కశ్మీర్ లోయలో ఆంక్షలు ఎత్తివేత.. అదే పరిస్థితి
posted on Sep 8, 2016 @ 1:12PM
బుర్హాన్ వనీ ఎన్ కౌంటర్ నేపథ్యంలో గత రెండు నెలలుగా కాశ్మీర్లో ఆందోళనలు చెలరేగుతున్న సంగతి తెలిసిందే. రెండు నెలలుగా అక్కడ కర్ఫ్యూ విధించడంతో ప్రజలు నానా తంటాలు పడుతున్నారు. ఎక్కడికక్కడ షాపులు మూసుకుపోవడంతో కనీస అవసరాలు కూడా తీరకపోవడంతో జనజీవనం స్తంభించిపోయింది. దీంతో ఇప్పుడు అక్కడ పెట్టిన ఆంక్షలు తీసివేస్తున్నట్టు అధికారులు తెలిపారు. కశ్మీర్ లోయలో ఆంక్షలు ఎత్తివేశామని, ఎక్కడా కర్ఫ్యూ లేదని ఓ పోలీస్ అధికారి వెల్లడించారు. అయితే భద్రతా కారణాల దృష్ట్యా కొన్ని సమస్యాత్మక ప్రాంతాల్లో భద్రతాసిబ్బందిని ఏర్పాటుచేసినట్లు తెలిపారు. అయితే ఆంక్షలు తొలగించినప్పటికీ పరిస్థితి మాత్రం అలాగే ఉంది. వేర్పాటువాదులు పిలుపునిచ్చిన బంద్ నేపథ్యంలో పాఠశాలలు, కళాశాలలు, దుకాణాలు, పెట్రోల్ బంక్‌లు ఇంకా తెరుచుకోలేదు. సెప్టెంబర్ 16 వరకు బంద్ కొనసాగుతోందని వేర్పాటువాద నాయకులు ప్రకటించారు.