లోక్ సభ ఎన్నికల రేసులో బీఆర్ఎస్ ఫేడౌట్!?
posted on Mar 6, 2024 @ 2:16PM
లోక్ సభ ఎన్నికల రేసులో బీఆర్ఎస్ ఫేడౌట్ అయిపోయిందా? అంటే పరిశీలకులే కాదు.. పార్టీ శ్రేణులూ ఔననే అంటున్నారు. అధికారంలో ఉన్నంత కాలం కంటి చూపుతో రాష్ట్ర రాజకీయాలను శాసించిన మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఇప్పుడు కనీసం తన పార్టీ నేతలను, క్యాడర్ ను కూడా కదిలించలేకపోతున్నారు.
ఇటీవలి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో పార్టీని విజయపథంలో నడిపించడంలో విఫలమైన కేసీఆర్.. ఒక్క ఓటమితో పార్టీపై పూర్తిగా పట్టు కోల్పోయారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. రాజయం పాలైన మూడు నెలలలోనే బీఆర్ఎస్ అస్థిత్వమే ప్రశ్నార్ధకంగా మారిన పరిస్ధితులు నెలకొన్నాయని అంటున్నారు. ఓటమి నుంచి తేరుకుని లోక్ సభ ఎన్నికలకు సమాయత్తం కావాల్సిన తరుణంలో పార్టీలో వలసలు ఆ పార్టీ అగ్రనాయకత్వం ఎంతటి నిస్సహాయ స్థితిలో ఉందో అవగతమయ్యేలా చేస్తున్నాయంటున్నారు.
వచ్చే లోక్ సభ ఎన్నికలలో రాష్ట్రంలోని 17 స్థానాలలో నిలబడేందుకు అభ్యర్థులే దొరకని దయనీయ స్థితికి పార్టీ దిగజారిపోవడం నాయకత్వ లోపంగానే పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అధికారంలో ఉన్న సమయంలో సొంత పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలకే అధినేత దర్శనం దుర్లభం అనే పరిస్థితులు ఉంటే ఇప్పుడు పరిస్థితి పూర్తిగా తారుమారైందని అంటున్నారు. ఇప్పుడు అధినేత ఆదేశించినా నేతలు వినే పరిస్థితుల్లో లేరని చెబుతున్నారు. ఏకంగా గత ఎన్నికలలో విజయం సాధించిన ఎమ్మెల్యేలే పక్క చూపులు చూస్తున్నారంటే పార్టీ నాయకత్వంపై వారి విశ్వసం ఎంతగా సన్నిగిల్లిందో అర్ధమౌతోందంటున్నారు.
ఇక సిట్టింగ్ ఎంపీలు కూడా ఎన్నికల ముంగిట పార్టీని వీడుతున్నారంటే.. ఆ పార్టలో ఉండి పోటీ చేస్తే గెలిచే పరిస్థితులు లేవన్నది స్పష్టంగా అవగతమౌతోంది. ఇప్పటికే ముగ్గురు సిట్టింగ్ ఎంపీలు పార్టీని వదిలేశారు. ఇక చేవెళ్ల ఎంపీ అయితే తాను పోటీ చేసే ప్రశక్తే లేదని కుండబద్దలు కొట్టేశారు. అంటే సిట్టింగ్ ఎంపీలలో నలుగురు కాడె వదిలేసినట్లేనని చెప్పవచ్చు. ఇంకా మహమూబ్ నగర్ ఎంపీ మన్నె శ్రీనివాస్ కూడా టికెట్ ప్రకటించినా పోటీ చేస్తారన్న నమ్మకం లేదని ఆయన అనుచరులు చెబుతున్నారు. ఇప్పటికే టికెట్ ఖరారు చేసిన నామా నాగేశ్వరరావు బీజేపీ వైపు చూస్తున్నారు. మొత్తంగా అన్ని స్థానాల్లోనూ అభ్యర్థులను నిలబెట్టేందుకే బీఆర్ఎస్ అధినేత నానా కష్టాలూ పడుతున్న పరిస్థితి చూస్తుంటే లోక్ సభ ఎన్నికల రేసులోంచి బీఆర్ఎస్ పూర్తిగా ఫేడౌట్ అయిపోయినట్లే కనిపిస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
బీఆర్ఎస్ అధికారంలో ఉన్నంత కాలం డిఫాక్టో సీఎంగా వ్యవహరించిన బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, పార్టీలో ట్రబుల్ షూటర్ గా గుర్తింపు పొందిన హరీష్ రావు వంటి నేతలు కూడా పార్టీ వ్యవహారాలలో పెద్దగా జోక్యం చేసుకోకుండా, కేవలం ప్రకటనలు, విమర్శలకు పరిమితమౌతుండటం చూస్తుంటే.. బీఆర్ఎస్ ఇప్పట్లో పుంజుకునే అవకాశాలు మృగ్యమని అంటున్నారు.