హైదరాబాద్ లో కరోనా హాట్ స్పాట్స్
posted on Mar 30, 2021 @ 9:23PM
తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి పంజా విసురుతోంది. జీహెచ్ఎంసీలో ఆందోళనకరంగా కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. కరోనా సెకండ్ వేవ్ వచ్చిందనే భయాందోళన వ్యక్తమవుతోంది. దీంతో మహమ్మారి కట్టడి కోసం జీహెచ్ఎంసీ గట్టి చర్యలు చేపట్టింది. మరోసారి నగరంలో కంటైన్మెంట్ జోన్లను ఏర్పాటు చేసే యోచనలో అధికారులు ఉన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలోని కూకట్ పల్లి, జీడిమెట్ల, శేరిలింగంపల్లి, హిమాయత్ నగర్, చింతల్ బస్తీ, మలక్ పేట్, చాంద్రాయణగుట్ట, ఎల్బీనగర్ లను అధికారులు హాట్ స్పాట్స్ గా ప్రకటించారు. ఈ ప్రాంతాల్లో ఉన్నవారు మరింత అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.
ఇప్పటికే సిటీలో మాస్క్ మస్ట్ అనే ప్రచారంతో ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. ప్రత్యామ్నాయ చర్యలు చేపడితే కొంతవరకైనా కరోనా పాజిటివ్ కేసులు రాకుండా ఉంటాయని జీహెచ్ఎంసీ అభిప్రాయం వ్యక్తం చేస్తుంది. జీహెచ్‌ఎంసీలోని ప్రధాన కార్యాలయంలో కరోనా వేగంగా విస్తరిస్తోంది. కార్యాలయంలోని 3, 4, 5 అంతస్తుల్లో పని చేసే 10 మంది ఉద్యోగులకు కరోనా వచ్చింది. దీంతో ఉద్యోగులు డ్యూటీకి రావాలంటేనే భయపడిపోతున్నారు
మరోవైపు కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో మాస్కులపై వాహనదారులకు రాచకొండ టాఫిక్ పోలీసులు అవగాహన కల్పిస్తున్నారు. ప్రతిఒక్కరూ తప్పనిసరిగా మాస్కులు ధరించాలని సూచిస్తున్నారు. మాస్క్‌లు ధరించక పోతే కరోనా ఎలా వెంటాడుతుందో వాహన దారులకు తెలియజేస్తున్నారు. మంగళవారం మధ్యాహ్నం జూబ్లిహిల్స్ చెక్ పోస్ట్ వద్ద వాహనదారులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రజలంతా కచ్చితంగా మాస్కులు ధరించాలని ప్లకార్డులతో అవగాహన కల్పిస్తున్నారు. గుంపులు గుంపులుగా గేదరింగ్ అవ్వొద్దని చెబుతున్నారు. కరోనా నిబంధనలు పాటించాలని సూచిస్తున్నారు. మరి కొన్ని రోజుల పాటు స్పెషల్ డ్రైవ్‌లు నిర్వహిస్తామని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.