శాసనసభలో జగన్ కు మరోసారి భంగపాటు
posted on Sep 6, 2014 @ 3:31PM
వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ షరా మామూలుగానే ముందూ వెనుక చూసుకోకుండా అత్యుత్సాహానికి పోయి అధికార పార్టీని తప్పుపట్టబోయి, అధికార పార్టీ చేతిలో మరోమారు భంగపడ్డారు.
ఈరోజు కొంచెం ఆలస్యంగా శాసనసభకు వచ్చిన జగన్, అజెండాలో లేని బీసీ తీర్మానంపై ఏవిధంగా చర్చిస్తున్నారని, అసలు ప్రతిపక్షానికి ఎందుకు తెలియజేయలేదంటూ అధికార పార్టీపై విరుచుకు పడ్డారు. ప్రతీరోజూ అధికారపార్టీ సభ్యులు తనకు నియమ నిబంధనలు తెలియవని సభలో అందరి ముందు ఎద్దేవా చేస్తుండటంతో తీవ్ర ఆగ్రహంతో ఉన్న జగన్మోహన్ రెడ్డి, ఈరోజు తనకు ఆ విమర్శలను త్రిప్పికొట్టే అవకాశం దొరికిందని సభలో చెలరేగిపోయారు. కానీ ఆర్ధికమంత్రి యనమల రామకృష్ణుడు చెప్పిన జవాబుతో ఆయన కంగుతిన్నారు.
యనమల ఏమన్నారంటే, “మీరు సభకు ఆలస్యంగా వచ్చి సభలో ఏమి జరుగుతోందో తెలుసుకోకుండా మాట్లాడుతున్నారు. మమ్మల్ని విమర్శించేముందు కనీసం సభలో ఉన్న మీ పార్టీ సభ్యులను అడిగి తెలుసుకొన్నా బాగుండేది. కానీ సభా నియమాలు ఏమీ తెలుసుకోకుండా, బీసీ తీర్మానంపై చర్చ మొదలయిన తరువాత మధ్యలో ప్రవేశించి అది అజెండాలో లేదు కనుక దానిని మళ్ళీ మొదలుపెట్టమని అడగటం సభా నియమాల పట్ల మీకు అవగాహన లేదని స్పష్టంజేస్తోంది,” అని ఘాటుగా బదులిచ్చారు.
కానీ జగన్మోహన్ రెడ్డి కూడా ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా, అజెండా కాపీని చూపిస్తూ "దీనిలో ఈరోజు ఈ తీర్మానంపై చర్చిస్తామని ఎక్కడ వ్రాసి ఉందో చెప్పమంటూ" ఆయనను నిలదీసారు. “సభలో ఉన్న ప్రతిపక్షానికి తెలియపరచకుండా ఏవిధంగా చర్చ చేప్పట్టారు? అది ఏ నియమ నిబంధనల క్రింద వీలుపడుతుందో చెప్పమంటూ” చాలా ఆవేశంగా ప్రశించారు. కానీ ఆవిధంగా ప్రశ్నించి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ మరోమారు యనమల చేతిలో భంగపడక తప్పలేదు.
యనమల ఆయన ప్రశ్నకు సమాధానం ఇస్తూ, “ఈరోజు సభా సమావేశాలు మొదలయ్యే ముందే మేము స్పీకర్ గారిని ఈ అంశాన్ని అజెండాలో చేర్చమని కోరి ఈ అంశంపై చర్చకు అనుమతి కూడా తీసుకొన్నాము. ఆ విషయాన్ని స్పీకర్ గారు మీ సభ్యులకు కూడా తెలియజేసారు. కానీ మీరు ఇదేమీ తెలుసుకోకుండా మధ్యలో ప్రవేశించి అజెండాలో ఈ అంశం లేదు కనుక చర్చ జరగడానికి వీలులేదనో లేకపోతే మళ్ళీ మొదటి నుండి చర్చించాలని కోరడం మంచి పద్ధతి కాదు. ఇటువంటి ఆదేశాలు మీరు మీ పార్టీ సభ్యులకు మీ లోటస్ పాండ్ నివాసంలో నిరభ్యంతరంగా ఇచ్చుకోవచ్చును. కానీ ఇది మీ లోటస్ పాండ్ నివసమూ కాదు. ఇక్కడ జరుగుతున్నది మీ పార్టీ సమావేశం కాదు. కనుక సభలో మాట్లాడే ముందు విషయం తెలుసుకొని, సభా నియమ నిబంధనలు క్షుణ్ణంగా అవగాహన చేసుకొని ఆ తరువాతనే మాట్లాడితే ఇటువంటి పరిస్థితి ఎదురవదు,” అని జవాబిచ్చారు.
