Read more!

గురువిందకి గురువు జగన్!

అధికారంలో ఉన్నంత కాలం జగన్ కు, ఆయన పార్టీ నేతలకూ ఆత్మస్థుతి పరనింద తప్ప మరో విషయం తెలియనట్లుగా వ్యవహరించారు. ఇప్పుడు పార్టీ ఘోర పరాజయం పాలైన తరువాత, కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా జనం కర్రు కాల్చి వాతపెట్టిన తరువాత వారికి తెలియని మరో పదం ఇప్పుడు వారి డిక్షనరీలో చేరింది. అది ఆత్మ వంచన. ఔను ఇప్పుడు వైసీపీ ఆత్మస్థుతి, పరనిందలకు తోడు అత్మవంచన కూడా చేసుకుంది. తాజాగా జగన్ పార్టీ ఎమ్మెల్సీలు, నేతలతో భేటీలో మాట్లాడిన మాటలు వింటే అవిషయం విస్ఫష్టంగా అర్ధమౌతుంది.

ఐదేళ్ల అరాచకపాలనను జనం నిర్ద్వంద్వంగా తిరస్కరించారు. గత ఎన్నికలలో 151 సీట్లతో అందలం ఎక్కించిన జనమే ఇప్పుడు 11 ఔను 11 స్థానాలకు పరిమితం చేసి, నీ స్థాయి ఇది నాయనా అని బటన్ నొక్కి ఓటు వేసి మరీ చెప్పారు. అయినా జగన్ కు తత్వం బోధపడినట్లు కనిపించడం లేదు.  ఎవరైనా ఓటమి నుంచి గుణపాఠం నేర్చుకుంటారు. ఎందుకు ఓడిపోయాం అన్న విషయంపై సమీక్షలు నిర్వహించుకుని పోస్టు మార్టం చేసుకుంటారు. తప్పులు దిద్దుకుని, తిరిగి ప్రజాభిమానం చూరగొనేందుకు ప్రణాళికలు రచించుకుంటారు. కానీ అటువంటిదేమీ జగన్ లో కానీ, వైసీపీలో కానీ కనిపించడం లేదు. ఇప్పటికీ అదే ఆత్మస్థుతి, పరనింద, ఆత్మ వంచన.  

ఎమ్మెల్సీలతో భేటీలో జగన్ మాట్లాడిన మాటలు చూస్తే నవ్వి పోదురు గాక నాకేటి సిగ్గు అన్న చందంగా ఉన్నాయి. కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసి రెండు రోజులు గడిచాయో లేదో, చంద్రబాబు తన కేబినెట్ సహచరులకు ఇంకా శాఖలు కూడా కేటాయించలేదు. అయితే అప్పుడు జగన్  తన వికృత మనస్తత్వాన్ని ప్రదర్శించేశారు.  కేంద్రంలో కొలువుదీరిన మోడీ సర్కార్ పై ప్రత్యేక హోదా కోసం చంద్రబాబు పట్టుపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. ఐదేళ్ల పాటు అధికారం వెలగబెట్టిన తాను ఆ పని ఎందుకు చేయలేదన్న ఆత్మ విమర్శ చేసుకుని, అలా పట్టుబట్ట లేకపోవడానికి కారణం తనపై ఉన్న కేసుల భయమేనని  ఒప్పుకుని ఈ డిమాండ్ చేసి ఉండాల్సింది. అసలు 2019 ఎన్నికలకు ముందు చంద్రబాబు కేంద్రంతో, మోడీతో విభేదించడానికి కారణం ప్రత్యేక హోదా, ప్రత్యేక ఆర్థిక ప్రతిపత్తి, విభజన    చట్టం మేరకు హామీల అమలుకోసమే కదా? 

ఇక రాష్ట్ర అవసరాలు, ప్రయోజనాల ఊసెత్తకుండా ఐదేళ్ల పాటు అధకారం వెలగబెట్టిన జగన్ ఎంత సేపూ తన కేసుల నుంచి రక్షణ కోసం వినా రాష్ట్రం కోసం కేంద్రానికి కనీసం ఒక్క వినతి కూడా చేయకుండానే నెట్టు కొచ్చేశారు. ఇప్పుడు కొత్తగా కొలువుదీరిన చంద్రబాబు సర్కార్ కు సుద్దులు బోధించడానికి రెడీ అయిపోయారు.  సరే అదలా ఉంచితే.. జగన్ ఐదేళ్లు ఇట్టే గడిచిపోతాయి, మళ్లీ మనమే అధికారంలోకి వస్తాం అంటూ ఎమ్మెల్సీలకు భరోసా ఇచ్చారు. అధికారంలో ఉన్న ఐదేళ్ల కాలంలో దేశంలోనే కాదు, ప్రపంచంలో ఎక్కడా జరగని విధంగా సంక్షేమ పథకాలు అమలు చేశామని చెప్పుకున్న జగన్, ఆ సంక్షేమ ఫలాలు అందుకున్న అవ్వా తాతలు, అక్కచెల్లెమ్మలు మనకు ద్రోహం చేశారని చెప్పుకొచ్చారు. వారు అలా ద్రోహం చేయడం వెనుక ఏదో పెద్ద కుట్ర ఉందన్న అనుమానమూ వ్యక్తం చేశారు. ట్యాంపరింగ్ టెక్నాలజీతో ఈవీఎంలను ట్యాంపర్ చేశారనీ ఆరోపణలు గుప్పించారు.  జగన్ ఈ తీరు ఆ పార్టీ ఉనికి మాత్రంగా కూడా మిగలకుండా కనుమరుగైపోవడానికే దారి తీస్తుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

ఇప్పటికే వైసీపీలో ఓ వెలుగువెలిగిన నేతలంతా పార్టీకి ముఖం చాటేశారు. తెలుగుదేశం తలుపులు మూసుకుపోయిన వారంతా కాంగ్రెస్, బీజేపీలవైపు చూస్తున్నారు. ఆ భయంతోనే ఆయన తన జగన్మాయావాక్కులతో ఎమ్మెల్సీలను పార్టీ మారకుండా నిరోధించేందుకు ప్రయాసపడుతున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఐదేళ్లు కళ్లు మూసుకుంటే  మళ్లీ అధికారంలోకి వచ్చేస్తామంటూ ఆయన చెప్పిన మాటలకు వైసీపీ ఎమ్మెల్యేలే పెదవి విరుస్తున్నారు. ఐదేళ్లు కళ్లు మూసుకునే బదులు ఇప్పుడే కళ్లు తెరిచి జగన్ కు ఆయన కోసం ఆయన చేత ఆయనే ఏర్పాటు చేసుకున్న పార్టీకి ఎంత తొందరగా దూరమైతే అంత మేలని భావిస్తున్నారు.