మోడీ అప్పాయింట్ కోసం జగన్ పడిగాపులు?.. పక్షం రోజులుగా ఎదురుచూపులు!
posted on Mar 6, 2024 @ 1:16PM
గత ఐదేళ్లుగా ఇష్టారాజ్యంగా అప్పులు చేయడానికీ, అప్పుల పరిమితితో సంబంధం లేకుండా రుణాలు పొందడానికి జగన్ కు అన్ని విధాలుగా సహకారం అందించిన కేంద్రంలోని మోడీ సర్కార్ ఇప్పుడు ముఖం చాటేస్తోందా? అసలు ఏపీ సీఎం కు అప్పాయింట్ మెంట్ ఇచ్చేందుకే మోడీ సుముఖంగా లేరా అంటే గత పక్షం రోజులుగా పరిస్థితిని గమనిస్తున్న పరిశీలకులు ఔననే అంటున్నారు. సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ మరో పది పదిహేను రోజుల లోపే వచ్చే అవకాశాలున్నాయన్న అంచనాల నేపథ్యంలో జగన్ ఎన్నికల ప్రకటన వెలువడేలోగానే మరిన్ని సంక్షేమ పథకాలను ప్రకటించాలని భావిస్తున్నారు.
అయితే తన ఐదేళ్ల పాలనను చూసిన జనం కేవలం ప్రకటనలను నమ్మరన్న భావన కూడా ఆయనలో బలంగా ఉంది. అందుకే కేవలం ప్రకటనకే పరిమితం కాకుండా.. ఏదో మేరకు ఆ పథకాల లబ్ధిదారులను సొమ్ములను పందేరం చేయాలని భావిస్తున్నారు. అయితే ప్రభుత్వాన్ని నడపడానికే కటకటలాడుతున్న పరిస్థితుల్లో కొత్త పథకాల పందేరానికి తీవ్రమైన నిధుల కొరత ఉండటంతో రుణం కోసం డిస్పరేట్ గా ప్రయత్నాలు చేస్తున్నారు. అడ్డగోలుగా ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెట్టేసినా, కోట్లకు కోట్ల ప్రతి నెలా అప్పులు తీసుకువచ్చినా ఏ నెలకానెల గడవడమే గగనంగా మారిన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చూసి ఎవరూ అప్పులు ఇచ్చేందుకు ముందుకు రావడం లేదు. చివరాఖరికి సెక్రటేరియెట్ ను కూడా తాకట్టు పెట్టేసిన జగన్ నిర్వాకాన్ని చూసి ఆర్థిక నిపుణులు సైతం ముక్కున వేలేసుకుని, నోటమాట రాక నివ్వెరపోతున్న పరిస్థితి.
సర్వ నిబంధనలకూ తిలోదకాలోదిలేసి జగన్ ఈ ఐదేళ్లుగా సాగించిన ఆర్థిక ఆరాచక విధానాలకు ఇప్పుడు ఎన్నికల ముంగిట కేంద్రం చెక్ పెట్టడానికి రెడీ అయ్యిందని పరిశీలకులు అంటున్నారు. అందుకే గత పక్షం రోజులుగా జగన్ అండ్ కో విశ్వ ప్రయత్నాలు చేస్తున్నా మోడీ అప్పాయింట్ మెంట్ దక్కడం లేదని అంటున్నారు. నిజమే మోడీ అప్పాయింట్ మెంట్ ఎప్పుడు లభిస్తే అప్పుడు రెక్కలు కట్టుకుని మరీ హస్తనలో వాలిపోవడానికి జగన్ డిస్పరేట్ గా ఎదురు చూస్తున్నారు. అయితే మోడీ అప్పాయింట్ మెంట్ విషయంలో నో అన్న సమాధానం రాకపోయినా, ఆ అప్పాయింట్ మెంట్ మాత్రం ఫిక్స్ కావడం లేదని హస్తిన వర్గాలు చెబుతున్నాయి.
ఇక పది పదిహేను రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ విడుదల కానున్న నేపథ్యంలో మోడీ దేశ వ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. ఈ నెల 13 వరకూ ఆయన పర్యటనల్లో బిజీగా ఉంటారు. ఆ తరువాత ఒకటి రెండు రోజుల్లోనే ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో షెడ్యూల్ విడుదల లోగా జగన్ కు మోడీ అప్పాయింట్ మెంట్ దొరికే అవకాశాలు మృగ్యమేనన్నది పరిశీలకుల విశ్లేషణ. ఈ లోగా తెలుగుదేశం, జనసేన కూటమితో బీజేపీ జట్టుకట్టే విషయంపై అధికారిక ప్రకటన కూడా వచ్చే అవకాశం ఉంది. అదే జరిగితే ఇక జగన్ మోడీ అప్పాయింట్ మెంట్ కోసం ఎదురు చూడటం కూడా దండుగేనని అంటున్నారు. ఈ పరిస్థితుల్లో కొత్త పథకాలతో సంక్షేమం పేరిట ఎన్నికలకు ముందు పందేరం చేయాలన్న జగన్ ఆశలు అడియాశలు కాకతప్పవని పరిశీలకులు అంటున్నారు. మోడీ అప్పాయింట్ మెంట్ పై ఆశతో తన చివరి కేబినెట్ భేటీని వాయిదాల మీద వాయిదాలు వేస్తూ వస్తున్న జగన్ ఇక ఆ భేటీ నిర్వహిస్తారా అన్న అనుమానాలూ వ్యక్తం అవుతున్నాయి.