తెదేపాతో మైండ్ గేమ్స్ ఆడుతున్న వైకాపా

 

తెలుగు దేశం పార్టీ నాయకుడు పయ్యావుల కేశవ్ త్వరలో తమ పార్టీలో చేరబోతున్నాడంటూ కొద్ది నెలలక్రితం వైకాపా ఆడిన మైండ్ గేమ్ కి ఆయన మీడియా ముందు కన్నీళ్ళు పెట్టుకొని బాధపడిన సంగతి అందరికీ తెలిసిందే. వివిధ పార్టీలకి చెందిన సీనియర్ నాయకులు కూడా త్వరలోనే తమ పార్టీలో చేరబోతున్నారంటూ ఆ పార్టీ ఆడిన మైండ్ గేమ్ దెబ్బకి అన్ని పార్టీలలో అలజడి రేగింది. ఆ విధంగా తమ ప్రత్యర్ధి పార్టీలలో గందరగోళం సృష్టించి, ఒకరినొకరు అనుమానించుకొనే విధంగా చేయగలిగితే తమ ప్రత్యర్ధులు, వారి పార్టీలు బలహీనపడవచ్చని వైకాపా ఆలోచన కావచ్చును.

 

ఇప్పుడు మళ్ళీ అదే అస్త్రాన్ని వైకాపా ఈసారి జూ.యన్టీఆర్ మీద ప్రయోగించినట్లు కనబడుతోంది. మూడు రోజుల క్రితం, మచిలీపట్నంలో షర్మిల పాదయాత్ర సందర్భంగా వైకాపా కార్యకర్తలు ఏర్పాటు చేసిన ఒక ఫ్లెక్సీ బ్యానర్ మీద కొడాలి నాని పక్కన జూ.యన్టీఆర్ చిత్రాన్ని ముద్రించడంతో తెదేపా శ్రేణుల్లో కలకలం రేగింది. కానీ, ఆ బ్యానర్ ను ఏర్పాటు చేసిన వ్యక్తి తానూ యన్టీఆర్ కు, కొడాలి నానికి వీరాభిమానినని అందువల్లే వారిరువురి చిత్రాన్ని వేసి బ్యానర్ పెట్టానని సంజాయిషీ ఇచ్చుకోవడంతో ఆ కధ అక్కడితో ముగిసిపోయిందని అందరూ భావించారు.

 

అయితే, మళ్ళీ నిన్న అటువంటి బ్యానరే మరొకటి విజయవాడలో (షర్మిల పాదయాత్రకు జూ.యన్టీఆర్ స్వాగతం చెపుతున్నట్లు) ఏర్పాటుచేయడంతో తెదేపా నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో వెంటనే దానిని పోలీసులు తొలగించారు.

 

నీతి నిజాయితీ, విశ్వాసనీయత వంటి సకల మంచి లక్షణాలకు పేటెంట్ హక్కులు తమకే ఉన్నాయని నిత్యం గొప్పలు చెప్పుకొనే వైకాపా ఇటువంటి నీచ రాజకీయాలు చేయడం వలన ఆ పార్టీ నేతల మాటలకి విశ్వసనీయత కోల్పోవడం ఖాయం. రాజకీయ చైతన్యం కలిగిన ప్రజలకి ఇటువంటి నీచ రాజకీయాలను అర్ధం చేసుకోవడం పెద్ద కష్టం కాదు.

 

మాటలకి చేతలకి మద్యన పొంతన లేనప్పుడు, నీతి ప్రవచనాలతో ప్రజలను ఎల్లకాలం మభ్య పెట్టడం ఎవరికయినా అసాద్యం. ఇప్పటికే భ్రష్టు పట్టిపోయిన మన రాజకీయాలని ఇటువంటి మైండ్ గేమ్స్ తో మరింత భ్రష్టు పట్టిస్తే అది తిరిగి ఏదో ఒకనాడు ఆ పార్టీనే దెబ్బతీయవచ్చును. ఎదుట కొంపకి నిప్పు పెట్టి ఆనందిద్దామని అనుకొంటే రేపు తన కొంపకీ ఆ మంట అంటుకోకమానదని వైకాపా తెలుసుకోవడం మంచిది. ఈ రోజు ఆ పార్టీ మొదలుపెట్టిన ఆటనే రేపు ఇతర పార్టీలు కూడా ఆడటం మొదలుపెడితే అప్పుడు తానూ తవ్విన గోతిలో తానే తప్పక పడుతుంది.

 

కొడాలి నానితో జూ.యన్టీఆర్ కి ఉన్న సినిమా అనుబంధం వలన వారిరువురి మద్య స్నేహం ఉండిఉండవచ్చును. అయితే, దానిని ఈ విధంగా రాజకీయం చేయడం వలన తాత్కాలికంగా వైకాపాకు ప్రయోజనం కలిగించినా, అదే అంశం పట్ల మీడియాలో జరుగుతున్న చర్చలు, విశ్లేషణలు ఆ పార్టీపట్ల ప్రజలలో వ్యతిరేఖత ఏర్పరచగలదు కూడా.

 

ఈ బ్యానర్ రాజకీయాలతో తమకి ఏ సంబందము లేదని, తమకి తెలియకుండా ఇదంతా జరిగిందని వైకాపా చెప్పుకోలేదు. ఎందుకంటే, ఇంత జరుగుతున్నా కూడా ఆ పార్టీ నేతలెవరూ కూడా దీనిని ఖండించడం లేదు. మళ్ళీ అటువంటివి పునారావృతం కాకుండా తగిన చర్యలు కూడా చెప్పట్టకపోవడం వలననే మళ్ళీ నిన్న మరో బ్యానర్ వెలిసి వైకాపా నిజాయితీని శంకించేలా చేస్తోంది.

 

చివరికి జూ.యన్టీఆర్ కి స్నేహితుడుగా భావిస్తున్న వైకాపా నేత కొడాలి నాని కూడా ఈ విషయం పై స్పందించక పోవడం చూస్తుంటే ఇదంతా ఉద్దేశ్య పూర్వకంగానే వైకాపా ఆడుతున్న మైండ్ గేమ్ అనుకోక తప్పదు. జూ.యన్టీఆర్ బొమ్మను వాడుకొని తెదేపాలో చిచ్చు పెట్టేందుకు వైకాపా ప్రయత్నించడం ఆ పార్టీ దైన్య స్థితిని తెలియజేస్తుంది తప్ప మరొకటి కాదు.