ఎన్డీయే కూటమితో జనత దళ్ (యు) తెగ తెంపులు
posted on Jun 17, 2013 @ 1:05PM
గత 17 ఏళ్లుగా ఎన్డీయే కూటమితో కలిసి సాగుతున్న జనత దళ్ (యు) బీజేపీ మోడీని ప్రధాని అభ్యర్ధిగా ముందుకు తీసుకు వస్తుండటంతో కూటమి లోంచి బయటపడాలని నిశ్చయించుకొంది. అదీగాక, ఆ పార్టీకి చెందిన బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తన రాష్ట్రానికి ప్రత్యేక రాష్ట్ర హోదా, నిధులు కావాలంటూ చేసిన డిమాండ్ కు కాంగ్రెస్ సూచన ప్రాయంగా అంగీకరించడంతో నేడు కాకపోయినా రేపయినా కాంగ్రెస్ సారధ్యంలో నడుస్తున్న యుపీయే కూటమిలో చేరే అవకాశం ఉంది. ఇటువంటి నేపద్యంలో నితీష్ కుమార్ ప్రభుత్వంలో కొనసాగుతున్న 11 మంది బీజేపీకి చెందిన మంత్రులు రెండు పార్టీల మధ్య ఏర్పడిన విబేధాల కారణంగా గత కొద్ది రోజులుగా విధులకు హాజరు కాకపోవడంతో నితీష్ కుమార్ వారిని తన క్యాబినెట్ లోంచి డిస్మిస్ చేశారు. దీనితో రెండు పార్టీలు తెగతెంపులు చేసుకోవడం కూడా పూర్తయింది గనుక, జె.డీ.(యు) అధ్యక్షుడు శరద్ యాదవ్ తాము ఎన్డీయే కూటమి నుండి వైతోలగుతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. అద్వానీ, వాజ్ పేయి వంటి గొప్ప నేతలను చూసి తాము ఎన్డీయే లోకి వచ్చామని, కానీ ఇప్పుడా పరిస్థితులు లేకపోవడంతో తాము తప్పనిసరి పరిస్థితుల్లో వైదొలగుతున్నామని ఆయన ప్రకటించారు.
ఒకేసారి 11మంది మంత్రులను తొలగించినందున నితీష్ కుమార్ ప్రభుత్వం ఈ నెల 19న శాసనసభలో తన బల నిరూపణకు సిద్దం అవుతున్నారు.