సీఎంగా సిద్దరామయ్య ప్రమాణ౦
posted on May 13, 2013 @ 12:49PM
కర్ణాటక ముఖ్యమంత్రిగా సిద్దరామయ్య ఈ రోజు ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ భరద్వాజ్ ఆయనతో ప్రమాణం చేయించారు. బెంగళూరు కాంటీవ మైదానంలో జరిగిన కార్యక్రమానికి భారీ సంఖ్యలో కాంగ్రెస్ నేతలు కార్యకర్తలు తరలివచ్చారు. ఈ కార్యక్రమానికి ఏఐసిసి ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ కూడా హాజరయ్యారు. ఈ రోజు సాయంత్రం సిద్ధరామయ్య ఢిల్లీ వెళ్లనున్నారు. ఆ తర్వాత మంత్రివర్గ విస్తరణ చేయనున్నారు.
తనకు మద్దతునిస్తున్న దాదాపు డెబ్బై మంది ఎమ్మెల్యేలతో సిద్దరామయ్య రహస్య సమాలోచనలు జరిపారు. పరమేశ్వర కూడా సిఎం రేసులో ఉన్నానని చెప్పారు. దళితుడికి ఈసారి సిఎం పదవి కట్టబెట్టాలనే వాదనను మల్లిఖార్జున ఖర్గే లేవనెత్తారు. ఆయన తనకు సిఎం పదవి కోసం పావులు కదిపారు. కర్ణాటక రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న ఏఐసిసి ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితుడైన మాజీ మంత్రి డికె శివ కుమార్ కూడా చక్రం తిప్పారు. ఇంతమంది పోటీ నేపథ్యంలో అధిష్టానం కుల సమీకరణాలను అమలు చేసి సిద్ధరామయ్యను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎంపిక చేసింది. ఆయనతో పాటు ఇద్దరు ఉప ముఖ్యమంత్రులను నియమించాలని పార్టీ అధిష్టానం భావిస్తోందట.