కర్నాటక ఫలితం సమీకరణాలను మార్చేసింది!
posted on May 16, 2023 6:30AM
కర్నాటక ఫలితాల తరువాత జాతీయ రాజకీయ సమీకరణాలపై చర్చ కొత్తగా తెరపైకి వచ్చింది. కర్నాటక ఎన్నికలలో కాంగ్రెస్ ఘన విజయానికి ముందు వరకూ కాంగ్రెస్సేతర, బీజేపీయేతర కూటమి అంటూ జరిగిన ఐక్యతా యత్నాలు ఇక నుంచి ఆ ఏతర జాబితా నుంచి అనివార్యంగా కాంగ్రెస్ ను తీసేస్తాయి. ఇకపై ఐక్యతా యత్నాలలో కాంగ్రెస్సేతర అన్న మాట వినిపించే అవకాశాలు చాలా స్వల్పంగా కనిపిస్తున్నాయి.
2004 నుంచి యూపీఏ భాగస్వామ్య పక్షాులుగా ఉన్న అనేక పార్టీలు ఆ తరువాత వివిధ రాజకీయ కారణాలతో దూరమయ్యాయి. అయినా కూడా యూపీఏ కూటమి మనుగడ సాగిస్తూనే ఉంది. కానీ గతంలోలా ఆ కూటమికి నేతృత్వం వహిస్తున్న కాంగ్రెస్ బలంగా లేదు. దీంతో పలు ప్రాంతీయ పార్టీలు బీజేపీకీ, కాంగ్రెస్ కూ సమదూరం అంటూ కొత్త కూటమి ఏర్పాటు దిశగా పావులు కదిపాయి. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ, ఆమ్ఆద్మీ అధినేత కేజ్రీవాల్ వంటి వారు ఎవరికి వారుగా జాతీయ స్థాయిలో బీజేపీయేతర, కాంగ్రెససేతర కూటమి యత్నాలు చేపట్టినా అవి పెద్దగా ముందుకు సాగలేదు. డీఎంకే అధినేత స్టాలిన్ వంటి వారు కాంగ్రెస్ లేని విపక్ష కూటమికి తావే లేదని కుండబద్దలు కొట్టేశారు. కర్నాటక ఫలితాల తరువాత కాంగ్రెస్, బీజేపీలకు సమదూరం పాటిస్తామంటూ వస్తున్న నాయకుల స్వరం మారుతోంది. అందరి కంటే ముందుగా తృణమూల్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కాంగ్రెస్ కు మద్దతుగా గొంతు విప్పారు. కాంగ్రెస్ బలంగా ఉన్న చోట ఆ పార్టీకి మద్దతుగా నిలుస్తామని ప్రకటించారు. తొలి నుంచీ బీజేపీ, కాంగ్రెస్ లకు సమదూరం అంటూ రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన కేజ్రీవాల్ స్వరంలో కూడా మార్పు వస్తోంది. బీజేపీ దర్యాప్తు సంస్థల ద్వారా ఆప్ అస్థిత్వాన్నే దెబ్బకొట్టే విధంగా చేస్తున్న ప్రయత్నాలు కేజ్రీవాల్ కు తత్వం బోధపడేలా చేస్తున్నాయని పరిశీలకులు అంటున్నారు.
ఇక యూపీలోని రెండు బలమైన పార్టీలు ప్రస్తుతం రాజకీయంగా గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్న సమాజ్ వాదీ పార్టీ, బహుజన సమాజ్ పార్టీలు కూడా బీజేపీయేతర కూటమికి మొగ్గు చూపే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. జాతీయ రాజకీయాలలో ఇటీవలి కాలంలో బీఎస్పీ (బహుజనసమాజ్ పార్టీ) జాతీయ రాజకీయ యవనికపై పెద్దగా కనిపించడం లేదు. ఆ పార్టీ అధినేత్రి మాయావతి గళంలో పదను తగ్గిందన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమౌతోంది. అయితే యూపీ రాజకీయాలను సన్నిహితంగా పరిశీలించేవారికి మాత్రం ఈడీ, సీబీఐ కేసుల భయమే మాయావతి మౌనానికి కారణమని అంటున్నారు. ఇప్పుడు కర్నాటక ఫలితం తరువాత ఆమె రాజకీయంగా మరింత క్రియాశీలంగా వ్యవహరించే అవకాశాలున్నాయని చెబుతున్నారు. సమాజ్ వాదీ పార్టీ ఇప్పటికే మమత బెనర్జీతో కలిసి నడుస్తున్న నేపథ్యంలో ఇప్పుడు బీజేపీ యేతర కూటమి వైపే అఖిలేష్ యాదవ్ కూడా మొగ్గు చూపే అవకాశాలున్నాయని పరిశీలకులు అంటున్నారు.
ఇక శరద్ పవార్, నితీష్ కుమార్, తేజస్వి ప్రసాద్ వంటి వారు ఇప్పటికే కాంగ్రెస్ తో కూడిన విపక్ష కూటమి కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ముందు ముందు ఆ ప్రయత్నాలు మరింత ముమ్మరం అవుతాయి. కూటమిలోకి వచ్చి చేరే పార్టీల సంఖ్యా పెరుగుతుందన్నది పరిశీలకుల విశ్లేషణ. ఇక అందరి కంటే ముందుగా కాంగ్రెస్సేత, బీజేపీయేతర కూటమి, నాలుగో ఫ్రంట్ అంటూ గళం విప్పిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అనివార్యంగా ఇప్పుడు తన జాతీయ పార్టీని కూడా బీజేపీయేతర కూటమి పంచన చేర్చే అవకాశాలున్నాయని అంటున్నారు.
బుధవారం (మే 17) ఆ పార్టీ లెజిస్లేచర్, పార్లమెంటరీ పార్టీ భేటీలో ఈ విషయంలో కేసీఆర్ ఒక నిర్ణయం తీసుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయి. మొత్తం మీద ఒక్క విజయం.. ఔను ఒకే ఒక్క విజయం కాంగ్రెస్ గ్రాఫ్ ను అమాంతంగా పెంచేసింది. బీజేపీని దీటుగా ఎదుర్కొనాలంటే.. వచ్చే సార్వత్రిక ఎన్నికలలో మోడీ సర్కార్ ను గద్దె దింపాలంటే కాంగ్రెస్సేతర అన్న విధానాన్ని వదులుకోకతప్పదని బీజేపీని వ్యతిరేకించే పార్టీలకు స్పష్టంగా అర్ధమయ్యేలా చేసింది.