పావులు కదుపుతున్న కావూరి
posted on Nov 2, 2012 @ 4:11PM
మంత్రి పదవిదక్కలేదన్న అసంతృప్తిని కావూరి సాంబశివరావ్ అంచెలంచెలుగా వ్యక్తం చేస్తున్నారు. అధిష్ఠానంపై ఒత్తిడిని తీసుకొచ్చేందుకు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు.ఓ పక్క పార్టీపట్ల విధేయతని చాటుకుంటూనే మరోపక్క ఒత్తిడిని తీవ్రతరం చేసేందుకు ప్రయత్నిస్తున్నట్టు కావూరికి దగ్గరైనవాళ్లు భావిస్తున్నారు.
కిందటిసారే తనకి కేంద్రంలో మంత్రి పదవి దక్కుతుందని ఆశించి భంగపడ్డ కావూరి ఈ సారి చాలా గట్టి ఆశలే పెట్టుకున్నారు. వీలైనంతవరకూ పదవి చేజారి పోయేందుకు ఛాన్స్ లేకుండా ఢిల్లీ స్థాయిలో గట్టిగా లాబీయింగ్ కూడా చేశారు. కానీ.. సమైక్యవాదాన్ని గట్టిగా వినిపించి అధిష్ఠానం మీద ఒత్తిడి తీసుకురావాలనుకున్న ఆయన వ్యూహం తీవ్రస్థాయిలో బెడిసికొట్టింది.
అటు తెలంగాణ వాదాన్ని భుజానికెత్తుకున్న వాళ్లని కానీ, ఇటు సమైక్యాంధ్ర వాదాన్ని గట్టిగా వినిపించినవాళ్లకి కానీ పదవులు దక్కకపోవడం ఎవరూ ఊహించని విషయం. సోనియా పూర్తిగా వీరవిధేయులకీ, నోరెత్తి మాట్లాడని వాళ్లకీ, భవిష్యత్తులో రాహుల్ ప్రథాని పీఠాన్ని అధిష్ఠించడానికి సహకరిస్తారనుకున్నవాళ్లకి మాత్రమే ఛాన్స్ ఇచ్చారని పార్టీ వర్గాలు గట్టిగానే చెప్పుకుంటున్నాయ్.
గతంలో చిరంజీవికి కేంద్రమంత్రి పదవి ఇస్తారనుకున్నప్పుడుకూడా కావూరి తీవ్రస్థాయిలో అభ్యంతరం వ్యక్తం చేశారు. జూనియర్లకి పెద్దపీట వేస్తే సీనియర్లకు ఏం దక్కుతుందంటూ అసహనాన్ని ప్రదర్శించారు. అప్పట్లో కామ్ గా విని ఊరుకున్న కాంగ్రెస్ అధిష్ఠానం, ఇప్పుడు కాస్త గట్టిగానే స్పందించినట్టు కనిపిస్తోంది. వీర విధేయులకు మాత్రమే చోటివ్వడంద్వారా కామ్ గా ఉండేవాళ్లకే ప్రాధాన్యం ఇస్తామని చెప్పకనే చెప్పినట్టయ్యింది.