ఒక్కొక్కటి కాదు జగన్..
posted on Mar 16, 2021 @ 2:47PM
అమరావతి అసైన్డ్ భూముల వ్యవహారంలో టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు సీఐడీ అధికారులు నోటీసులు ఇవ్వడంపై రాజకీయ రచ్చ జరుగుతోంది. చంద్రబాబుకు నోటీసులపై మాజీ ఎంపీ, టీడీపీ సీనియర్ జేసీ దివాకర్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మా సీఎం.. మా వాడు అంటూనే జగన్‌ను టార్గెట్ చేశారు జేసీ దివాకర్ రెడ్డి. చంద్రబాబుకు ఒక్క కానిస్టేబుల్ మాత్రమే వెళ్లి ఒకే ఒక్క కాగితం ఇచ్చాడు.. కానీ మా సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి, ఎంపీ విజయసాయి రెడ్డికి నోటీసులు ఇవ్వాలంటే లారీలు కావాలని చెప్పారు. చంద్రబాబుకు సీఐడీ ఒక్క పేజీలో మాత్రమే నోటీసు ఇచ్చింది. అదే జగన్‌కు ఇవ్వాల్సి వస్తే లారీల్లో తీసుకెళ్లాలి అంటూ జేసీ సెటైర్లు వేశారు.
తెలంగాణ అసెంబ్లీకి వెళ్లిన జేసీ దివాకర్ రెడ్డి... సీఎల్పీ కార్యాలయానికి వెళ్లారు. అక్కడ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతలతో చాలా సేపు మాట్లాడారు. సీఎల్పీ నుంచి బయటికొచ్చాక మీడియాతో మాట్లాడుతూ... చంద్రబాబుకు నోటీసులు, ఏపీ రాజధానిపై పలు విషయాలు చెప్పారు జేసీ. దొనకొండ లేదా వైజాగ్ రాజధాని చేయాలని చంద్రబాబుకు తాము ఆనాడే చెప్పామన్నారు. ఒకసారి నిర్ణయం జరిగిన తర్వాత మార్చడం సరికాదని చంద్రబాబు చెప్పారని జేసీ తెలిపారు.