జూపల్లి, పొంగులేటిపై బీఆర్ఎస్ సస్పెన్షన్ వేటు.. హర్షం వ్యక్తం చేసిన ఇరువురు నేతలు
posted on Apr 10, 2023 @ 1:40PM
పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాంటూ మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావులను పార్టీ నుంచి బీఆర్ఎస్ సస్పెండ్ నుంచి సస్పెండ్ చేస్తూ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. వారిరువురినీ పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు పార్టీ కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది.
గత కొంత కాలంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి పార్టీతో అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తూ పార్టీ నాయకత్వంపైవిమర్శలు చేస్తున్నారు. అదే విధంగా మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు సైతం పార్టీ అగ్ర నాయకత్వం తనను పట్టించుకోలేదని, మూడేళ్లుగా పార్టీ సభ్యత్వాన్ని కూడా రెన్యూవల్ చేయలేదని ఆరోపణలు గుప్పిస్తున్నారు. అటువంటి వీరిరువురూ ఆదివారం (ఏప్రిల్ 9) కొత్తగూడెంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పైనా, ఆయన కుటుంబంపైనా తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.
అంగే గంటల వ్యవధిలో పార్టీ కార్యాలయం నుంచి వీరిద్దరినీ సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటనవెలువడింది. కాగా తమ సస్పెన్షన్ పై ఈ ఇరువురూ కూడా వేర్వేరుగా ఒకే లాంటి వ్యాఖ్యలు చేశారు. ఇన్ని రోజులకు తనకు విముక్తి కలిగిందని పొంగులేని వ్యాఖ్యానించారు. దొరల గడీ నుంచి విముక్తి లభించినందకు సంతోషంగా ఉందన్నారు. అంతే కాకుండా ఇప్పటికైనా పార్టీ నుంచి సస్పెండ్ చేసినందుకు కేసీఆర్ కు ధన్యవాదాలు చెప్పారు.
అటు జూపల్లి సైతం తనను పార్టీ నుంచి సస్పెండ్ చేయడంపై సంతోషం వ్యక్తం చేశారు. సస్పెన్షన్ తో తనకు పంజరం నుంచి బయటకు వచ్చినట్లుగా ఉందన్నారు. అయితే తన సస్పెన్షన్ కు కారణం చెప్పాలన్నారు. తాను లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం చెప్పిన తరువాత సస్పెండ్ చేసి ఉంటే బాగుండేదని జూపల్లి పేర్కొన్నారు.