పవన్ సీఎం.. జగన్‌లో కలవరం..
posted on Mar 30, 2021 @ 5:55PM
మా సీఎం అభ్యర్థి పవన్ కల్యాణ్. ఏపీ బీజేపీ అధ్యక్షులు సోము వీర్రాజు సంచలన ప్రకటన. తిరుపతి ఉప ఎన్నికల కోసమే ఈ స్టేట్‌మెంట్ అంటూ ప్రత్యర్థి పార్టీల విమర్శ. మిగతా పార్టీల సంగతి ఏంటో గానీ.. అధికార వైసీపీలో మాత్రం ఈ ప్రకటన ప్రకంపణలు సృష్టిస్తోంది. బీజేపీ. జనసేన కలిసి పోటీ చేయడం ఫ్యాన్ పార్టీకి సంకటమే. అలాంటిది పవన్ కల్యాణ్ సీఎం కేండిడేట్ అంటూ ఎన్నికల బరిలో దిగితే వైసీపీ ఓట్లు భారీగా డైవర్ట్ అయ్యే అవకాశం ఉంది. గత ఎన్నికల్లో బీజేపీ, జనసేన వేరు వేరుగా పోటీ చేయడంతో ఆ మేరకు వైసీపీ లాభపడింది. ఈ సారి సీన్ అలా ఉండబోదని.. జగన్ పార్టీ సీన్ సితారా కావడం ఖాయమంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
పవన్ అంటే ఓ పేరు కాదు. అదో పవర్. అభిమానులకు పూనకం తెప్పించే ఎమోషన్. పవర్ స్టార్‌ను పవర్‌లో చూడాలనేది ఫ్యాన్స్ కోరిక. ఆయన కనిపిస్తేనే ఊగిపోతారు. నినాదాలతో హోరెత్తిస్తారు. కానీ, ఓటేయమంటే సైడ్ అయిపోతారు. గత ఎన్నికల్లో ఇదే జరిగింది. ఈసారి మాత్రం అలా జరగబోదంటోంది జనసేన. తొలిసారి కాబట్టి జగన్‌కు ఒక్క ఛాన్స్ ఇచ్చారు. ఇప్పుడు ఆ ఛాన్స్ ఎందుకిచ్చామా అని జనం తల పట్టుకుంటున్నారు. రెండేళ్లలోనే జగన్ ఎంత డేంజరో జనాలకి తెలిసొచ్చింది. రాష్ట్రాన్ని దివాళా అంచున నిలబెట్టిన జగన్‌ను ప్రజలు ఈసడించుకుంటున్నారు. జగన్‌కు ప్రత్యామ్నాయం జనసేనానే అంటున్నారు ఆయన అభిమానులు.
2019లో కామ్రేడ్లు, బీఎస్పీతో కలిసి బరిలో దిగారు పవన్ కల్యాణ్. ఎన్నికలయ్యాక మీకేమైనా బాకీనా? అంటూ కామ్రేడ్లతో దోస్తీకి కటీఫ్ చెప్పారు. మోదీనే బెస్ట్ అంటూ బీజేపీతో జత కలిశారు. తెలంగాణ బీజేపీతో సంబంధాలు చెడినా.. ఏపీ బీజేపీతో మైత్రి బంధం ప్రస్తుతానికైతే బాగానే నడుస్తోంది. ముందుముందూ నడుస్తుందని ఆశిస్తున్నారు. తిరుపతి ఎంపీ ఉప ఎన్నికల్లో పోటీ చేయాలని జనసేన గట్టిగా ప్రయత్నించింది. గత ఎంపీ ఎలక్షన్లలో బీజేపీకంటే తమకే ఎక్కువ ఓట్లు వచ్చాయని ఆ లెక్కలన్నీ ముందేసింది. అయినా, కమలనాథులు కనికరించలేదు. తిరుపతి సీటు జనసేనకు ఇవ్వలేదు. కానీ, అనూహ్యంగా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, జనసేన కూటమి తరఫున ముఖ్యమంత్రి అభ్యర్థి పవన్ కల్యాణే అంటూ సంచలన ప్రకటన చేశారు సోము వీర్రాజు. పీకే క్రేజ్‌ను తిరుపతి బై పోల్‌లో ఫుల్‌గా క్యాష్ చేసుకునేందుకే ఈ స్టేట్‌మెంట్ ఇచ్చారని కొందరు అంటున్నారు. అయితే, అలాంటిదేమీ లేదని.. ఏపీలో బీజేపీ ఇంకా సీఎం కుర్చీకి పోటీ పడే స్థాయికి చేరుకోలేదని చెబుతున్నారు. ముందు తమ మిత్రుడు పవన్ కల్యాణ్‌కు ఛాన్స్ ఇచ్చి.. ఆ తర్వాత పార్టీ పరంగా మరింత బలపడి.. ఆ తర్వాత సంగతి తర్వాత చూసుకోవచ్చనే ఆలోచనలో కమలదళం ఉందని విశ్లేషిస్తున్నారు.
