ఇదేం న్యాయం జగన్ రెడ్డి గారు..
posted on Mar 18, 2021 @ 3:55PM
అమరావతి అసైన్డ్ భూముల వ్యవహారంలో టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు సీఐడీ నోటీసులు ఇవ్వడం రాజకీయ దుమారం రేపుతోంది. చంద్రబాబుపై 166, 167, 217, 120 (బి) ఐపీసీ రెడ్‌విత్ 34, 35, 36, 37 ఐపీసీలతోపాటు.. ఎస్సీ ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టంలోని సెక్షన్ 3(1), (ఎఫ్) (జి)లపైనా కేసు పెట్టారు. అమరావతి అసైన్డ్ భూముల వ్యవహారంలో మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు. గత ప్రభుత్వంలోని కొందరు పరపతి ఉన్న పెద్దలు మోసం చేసి, చట్ట విరుద్ధంగా, మోసపూరితంగా రైతుల భూములు లాక్కున్నారని ఆళ్ల తన ఫిర్యాదులో తెలిపారు. అయితే దేశంలో మాజీ ముఖ్యమంత్రిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టడం ఇదే మొదటిసారని చెబుతున్నారు.
అసైన్డ్ భూముల వ్యవహారంలో చంద్రబాబుపై కేసు పెట్టడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. రాష్ట్ర రాజధాని నిర్మాణం కోసం భూములు సేకరించడం అక్రమమంటున్న జగన్ రెడ్డి సర్కార్... గత ఏడాదిగా చేస్తున్నది ఏంటనే చర్చ వస్తోంది. ఇళ్ల పట్టాల పంపిణి చేపట్టిన వైసీపీ సర్కార్.. ఇందు కోసం రైతుల భూములకు అక్రమంగా లాగేసుకుంది. అసైన్డు, డీ పట్టా స్థలాలను బలవంతంగా స్వాధీనం చేసుకుంది. దళితులకు గత ప్రభుత్వాలు ఇచ్చిన భూములను తిరిగి తీసుకుంది. రైతులు వ్యతిరేకిస్తున్నా... వారిని బెదిరించి తాము చేయాల్సింది చేసేసింది. ఇక్కడ అక్కడా అని లేదు రాష్ట్రమంతా అదే తీరు. శ్రీకాకుళం నుంచి కడప వరకు ఎక్కడ భూములు కనిపిస్తే అక్కడ లాగేసుకున్నారు. గోదావరి జిల్లాల్లో పచ్చని పొలాలను కూడా లాగేసుకున్నారు, ఇళ్ల పట్టాల కోసం ప్రభుత్వం సేకరించిన భూములన్ని దాదాపుగా పేదలు, దళితులవే. ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ, ఎన్టీఆర్, రాజశేఖర్ రెడ్డిలు గతంలో దళితులకు ఇచ్చిన అసైన్డ్ భూములను.. జగన్ రెడ్డి సర్కార్ బలవంతంగా లాక్కుంది.
ఏపీలో ఇళ్ల పథకం కోసం… 30 లక్షల 75వేల 755 మంది లబ్దిదారులను ప్రభుత్వం గుర్తించింది. అర్హులైన పేదలకు గ్రామీణ ప్రాంతాల్లో 1.5 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లోని వారికి ఒక సెంటు స్థలాన్ని ప్రభుత్వం ఇచ్చింది. ఇందుకోసం రూ. 23,535 కోట్ల విలువైన 68,361.83 ఎకరాల భూమిని సేకరించింది. ఇందులో ప్రభుత్వ భూమి 25, 120.33 ఎకరాలు ఉండగా.. 25,359.31 ఎకరాల భూమిని 10వేల 150 కోట్లతో కొనుగోలు చేసింది. అయితే ప్రభుత్వ భూమి అని చెబుతున్న దాంట్లో మెజార్టీ అసైన్డ్, డీ పట్టా భూములే. పసుపు కుంకమ కింద ఇచ్చిన భూములను వదల్లేదు జగన్ రెడ్డి ప్రభుత్వం. ఎలాంటి సంప్రదింపులు లేకుండానే.. గ్రామసభలు పెట్టకుండానే లాకున్నారు. పేదలు, దళితుల వినియోగంలోని పంట పొలంలో ఉండగానే బలవంతంగా సేకరించారు. ప్రభుత్వ ఆదేశాలతో స్థలాల వేటలో ఉన్న రెవెన్యూ అధికారులు.. రాత్రికి రాత్రే యంత్రాలతో వచ్చి పొలాలను దున్నేశారు. రైతులు కాళ్లావేళ్లా పడుతున్నా వినకుండా పంటనంతా ధ్వంసం చేశారు. పోలీసుల అండతో ప్లాట్లుగా చేయడానికి చదును చేశారు. రైతులు లేని సమయం చూసి రాత్రికి రాత్రే పంటనంతా నాశనం చేశారు. నేలకు వాలిపోయిన తమ కష్టాన్ని చూసి రైతులు కన్నీరుమున్నీరయ్యారు. ముందుగా చెబితే పంటనైనా కాపాడుకొనేవారమని గొల్లుమన్నారు. భూములు పోయిన బాధతో కొందరు రైతులు, పేదలు , దళితులు ప్రాణాలు కూడా తీసుకున్నారు.
