ఏపీ ఆర్ధిక విధానాలు అధ్వానం

ఏపీ ప్రభుత్వ ఆర్థిక అరాచకత్వం గురించి అందరూ మాట్లాడుతున్నారు. అయితే ఆ ఆరచకత్వాన్ని నిరోధించడానికి చేయాల్సినది మాత్రం చేయడం లేదు. అప్పులు వాటిని తీర్చడానికి మళ్లీ అప్పులు, ఉచిత పందేరాలకు అప్పులు.. అవీ సరిపోక పథకాల లబ్ధిదారుల సంఖ్యలో కోతలు. బటన్ నొక్కితే ఓట్లు రాలే మంత్రం కనిపెట్టాశానంటున్న ముఖ్యమంత్రి జగన్.. ఉద్యోగులకు సమయానికి జీతం ఇవ్వాల్సిన అవసరం ఉందని కూడా గుర్తించడం లేదు. పిఛనర్లకు పించన్ల విషయమూ పట్టించుకోవడం లేదు.

పనులు చేసిన కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించాలని కూడా భావించడం లేదు. దీంతో రాష్ట్రంలో అన్ని వర్గాలూ ఆందోళన బాట పట్టాయి. గత మూడున్నరేళ్లుగా రాష్ట్రంలో ఇదే పరిస్థితి ఉంది. ఇది రహస్యం కాదు. అందరికీ తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక అరాచకత్వానికి చెక్ పెట్టి నియంత్రించి దారిలో పెట్టాల్సిన కేంద్ర ప్రభుత్వం చోద్యం చూస్తూ కూర్చోలేదు. అన్ని విధాలుగా సహకరిస్తూ వచ్చింది. ఇప్పుడు కూడా పేరెత్తకుండా రాష్ట్రంలో ఆర్థిక అస్తవ్యస్త పరిస్థితుల గురించి సన్నాయి నొక్కులు నొక్కుతూ పరోక్ష విమర్శలు చేస్తున్నది.

తాజాగా పార్లమెంటులో కేంద్రం విత్త మంత్రి నిర్మలా సీతారామన్ ఏపీ పేరు ప్రస్తావించకుండా.. ఒక రాష్ట్ర ప్రభుత్వం అంటూ జీతాలు సమయానికి ఇవ్వలేని పరిస్థితికి వచ్చిందని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఉద్యోగులంతా నిరసనలు చేస్తుంటే.. ఆ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తో.. తమ పథకాల ప్రచారానికి మాత్రం భారీ మొత్తం వెచ్చించి మరీ ప్రకటనలు గుప్పిస్తోందని విమర్శించారు. ఉచితాలను తప్పుపట్టడం లేదు కానీ.. ఆదాయం లేకుండా అప్పులు చేసి మరీ పందేరం చేయడం సరికాదన్నారు. ఏపీ పేరు ప్రస్తావించకపోయినా.. ఆమె ఈ విమర్శలు, వ్యాఖ్యలు చేసింది ఏపీని ఉద్దేశించేనని ఎవరికైనా ఇట్టే అర్థమైపోతుంది.

సభలో రాష్ట్రాల ఆర్థిక పరిస్థితులపై మాట్లాడుతూ నిర్మలా సీతారామన్ ఈ వ్యాఖ్యలు చేశారు.   ఏపీలో ఆదాయం పెరగలేదు.. ఖర్చులు మాత్రం రెట్టింపు అవుతున్నాయి.  కార్పొరేషన్ల పేరుతో అడ్డగోలుగా అప్పులు చేస్తోంది.  ఆర్బీఐకి దృతరాష్ట్రుడిలా అనుమతులు ఇచ్చేస్తోంది. ఈ విషయాలన్నీ తెలసీ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్న కేంద్ర ప్రభుత్వం పరోక్ష విమర్శలతో సరిపెట్టేస్తోంది. ఇందుకు కారణం రాజకీయం అని వేరేగా చెప్పాల్సిన అవసరం లేదు. పరోక్షంగా అన్ని విధాలుగా ఏపీ ఆర్థిక వినాశనానికి సహకరిస్తూ.. పరోక్షంగా విమర్శలు హెచ్చరికలతో సరిపెట్టేసి తమ నిర్వాకాన్ని  కప్పిపుచ్చుకోవాలని కేంద్రం చూస్తోందనడానికి తాజాగా విత్తమంత్రి నిర్మలా సీతారామన్ చేసిన వ్యాఖ్యలు మరో నిదర్శనం.