సీఎం కేండిడేట్‌గా పవన్ కల్యాణ్ పేరును ఇప్పుడే తెరమీదకు తీసుకురావడం వ్యూహాత్మకమంటున్నారు. అయితే, ఈ ప్రకటన అధికార వైసీపీని కలవరపాటుకు గురి చేస్తోంది. ఏపీకి అన్యాయం చేసిన పార్టీగా బీజేపీపై గుర్రుగా ఉన్నారు ఏపీ ప్రజలు. ఎంతగా టెంపుల్ పాలిటిక్స్ చేస్తున్నా.. ఓటర్లను ఆకర్షించలేకపోతున్నారు. అటు, పవన్ కల్యాణ్ టైం పాస్ పాలిటిక్స్ చేస్తూ.. అప్పుడప్పుడూ ఆవేశంగా ఊగిపోతూ.. ఆ తర్వాత కొంతకాలం సినిమాలు చేస్తూ.. ఇలా రెండు పడవలపై కాళ్లు పెట్టి ప్రయాణం సాగిస్తున్నారు. ఆ రెండు పార్టీల మైనస్‌లు ఇన్నాళ్లూ వైసీపీకి పాజిటివ్‌గా మారాయి. ఇటీవల ముగిసిన స్థానిక సమరంలో జనసేన చెప్పుకోదగ్గ సంఖ్యలో స్థానాలు గెలుచుకోవడం అధికార పార్టీకి షాక్ ఇచ్చింది. ఇక ప్రజల్లో హీరో పరంగా ఫుల్ క్రేజ్ ఉన్న పీకే.. సీఎం కేండిడేట్‌గా బీజేపీ మద్దతుతో తెర మీదకు వస్తే.. అది వైసీపీకి పిడుగుపాటే. ఇప్పటికే మద్యం ధరలు, ఇసుక ధరలు, అభివృద్ధి తిరోగమనం తదితర అంశాలతో జగన్‌పై వ్యతిరేకత ఉన్న ఆ పార్టీ సానుభూతి వర్గం ఓట్లు చెప్పుకోదగ్గ స్థాయిలో జనసేన వైపు షిఫ్ట్ అయ్యే అవకాశం లేకపోలేదు. టీడీపీ ఓట్లు ఎలానూ టీడీపీకే పడతాయి కాబట్టి.. పవన్ కల్యాణ్‌ను సీఎం అభ్యర్థిగా ప్రకటించడం అధికార పార్టీ ఓట్లకే చిల్లు. అందుకే, సోము వీర్రాజు ప్రకటన చేసినప్పటి నుంచీ వైసీపీలో కలకలం చెలరేగుతోంది. పైకి గంభీరంగా ఉంటున్నా.. లోలోన గుబులు మొదలైంది.