జగన్ భార్య భారతి ఆవేదన
posted on Mar 27, 2013 @ 4:54PM
జగన్ను అరెస్టుచేసి నేటికి 10 నెలలు పూర్తయింది. ఈ సందర్భంలో ఆయన అర్ధాంగి శ్రీమతి భారతి తన ఆవేదనను అక్షర రూపంలో వ్యక్తం చేసారు. 10 నెలల జైలు జీవితం గడిపిన తరువాత కూడా జగన్ లో ఇసుమంత అదైర్యం కానరాలేదు. దేవుని దయ ఆయనపై ఉన్నందునే ఆయనకు ఇన్ని కష్టాలను తట్టుకొని ఎదురు నిలువ గలిగే శక్తి కలిగింది.
ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని పాలిస్తున్న కిరణ్ కుమార్ రెడ్డి, ప్రతిపక్ష నాయకుడిగా ప్రజలలో తిరుగుతున్న చంద్రబాబు చేయలేని పనిని జగన్ జైలులో నాలుగు గోడల మద్య ఉండే చేయించగలుగుతున్నారు. ప్రజలను కష్ట పెడుతున్న ప్రభుత్వానికి వ్యతిరేఖంగా తన పార్టీ చేత, తన అనుచరుల చేత అవిశ్వాసం పెటించినపుడు ప్రజల కష్టాలను చూసి కన్నీళ్లు కారుస్తున్న చంద్రబాబు ప్రభుత్వానికి మద్దతు పలికారు.
డిల్లీ చుట్టూ తిరిగి ముఖ్యమంత్రి పదవి సంపాదించుకొన్న సీల్డ్ కవర్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ అధికారం చెప్పటిన తరువాత రాష్ట్రానికి ఏమి మేలు చేయగలిగారు. తన పరిపాలనకు తానూ శబాషీలు ఇచ్చుకోవడం కాదు, ఆ పని ప్రజలు చేసినప్పుడు గొప్పదనం తెలుస్తుంది. ఢిల్లీలో పెద్దలను కాకా పట్టడం, తప్పుడు నివేదికలు ఇవ్వడం తప్ప పరిపాలన గురించి ఆయనకేమి తెలియదు.
చంద్రబాబును వెన్ను పోటు పొడిచారని నిత్యం విమర్శించే కిరణ్ కుమార్ వైయస్సార్ గారి అండతో రాజకీయంగా పైకెదిగి ముఖ్యమంత్రి అయిన తరువాత తనకు రాజకీయ జీవితం ప్రసాదించిన వైయస్సార్ పేరును ఎఫ్ఐఆర్లో చేర్పించి మోసం చేసారు.
ప్రజలను కష్ట పెట్టడం తప్ప ఈ 18 నెలలో ఈ రాష్ట్రానికి చేసిన మేలు ఏమి లేదు. కనీసం స్వంత నియోజక వర్గాన్ని కూడా పట్టించుకోలేదు. ఆయన తన పరిపాలన గురించి ప్రజలను అడిగే ధైర్యం చేయగలరా? అప్పుడు ప్రజలు మాట్లాడితే వినే ధైర్యం ఆయనకుందా?
జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని 150 మంది ఎమ్మెల్యేలు సంతకాలు చేసిచ్చిన తరువాత కూడా కాంగ్రెస్ అధిష్టానం ఆదేశాల మేరకు రోశయ్యగారికి తన మద్దతు ప్రకటించిన గొప్ప వ్యక్తి జగన్. డిల్లీ పెద్దలు ముందుగా కేంద్ర మంత్రి పదవి, తరువాత ముఖ్యమంత్రి పదవి ఇస్తామని హామీ ఇచ్చినప్పటికీ, ప్రజలకు ఇచ్చిన మాటకు కట్టుబడి పార్టీ నుండి బయటకి వచ్చి ప్రజలకోసం పోరాడిన గొప్ప వ్యక్తీ జగన్.
ప్రజల కోసం రెండున్నర సంవత్సరాలు ఎండనకా, వాననకా, రాత్రనకా, పగలనకా ప్రజలలో తిరుగుతూ ప్రజల ఇంట్లో ఒక సోదరుడిలా, కొడుకులాగా, మమేకమయ్యారు. అందుకు శిక్షగా కాంగ్రెస్, తెలుగుదేశం, సీబీఐలు కలిసి కుట్రలు పన్ని జగన్ను జైలులోకి పంపించాయి.
కిరణ్ కుమార్ రెడ్డికి, చంద్రబాబుకి కూడా జగన్ మోహన్ రెడ్డికి ఉండే చిత్తశుద్ధిలో, కార్యదక్షతలో, పట్టుదలలోనూరవవంతు కూడా లేదు. జగన్ కు ఉన్నదీ వీరిద్దరికీ బొత్తిగా లేనిది దేవుని దయ. దేవుని తోడు ఉన్న జగన్కు వ్యతిరేకంగా అన్యాయం, అక్రమం చేసేవారి దవడ ఎముకలు దేవుడు విరగ్గొట్టే సమయం ఎంతో దూరంలో లేదు.