Read more!

కవితకు మూడు రోజుల కస్టడీ పొడగింపు 

ఢిల్లీ లిక్క‌ర్ కేసులో ఏడు రోజుల ఈడీ క‌స్ట‌డీ ముగియడంతో ఎమ్మెల్సీ క‌విత‌ను అధికారులు రౌస్ అవెన్యూ కోర్టులో ప్ర‌వేశ‌పెట్టారు. ఈ సంద‌ర్భంగా క‌విత‌ను మ‌రో 5 రోజుల క‌స్ట‌డీకి ఇవ్వాల‌ని ఈడీ కోరింది. ఇరువైపుల వాద‌న‌లు విన్న న్యాయ‌స్థానం క‌విత క‌స్ట‌డీని మూడు రోజులు పొడిగించింది. అంత‌కుముందు త‌మ విచార‌ణ‌కు క‌విత స‌హ‌క‌రించ‌డం లేద‌ని ఈడీ ఆరోపించింది. స‌మీర్ మ‌హీంద్ర‌తో క‌లిపి క‌విత‌ను ప్ర‌శ్నించాల‌ని తెలిపింది. లిక్క‌ర్ స్కామ్ లో రూ. కోట్ల‌లో కిక్ బ్యాక్‌లు అందాయ‌ని ఈడీ పేర్కొంది. 

సౌత్‌గ్రూప్‌కు రూ.100కోట్లు చేరాయ‌ని ఆరోపించింది. క‌విత ఫోన్ డేటాను తొలిగించిన‌ట్లు త‌మ ద‌ర్యాప్తులో తేలింద‌ని ఈడీ కోర్టుకు తెలియ‌జేసింది. అలాగే ఆమె కుటుంబ స‌భ్యుల వివ‌రాల‌ను ఇవ్వ‌డం లేద‌ని ఈడీ త‌రఫు లాయ‌ర్ అన్నారు. క‌విత మేన‌ల్లుడి వ్యాపారానికి సంబంధించిన వివ‌రాలు అడిగిన‌ట్లు ఈడీ తెలిపింది. ప్ర‌స్తుతం క‌విత మేన‌ల్లుడి ఇంట్లో సోదాలు జ‌రుగుతున్నాయ‌ని పేర్కొంది. 

క‌విత‌ను ఆమె మొబైల్ ఫోన్‌కు సంబంధించిన ఫోరెన్సిక్ సైన్స్ నివేదిక‌తో విచారిస్తున్నామ‌ని ఈడీ త‌ర‌ఫు లాయ‌ర్ తెలియ‌జేశారు. సోదాల్లో మేన‌ల్లుడి ఫోన్ స్వాధీనం చేసుకున్న‌ట్లు తెలిపింది. మ‌రోవైపు క‌విత త‌న అరెస్టు అక్ర‌మం అని పేర్కొన్నారు. కావాల‌నే త‌న‌ను ఈ కేసులో ఇరికించార‌ని చెప్పారు. కోర్టులో హాజ‌ర‌యిన త‌ర్వాత బ‌య‌ట‌కు వ‌చ్చే క్ర‌మంలో మీడియాతో క‌విత ఈ వ్యాఖ్య‌లు చేశారు.