అవినాష్ రెడ్డికి సీబీఐ పిలుపు
posted on May 15, 2023 @ 6:03PM
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాష్ రెడ్డికి సీబీఐ తాజాగా నోటీసులు జారీ చేసింది. మంగళవారం (మే 16) మధ్యాహ్నం కోఠీలోని సీబీఐ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని సీబీఐ ఆ నోటీసులలో స్పష్టం చేసింది. హైదరాబాద్ నుంచి కడపకు బయలుదేరిన అవినాష్ నోటీసులు అందుకుని హైదరాబాద్ కు తిరుగు ప్రయాణమయ్యారు.
అందరూ అనుకున్నట్లుగానే కర్నాటక ఎన్నికల ఫలితాల వరకూ ఎదురు చూసిన సీబీఐ వెంటనే రంగంలోకి దిగింది. వివేకా హత్య కేసులో ప్రస్తుతం కారాగారంలో ఉన్న ఉదయ్ కుమార్ రెడ్డి బెయిలు పిటిషన్ ను సీబీఐ కోర్టు తిరస్కరించింది. ఉదయ్ కుమార్ రెడ్డికి బెయిలు ఇస్తే దర్యాప్తును ప్రభావితం చేస్తారన్న సీబీఐ తరఫు న్యాయవాది వాదనలతో కోర్టు ఏకీభవించింది. వివేకా హత్య కేసులో ఇప్పటి వరకూ జరిగిన పరిణామాలను పరిశీలిస్తే.. ఏప్రిల్ 30వ తేదీతో విచారణ పూర్తి చేయాలన్న ఆదేశాలను మరో రెండు నెలల పాటు పొడిగించడంతో సీబీఐ తన విచారణను మరింత లోతుగా జరుపుతోంది. మరో వైపు వివేకాకు న్యాయం జరగాలంటూ సునీత చేస్తున్న పోరాటం ఈ కేసులో మరికొన్ని కొత్త కోణాలను ఆవిష్కరిస్తోంది. వివేకా హత్య ఆస్తి కోసమే జరిగిందంటూ అవినాష్ రెడ్డి వర్గం రంగంలోకి దించిన ఆయన రెండో భార్య షమీప్ ఎపిసోడ్ కూడా పెద్దగా ప్రభావం చూపించలేకపోయింది.
మరోవైపు సునీత భర్త రాజశేఖరరెడ్డిని కూడా సీబీఐ విచారించింది. అవినాష్ రెడ్డి ఆరోపిస్తున్న విధంగా వివేకా హత్య ఆస్తి కోసం జరగలేదని సిబీఐ నిర్థారణకు వచ్చింది. దస్తగిరి అప్రూవర్ గా మారి వివేకా హత్య జరిగిన వైనాన్ని పూసగుచ్చినట్లు చెప్పడంతో సీబీఐతో పాటు సామాన్య ప్రజలకు కూడా జరిగినది ఏమిటో అర్దమైంది. కడప జిల్లాలో మరీ ముఖ్యంగా పులివెందులలో వివేకా హత్యకు సంబంధించిన విషయాలు చర్చకు వస్తున్నాయి. గత రెండు వారాలుగా కడప సెంట్రల్ జైలు గెస్ట్ హౌస్ లో మకాం వేసిన సబీఐ బృందం అనేక మందిని కలిసి సాక్ష్యాలను సేకరించింది.
అలా సేకరించిన సాక్ష్యాలపై అవినాష్ రెడ్డిని విచారించే అవకాశం ఉందని తెలుస్తోంది. వాచ్ మెన్ రంగన్న తో పాటు ఎర్రగంగిరెడ్డి, భాస్కరరెడ్డి, దస్తగిరి, ఉదయ్ కుమార్ రెడ్డిల నుండి సేకరించిన వివరాలు అవినాష్ రెడ్డి విచారణలో కీలకం కానున్నాయి. ఏది ఏమైనా అవినాష్ రెడ్డి చుట్టూ తిరుగుతున్న వివేకా హత్య కేసు ఆయన అరెస్టుతోనే ఓ కొలిక్కి వస్తుందని న్యాయ నిపుణులు చెబుతున్నారు.