కాంగ్రెస్ లోకి జూపల్లి, పొంగులేటి ?
posted on May 15, 2023 @ 11:46AM
కర్ణాటక ఎన్నికల ఫలితాలతో తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకోబోతున్నాయి. అక్కడి విజయంతో ఇక్కడి కాంగ్రెస్ క్యాడర్లో జోష్ నిండుకుంది. దీంతో మరో ఆరు నెలల్లో ఎన్నికలు రానున్న నేపథ్యంలో ఈ ఉత్సాహంతో ఆ పార్టీ పుంజుకునే అవకాశాలున్నాయి.
అయితే ఇతర పార్టీల్లోని అసంతృప్తవాదులకు ఓ ఆప్షన్ గా కాంగ్రెస్ మారింది. దీంతో భారీ స్థాయిలో ఆ పార్టీకి సభ్యత్వం నమోదు కావడంతో పాటు కొంత మంది కీలక నేతలు గాంధీభవన్ మెట్లెక్కే ఛాన్స్ కూడా ఉందని రాజకీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ క్రమంలోనే ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇంకా మాజీ మంత్రి జూపల్లి కృష్ణా రావ్ లు కాంగ్రెస్ లో చేరనున్నట్లు సమాచారం. అయితే కొన్నాళ్ల నుంచి వీరిద్దరు ఏ పార్టీలో చేరాలనే దానిపై సందిగ్దంలో ఉన్నారు. బిజెపిలో చేరనున్నట్లు ప్రచారం బాగా జరిగింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలపై వీరిద్దరూ బిఆర్ఎస్ నుంచి సస్పెండ్ అయ్యారు. బిఆర్ఎస్ కి ప్రధాన శత్రువు బిజెపి కాబట్టి వీరిరువురు చేరికలపై రకరకాల రూమర్లు వచ్చాయి.
అయితే కర్ణాటక ఫలితాలతో కాంగ్రెస్ లోనే చేరడం బెటర్ అని ఇద్దరు డిసైడ్ అయినట్టు తెలుస్తోంది. అక్కడ కాంగ్రెస్ పార్టీ విజయం కైవసం చేసుకోవడం పైగా ఖమ్మంలో కూడా కాంగ్రెస్ కు బలం ఉండడంతో.. వారిద్దరు కూడా బీజేపీ కంటే కూడా కాంగ్రెస్ లో చేరడానికే నిర్ణయించుకున్నట్టు సమాచారం. దీంతో వారు సేవ్ వనపర్తి ఆత్మీయ సమ్మేళనంలో ఈ విషయాన్ని ప్రకటించే అవకాశముంది. అదే విధంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున కాంగ్రెస్ కండువా కప్పుకోవడానికి ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది.
అయితే వాస్తవానికి పొంగులేటి బీజేపీలోకి చేరాలని భావించారు. దీంతో ఆయన బీజేపీ చేరికల కమిటీతో రెండు మూడు సార్లు భేటీ కూడా అయ్యారు. ఆయన ఇంటికి ఈటల బృందం వెళ్లింది కూడా. అయితే ఆయన అనుచరులు మాత్రం కాంగ్రెస్ లోకే ఆయన్ని చేరాలని ఒత్తిడి చేస్తున్నారు. దీంతో కర్ణాటక ఎన్నికల ఫలితాల తరువాత నిర్ణయం తీసుకుంటానని పొంగులేటి అప్పుడు ప్రకటించారు. ఇక కర్ణాటకలో కాంగ్రెస్ విజయాన్ని సాధించడంతో ఆయన కాంగ్రెస్ లోకే వెళ్లడానికి సిద్ధమయ్యారు. కాగా, ఆయనతో పాటు జూపల్లి కృష్ణారావు కూడా కాంగ్రెస్ లోకే వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో వీరిద్దరు కలవడం తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తిగా మారింది.