Read more!

జానా - కోమటిరెడ్డి భాయీ భాయీ

 

ఇన్నాళ్లూ నల్లగొండ జిల్లాలో కాంగ్రెస్‌లో ఉప్పు-నిప్పులా ఉన్న మాజీ మంత్రులు కె.జానారెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి వర్గాలు ఒక్కటయ్యాయి. వర్గ విభేదాలు, ఆధిపత్య పోరును తాత్కాలికంగా పక్కనపెట్టి ఎన్నికల్లో ఐక్యంగా ముందుకు వెళ్లేందుకు సిద్ధమయ్యాయి. పార్టీ వర్గాల సమాచారం మేరకు కోమటిరెడ్డి నివాసంలో విందు సమావేశాన్ని నిర్వహించారు. జానారెడ్డితోపాటు నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, దేవరకొండ ఎమ్మెల్యే బాలూనాయక్, నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య దీనికి హాజరయ్యారు. టీపీసీసీ అధ్యక్ష పదవి తనకే దక్కుతుందని భావించి చివరి నిమిషంలో భంగపడిన కుందూరు జానారెడ్డి, తెలంగాణ సాధనలో మంత్రి పదవిని త్యాగం చేసి ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొన్నా రాజకీయంగా కలిసి రావడం లేదని భావించిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి సొంత జిల్లాలో వర్గపోరుకు అడ్డుకట్ట వేయాలనే నిర్ణయానికి వచ్చి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిసింది. వాస్తవానికి నల్లగొండ జిల్లాలో మొత్తం నాలుగు గ్రూపులున్నాయి. కోమటిరెడ్డి, జానారెడ్డి ఒక్కటి కావడంతో టీపీసీసీ వర్కింగ్ అధ్యక్షుడు కెప్టెన్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి, రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి వర్గాలు కూడా ఒక్కటైనట్లు తెలుస్తోంది.