కోట్ల పై కాంగ్రెస్ కార్యకర్తల తిరుగుబాటు
posted on Mar 6, 2012 @ 2:09PM
కర్నూలు: కర్నూలు ఎంపి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డిపై కర్నూలు జిల్లా కాంగ్రెస్ శ్రేణులు ముఖ్యంగా ఎమ్మిగనూరు అసెంబ్లీ సెగ్మెంట్ కాంగ్రెస్ నాయకులు కత్తులు చూస్తున్నారు. ఎమ్మిగనూరు అసెంబ్లీ స్థానానికి జరగబోయ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిగా రుద్రగౌడ్ పేరును కోట్ల విజయభాస్కరరెడ్డి ప్రతిపాదించడమే దీనికి కారణం. టిడిపి నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వలస వచ్చిన రుద్రగౌడ్ కు ఎమ్మిగనూరు టిక్కెట్ ఇప్పిస్తానని కోట్ల చెప్పడం పట్ల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఒక వేళ రుద్రగౌడ్ కు టిక్కెట్ ఇస్తే ఆయన ఓటమి ఖాయమని వారంటున్నారు. అధికార పార్టీనుంచి మహామహులు వచ్చి ప్రచారం చేసినా ఆయన గెలవడం కష్టమని వారంటున్నారు. పార్టీ అధిష్టానంతో సంప్రదించకుండానే రుద్రగౌడ్ పేరును కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి ఎలా ప్రకటిస్తారని వారు ప్రశ్నిస్తున్నారు. దీంతో కంగుతిన్న సూర్యప్రకాష్ రెడ్డి అసమ్మతివాదులను బుజ్జగించడానికి ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.