ్గురు పోలీసు అధికారులు సస్పెన్షన్‌కు గురయ్యారు. అందులో మారేడుపల్లి ఇన్‌స్పెక్టర్ కె.నాగేశ్వర్‌రావు వివాహితపై కన్నేసి లోబర్చుకోవాలని యత్నించాడు. విఫలమవటంతో బెదిరించి తాను అనుకున్నది చేశాడు. ప్రశ్నించిన భర్తను కిడ్నాప్ చేసేందుకు యత్నించి అడ్డంగా దొరికిపోయాడు. చందానగర్ ఎస్సై శ్రీనివాసులు ప్రొబేషనరీ సమయంలోనే చెలరేగాడు. ఠాణాకు వచ్చిన వారి పట్ల అమానుషంగా ప్రవర్తించాడు. లైంగిక వేధింపుల కేసులో బాలిక తండ్రిపై థర్డ్ డిగ్రీ ప్రయోగించాడు. నిందితులకు వత్తాసు పలికేలా వ్యవహరించాడని బాధితులు ఫిర్యాదు చేయటంతో అంతర్గతంగా విచారించారు. వాస్తవమని తేలటంతో సైబరాబాద్ హెడ్‌క్వార్టర్‌కు అటాచ్ చేసి సస్పెండ్ చేశారు. తాజాగా మల్కాజిగిరి సీసీఎస్ ఎస్సై విజయ్‌కుమార్ ఓ యువతిని పెళ్లి పేరుతో మోసం చేశాడు. అంతర్గత విచారణలో వాస్తవమని తేలడంతో చర్యలు చేపట్టారు.
ఇప్పటికే సస్పెన్షన్, మెమోలు ఇచ్చినా ఆ ఎస్సై తీరులో మార్పు రాలేదు. చోరీ కేసులో అరెస్టయిన నిందితుడి ఏటీఎం కార్డు నుంచి రూ.లక్షలు కొట్టేసిన ఎల్బీనగర్ సీసీఎస్ సీఐని ఇటీవల విధుల నుంచి తప్పించారు. సివిల్ వివాదాల్లో తలదూర్చిన మేడ్చల్ సీఐ ప్రవీణ్‌రెడ్డి, ఎస్సై అప్పారావులను గత నెల 11న సైబరాబాద్ సీపీ సస్పెండ్ చేశారు. నిజానికి, ఇవి వెలుగు చుసిన పోలీసు నేరాలలో కొన్ని మాత్రమే..వెలుగు చూడని నేరాలు ఇంకా ఎన్నున్నాయో అన్న అనుమనాలు వ్యక్తమౌతున్నాయి. సంసారాల్లో చిచ్చు పెట్టడం, ఖాకీ జులుంతో మహిళలను లొంగదీసుకోవడం వంటి నేరాలు మాత్రమే కాదు, భూ వివాదాలు. ఆస్తి పంపకాలు, భార్యా భర్తల తగాదాల్లో తలదూర్చుతూ పోలీసులు వందలు, వేలల్లో కాదు, ఏకంగా లక్షల రూపాయలు, డిమాండ్ చేస్తున్నారు. దండుకుంటున్నారు. నిజానికి, అనేక మంది పోలీసు అధికారాలు, ప్రైవేటు వ్యక్తులను మధ్య వర్తులుగా నియమించుకొని దందా సాగిస్తున్నారనే ఆరోపణలున్నాయి. అయితే, ఇది మొత్తం పోలీసులే చేస్తున్నారా? అంటే లేదు, కనిపించేది ఖాకీలే అయినా కార్పొరేటర్ మొదలు కనిపిచని ‘పెద్దలు’ ఎందరో ఉన్నారని అంటున్నారు.