బీజేపీ ఓటమే పవన్ లక్ష్యమా?
posted on Mar 26, 2021 @ 9:14PM
బీజేపీ అంటే పవన్ కల్యాణ్ చాలా కోపంగా ఉన్నారా? ఆ పార్టీ ఓటమే ఆయన లక్ష్యమా? అంటే జనసేన వ్యూహాలు, పవన్ కల్యాణ్ అడుగులు చూస్తున్న వారికి అలానే అనిపిస్తోంది. ప్రస్తుతం బీజేపీ-జనసేన మిత్రపక్షాలుగా కొనసాగుతున్నాయి. తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థికి పవన్ కల్యాణ్ మద్దతు తెలిపారు. అయితే తిరుపతిలో తామే పోటీ చేసి తీరుతామని గట్టిగా పట్టుబట్టిన పవన్ కల్యాణ్.. వెనక్కి తగ్గడంపై అనుమానాలు వచ్చాయి. ఇప్పుడు వాటికి అనుగుణంగా జనసేన వ్యూహాలు మారుతున్నట్లు కనిపిస్తోంది.
నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ అసెంబ్లీ ఉప ఎన్నికకు సమయం దగ్గర పడుతున్న కొద్ది రాజకీయ సమీకరణలు మారిపోతున్నాయి. జనసేన కూడా నాగార్జున సాగర్‌లో పోటీ చేస్తోందనే ప్రచారం జరుగుతోంది. ఈ ఉప ఎన్నికలో ఎస్టీ సామాజికవర్గానికి చెందిన అభ్యర్థిని దింపాలని జనసేనాని పవన్ కల్యాణ్ భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఎన్నిక ప్రక్రయ కోసం ప్రచార కమిటీని కూడా ఏర్పాటు చేసేందుకు సన్నాహకాలు చేస్తునట్లు ఆ పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. బీజేపీ సాగర్ లో ఎస్టీ అభ్యర్థిని బరిలోకి దింపాలని డిసైడ్ అయిందని ప్రచారం జరుగుతోంది. రవి నాయక్ బీజేపీ క్యాండిడేట్ గా పోటీ చేస్తారని చెబుతున్నారు.అయితే బీజేపీకి మిత్రపక్షంగా ఉన్న జనసేన నాగార్జున సాగర్ లో పోటీ చేయడమే సంచలనం అయితే... బీజేపీ నుంచి పోటీ చేస్తారని భావిస్తున్న ఎస్టీ సామాజిక వర్గం నుంచే జనసేన అభ్యర్థి ఉంటారని తెలుస్తుండటం మరింత సంచలనంగా మారుతోంది.
నాగార్జున సాగర్ లో జనసేన పోటీ అంశం ఇప్పుడు రాజకీయవర్గాల్లో హాట్‌టాపిక్ అవుతోంది. పవన్ కల్యాణ్ సాగర్ లో అభ్యర్థిని పోటీలో పెడితే బీజేపీకి నష్టమనే చర్చ జరుగుతోంది. దీంతో బీజేపీని ఓడించడమే లక్ష్యంగా పవన్ కల్యాణ్ ఎత్తులు వేస్తున్నారని చెబుతున్నారు. అందుకే బీజేపీ నిలబెట్టాలనుకుంటున్న ఎస్టీ వర్గం నుంచే అభ్యర్థిని ఎంపిక చేస్తున్నారనే చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది.
ఇటీవలే తెలంగాణ బీజేపీ నేతలపై ఘాటు ఆరోపణలు చేశారు పవన్ కల్యాణ్. గ్రేటర్‌లో సహకరించిన తమను బీజేపీ నేతలు పదేపదే అవమానిస్తున్నారని చెప్పారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో పోటీ చేయాలని ముందు జనసేన భావించింది. అయితే బీజేపీ నేతల విజ్ఞప్తి మేరకు జనసేన పోటీ నుంచి తప్పుకుంది. గ్రేటర్‌లో బీజేపీ అభ్యర్థుల గెలుపు కోసం జనసేన కృషి చేసింది. తాము బీజేపీ గెలుపు కోసం కష్టపడినా.. తెలంగాణ బీజేపీ నేతలు తమను చులకన చేసి మాట్లాడారని జనసేన నేతలు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ బీజేపీ, జనసేన మధ్య గ్యాప్ వచ్చింది. ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థి వాణీదేవికి పవన్ మద్దతు ప్రకటించారు. ఈ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయింది. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల తరహాలోనే నాగార్జున సాగర్ లో తెలంగాణ బీజేపీకి జనసేన షాకివ్వబోతుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు .