హిమాచల్ లో ఎన్నికల నగారా.. గుజరాత్ ఊసే లేదు!
posted on Oct 15, 2022 4:58AM
కేంద్ర ఎన్నికల సంఘం హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించింది. శుక్రవారం ప్రకటించిన ఎన్నికల షెడ్యూల్ ప్రకారం వచ్చెనెల 12న హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ జరుగుతుంది. డిసెంబర్ 8న ఓట్ల లెక్కింపు ఉంటుంది. కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం హిమాచల్ ప్రదేశ్ ఎన్నికలకు నోటిఫికేషన్ ఈ నెల 17న విడుదల కానుంది. అదే రోజు నుంచి ఈ నెల 25 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 29 వరకు సమయం ఉంటుంది.
సాధారణంగా 6 నెలల్లోపు అసెంబ్లీల పదవీ కాలం ముగుస్తున్న రాష్ట్రాలన్నిటికీ కలిపి ఒకే సారి ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉన్నప్పటికీ ఎన్నికల కమిషన్ మాత్రం గుజరాత్ ను వదిలి కేవలం హిమాచల్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ మాత్రమే విడుదల చేయడం పట్ల విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ గడువు వచ్చే ఏడాది జనవరి 8కి ముగుస్తుండగా, గుజరాత్ అసెంబ్లీ గడువు వచ్చే ఏడాది ఫిబ్రవరి 18న ముగుస్తుంది. హిమాచల్, గుజరాత్ రాష్ట్రాలలో ప్రభుత్వ వ్యతిరేకతను అధిగమించి, ప్రతిపక్షాలను తిప్పిగొట్టేందుకు వ్యూహరచన చేసే అవకాశం మోదీ సర్కారుకు ఇచ్చేందుకే వేర్వేరుగా ఎన్నికలు నిర్వహిస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
హిమాచల్ అసెంబ్లీతో పాటు గుజరాత్‌కు ఎన్నికల షెడ్యూల్ ప్రకటించకపోవడాన్ని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ తప్పుపట్టారు. గుజరాత్ లో భారీ వాగ్దానాలు, ప్రారంభోత్సవాలు చేయడానికి ప్రధాని మోదీకి తగిన సమయం లభించాలన్న ఉద్దేశంతోనే గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించకుండా జాప్యం చేశారని విమర్శించారు. అయితే ఈ విమర్శలను కేంద్ర ఎన్నికల సంఘం తోసిపుచ్చింది. హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల షెడ్యూల్ ప్రకటన చేయడంలో నిబంధనల ఉల్లంఘనకు పాల్పడలేదని స్పష్టం చేసింది.
శీతాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని హిమాచల్ షెడ్యూల్‌ను ముందుగా విడుదల చేసినట్లు పేర్కొంది. రెండు రాష్ట్రాల అసెంబ్లీల గడువు ముగియడానికి మధ్య 40 రోజుల వ్యవధి ఉందనీ, నిబంధనల ప్రకారం ఒక రాష్ట్ర ఎన్నికల ఫలితాలు మరో రాష్ట్రంపై ప్రభావం చూపకుండా ఉండాలంటే 30 రోజుల వ్యవధి సరిపోతుందని చెప్పారు. అంతే కాకుండా 2017లో కూడా ఇరు రాష్ట్రాలకు వేర్వేరుగా షెడ్యూల్ ప్రకటించిన విషయాన్ని కేంద్ర ఎన్నికల సంఘం గుర్తు చేసింది. అప్పట్లో అక్టోబరు 13న హిమాచల్ ప్రదేశ్‌కు, 25న గుజరాత్‌కు ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసినట్లు తెలిపింది.