పేదలు, దళితులకు సంబంధించిన అసైన్డ్ భూములను లాక్కోవడంపై విపక్షాలు, ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన చేశాయి. టీడీపీ అధినేత చంద్రబాబు కూడా జగన్ సర్కార్ తీరుపై భగ్గుమన్నారు. పేదల భూములు లాక్కోవడం దారుణమని మండిపడ్డారు. అయినా పట్టించుకోకుండా బలవంతంగా వేలాది ఎకరాలు సేకరించింది జగన్ సర్కార్. దీనిపైనే ఇప్పుడు ప్రశ్నిస్తున్నారు విపక్ష నేతలు. రాజధాని అమరావతి కోసం అసైన్డ్ భూములు తీసుకోవడం నేరమంటూ చంద్రబాబుపై కేసు పెడితే.. వేలాది ఎకరాల అసైన్డ్ , దళితుల భూములు సేకరించిన జగన్ రెడ్డిపై ఎన్ని కేసులు పెట్టాలని నిలదీస్తున్నారు. ఐదేళ్లు సుపరిపాలన అందించిన చంద్రబాబును ఎలాగైనా ఏదో ఒక కేసులో ఇరికించి.. ఆయన ఇమేజ్‌ను డ్యామేజ్ చేయాలనే ప్రయత్నంలో భాగంగానే ఇన్‌సైడర్ ట్రేడింగ్ పేరుతో కేసు క్రియేట్ చేసి.. ఆ ఉచ్చును చంద్రబాబు మెడకు బిగించాలని చూస్తున్నారని టీడీపీ నేతలు తప్పుబడుతున్నారు. అమరావతి ఇన్‌సైడర్ ట్రేడింగ్ కేసుపై గతంలోనే హైకోర్టులో విచారణ జరగ్గా.. అమరావతి ఇన్‌సైడర్ ట్రేడింగ్‌లో చంద్రబాబుకు సంబంధం లేదని ఉన్నత న్యాయస్థానం కూడా తేల్చేసింది. సంబంధంలేని ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టి.. ప్రతిపక్ష నేతను భయబ్రాంతులకు గురి చేయాలనుకోవడం వైసీపీ సర్కారు దిగజారుడుతనమే అంటున్నారు టీడీపీ నేతలు.
అసైన్డ్ భూముల వ్యవహారంలో చంద్రబాబుకి ఇచ్చిన నోటీసులే సీఎం జగన్‌కు కూడా ఇవ్వాలని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ హర్షకుమార్ డిమాండ్ చేశారు. సీఎం జగన్ ఇళ్ళ స్థలాల పంపిణీ పేరుతో పేదలైన దళితుల నుండి అతికిరాతకంగా, బలవంతంగా అసైన్డ్ భూములు లాక్కున్నారని ఆరోపించారు. అసైన్డ్ భూముల విషయంలో సీఐడీ అధికారులు చంద్రబాబుపై పెట్టిన సెక్షన్లను జగన్‌తో పాటు రెవిన్యూ మంత్రి, ఐఏఎస్ అధికారి ప్రవీణ్ ప్రకాష్‌ల పైనా పెట్టి నోటీసులు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేసారు. దళితుల నుండి సీఎం అసైన్డ్ భూములను లాక్కున్న వ్యవహారానికి సంబంధించిన పూర్తి వివరాలతో తాను సీఐడీ అధికారులకు ఫిర్యాదు చేస్తానని చెప్పారు. ఒకవేళ సీఐడీ అధికారులు జగన్‌పై కనుక కేసులు పెట్టకపోతే సీఐడీ అధికారులపై హైకోర్టులో ఫిర్యాదు చేస్తానని హర్షకుమార్ హెచ్చరించారు. చంద్రబాబుకు నోటీసులు ఇవ్వడం కోసం దళితులను బలిపశువులుగా చేసిన జగన్‌కు జోహార్లు అంటూ హర్షకుమార్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.