శోభా నాగిరెడ్డిని ఢీకొట్టే ధీరుడెవ్వరో?
posted on Mar 6, 2012 @ 2:16PM
కర్నూలు జిల్లా: కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో తాజా మాజీ ఎమ్మెల్యే శోభా నాగిరెడ్డిని ఢీకొట్టే ధీరుడి వేటలో తెలుగుదేశం, కాంగ్రెస్ పడ్డాయి. ఈ ఎన్నికల్లో తనకు మెజారిటి 30వేలకు తగ్గదన్న ధీమాను శోభా నాగిరెడ్డి వ్యక్తం చేస్తున్నారు. 1997లో జరిగిన ఎన్నికల్లో తన ప్రత్యర్ధి టిడిపి అభ్యర్ధి ఇరిగెల రామ్ పుల్లారెడ్డిపై 40వేల ఓట్ల మెజారిటితో గెలిచానని ఈసారి ఓట్లు చీలే అవకాశం ఉన్నందున మెజారిటి 30వేల వరకు వస్తుందని ఆమె చెబుతున్నారు. శోభా నాగిరెడ్డి పిఆర్పీ నుంచి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి మారడం, అనంతరం చిరంజీవి దిష్టిబొమ్మకు పిండప్రదానం చేయడంతో ఒక సామాజిక వర్గంలో ఆమెపై కొంత వ్యతిరేకత నెలకొంది. ఈ వ్యతిరేకత తమకు లాభిస్తుందని కాంగ్రెస్ ధీమాగా ఉంది. ఆ పార్టీ తరపున మాజీ ఎమ్మెల్యే గంగుల ప్రతాపరెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. గత రెండు నెలలుగా ఆయన నియోజకవర్గంలో పార్టీ సమావేశాలకు హాజరు కావడం, మండల కేంద్రాల్లో జన సమీకరణలు చేయడం చూస్తుంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిగా ఆయననే ఎంపిక చేస్తారన్న ప్రచారం జరుగుతుంది. టిడిపి అభ్యర్ధిగా ఇరివెల రామ్ పుల్లారెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఏమైనా అనూహ్య పరిణామాలు చేసుకుంటే తప్ప ఆయన పోటీ చేయడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. ఈ పరిస్థితులను పరిశీలిస్తే ఆళ్లగడ్డలో త్రిముఖ పోరు అనివార్యమవుతుందని పరిశీలకులు భావిస్తున్నారు.