ఏపీ సీఎం నార్సిసిజంతో బాధపడుతున్నారు.. రఘురామ రాజు
posted on Apr 10, 2023 @ 12:37PM
వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణం రాజు మరో మారు సొంత పార్టీ అధినేత జగన్ పై నిప్పులు చెరిగారు. మా నమ్మకం నువ్వే జగన్ అంటూ వైసీపీ చేపట్టిన కార్యక్రమం లక్ష్యంగా విమర్శలు గుప్పించారు. రచ్చబంగా కార్యక్రమంలో భాగంగా శనివారం ( ఏప్రిల్ 8)న మీడియాతో మాట్లాడిన రఘురామరాజు వైసీసీ మా నమ్మకం నువ్వే జగన్ అంటుంటే జనం మాత్రం మా నమ్మకం కాదు.. నమ్మక ద్రోహం నువ్వే జగన్ అంటూ విరుచుకుపడుతున్నారని అన్నారు.
అందుకే జగన్ ను కీర్తిస్తూ వైసీపీ చేపట్టిన ఈ కార్యక్రమాన్ని విపక్ష తెలుగుదేశం సైతం స్వాగతిస్తోందని అయిన అన్నారు. విపక్షం జగనే తమకుఅధికారం కట్టబెడతారన్న నమ్మకం తెలుగుదేశంలో కనిపిస్తోందని చెప్పారు. విద్యుత్ చార్జీలు, బస్సు చార్జీలు, ఇంటి పన్నులను పెంచి, చెత్తపై కూడా పన్ను వేసి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జనంలో తన విశ్వసనీయతను అధ:పాతాళంలోకి దిగజార్చుకుంటే.. వైసీపీ నాయకులు, మంత్రులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు నువ్వే మా నమ్మకం జగన్ అంటూ ఇంటింటికి తిరిగి స్టిక్కర్లను అతికిస్తుంటే జనం ఏవగించుకుంటున్నారన్నారు.
ఒకవైపు వైసీపీ వారు ఇంటింటికి తిరిగి స్టిక్కర్లు అతికిస్తుంటే, చాలా చోట్ల జనం వాటిని పీకి పారేయడం కనిపిస్తోందని చెప్పిన రఘురామరాజు.. అలా స్టిక్కర్లు పీకేసిన వారిపై జగన్ సర్కార్ చర్చలు తీసుకుంటుందేమోనని అనుమానం కలుగుతోందనిఅన్నారు.
ఏపీ ముఖ్యమంత్రి జగన్ నార్సిసిజం అనే మానసిక రుగ్మతతో బాధపడుతున్నారని రఘురామరాజు అన్నారు. నార్సిసిజం అనేది తనను తాను అతిగా ప్రేమించుకునే మానసిక రుగ్మత పేరు అని వివరించారు.