అప్పుడు స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు కూడా కలుగజేసుకొని, ఈ రోజు అజెండాలో బీసీ తీర్మానం ప్రవేశపెట్టి దానిపై చర్చకు అనుమతి తీసుకొందని, ఆవిషయాన్ని సభలో ఉన్న ప్రతిపక్ష సభ్యులకు కూడా తాను ముందే తెలియజేసానని, కనుక దీనిపై అనవసర రాద్దాంతం చేయవద్దని జగన్మోహన్ రెడ్డికి సలహా ఇచ్చారు.
కానీ జగన్ ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు. నోటిమాటగా తీర్మానం ప్రవేశపెట్టేందుకు, దానిపై చర్చ జరిపేందుకు స్పీకరును అనుమతి కోరడం నియమ నిబంధనలకు విరుద్దమని, అది ఏ నిబంధన క్రింద వీలవుతుందో తనకు చెప్పాలని యనమలను నిలదీశారు. అది కూడా మళ్ళీ జగన్ కు మరోసారి చేదు అనుభవమే మిగిల్చింది.
ముఖ్యమంత్రి చంద్రబాబు లేచి మాట్లాడుతూ ‘మంత్రులు ఏదయినా ఒక ముఖ్యమయిన అంశంపై సభలో చర్చ జరగాలని భావిస్తే వారు స్పీకరును నోటిమాటగా అనుమతి కోరవచ్చును. స్పీకరు అనుమతిస్తే దానిని అజెండాలో చేర్చకుండానే సభలో సభ్యులందరికీ తెలియజేసి దానిపై స్పీకర్ చర్చ చేప్పట్టవచ్చును. ఈ నియమం గురించి తెలుసుకోకుండా ప్రతిపక్ష నాయకుడికి మాకు నియమ నిబంధనల గురించి పాటాలు నేర్పిస్తున్నారు,” అని జగన్మోహన్ రెడ్డిని ఎద్దేవా చేసారు.
ఆ తరువాత మాట్లాడిన యనమల రామకృష్ణుడు, ఆవిధంగా చర్చకు అనుమతించే నియమ నిబంధనలను రూల్ బుక్ లో నుండి చదివి వినిపించారు. రూల్ బుక్ క్షుణ్ణంగా చదువుకోమని జగన్ కు సలహా కూడా ఇచ్చారు.
ఇంత అవమానకర పరిస్థితులు ఎదుర్కొన్న తరువాత ఎవరయినా సభలో మళ్ళీ మాట్లాడేందుకు జంకుతారు. కానీ జగన్ మాత్రం ఏ మాత్రం సిగ్గుపడకుండా అధికారపార్టీ సభ్యులు సభలో ప్రతిపక్ష పార్టీ గళం వినిపించకుండా చాలా నియంతృత్వంగా, ఏ మాత్రం మానవత్వం లేకుండా వ్యవహరిస్తున్నారని విమర్శించి మళ్ళీ మరో కొత్త సమస్యను కోరి తెచ్చుకొన్నారు. ఆయన ‘అధికార పార్టీ సభ్యులకు మానవత్వం’ లేదని అనడం అన్-పార్లమెంటరీ పదమని యనమల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసారు. ఆ తరువాత కొద్ది సేపు దానిపై కూడా వారిరువురి మధ్య వాదోపవాదాలు సాగాయి.
మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి అనుభవలేమి కారణంగా సభలో చాలా దుందుడుకుగా వ్యవహరిస్తూ అధికార పార్టీని ఇబ్బందిపెట్టబోయి చివరికి తనే వారి చేతిలో పదేపదే భంగపడుతున్నారు. అయినప్పటికీ ఆయన తన తీరు మార్చుకోకపోవడం చాలా ఆశ్చరం కలిగిస్తుంది.