నందిగ్రామ్ గరం ..గరం !
posted on Mar 18, 2021 @ 3:37PM
ఐదు రాష్టాలలో అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్నా, దేశం మొత్తం దృష్టి మాత్రం ఒక్క పచ్చిమ బెంగాల్’ మీదనే కేద్రీకృతమై వుంది.అందుకు కారణం ఏమిటో ప్రత్యేకంగా వివరించవలసిన అవసరం లేదు. అటు మోడీ ఇటు మమత మధ్య పోటీగా సాగుతున్న బెంగాల్ ఎన్నికలలో ఇరు వైపుల నుంచి ఫిరంగుల మోత హోరెత్తిస్తోంది. మోత మోగుతోంది. అంతే కాకుండా బెంగాల్ ఫలితాల ప్రభావం బెంగాల్ రాష్ట్రానికి మాత్రమే పరిమితం కాదు, దేశ రాజకీయాలపైనా ఆ ఫలితాలు ప్రభావం చూపుతాయి. అందుకే బెంగాల్’ ఫలితాల కోసం దేశం మొత్తం ఆసక్తిగా ఎదురు చూస్తోంది.
అదలా ఉంటే, బెంగాల్ రాజకీయాలను ‘చారిత్రక’ మలుపు తిప్పిన నందిగ్రామ్ ఇప్పుడు మరో మారు, మరో చారిత్రక ఆవిష్కరణకు వేదిక కాబోతోంది.అందుకే, ఇప్పుడు ఇటు బెంగాలీలతో పాటుగా దేశం మొత్తం కూడా, బెంగాల్ ఫలితాలపై ఎంత అసక్తి చూపుతోందో, నందిగ్రామ్ సంగ్రాంపై కూడా అంతే ఆసక్తితో ఎదురుచూస్తోంది. మూడు పదులకు పైగా, బెంగాల్’ను ఏలిన వామపక్ష కూటమిని గద్దెదించి, మమతా బెనర్జీని పీఠం ఎక్కించిన భూపోరాటానికి నందిగ్రామ్ కేంద్ర బిందువు అయితే,ఆ ఉద్యమాన్ని మమతా బెనర్జీ, సువేందు అధికారి జోడు గుర్రలుగా ముందుకు నడిపించారు.
అయితే ఇప్పుడు, సువేందు అధికారి ఇటీవల బీజేపీలో చేరి, మమతపై పోటీకి తొడకొట్టడంతో సీన్ మారిపోయింది. ఇప్పుడు అదే నందిగ్రామ్ ఎన్నికలబరి నుంచి, ఆ ఇద్దరు ఉగ్ర నేతలు తలపడుతున్నారు. ఒకరిపై ఒకరు సవాళ్ళు విసురుకుని, డీ అంటే డీ అంటూ పోరాటానికి సిద్ధమయ్యారు. దీంతో నందిగ్రామ్’పై రాజకీయ వీక్షకులు,విశ్లేషకుల చూపు పడింది.
ఇదలా ఉంటే, ఇప్పుడు ముందున్న మహా సంగ్రామానికి ట్రైలర్ అన్నట్లుగా, నామినేషన్ల దగ్గరే, ఇద్దరు నేతలు, ఇరు పార్టీలు రాజకీయం రక్తి కట్టిస్తున్నారు. మమత బెనర్జీ నామినేషన్ దాఖలు చేసిన సమయంలో, నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. నిజానికి అది దాడో, లేక ప్రమాదమో కానీ, నామినేషన్ వేసి బహిరంగ సభ వేదిక వద్దకు చేరుకున్న ఆమె కారు దిగుతున్న సమయంలో ఆమె కాలుకు గాయమైంది. ఆమె రెండు రోజులు ఆసుపత్రిలో ఉండి, వీల్ చైర్’లో బయటకు వచ్చారు, వీల్ చైర్ ప్రచారం సాగిస్తున్నారు. అయితే, రాష్ట్ర ప్రభుత్వం జరిపించిన విచారణలో అది ప్రమాదమే అని తేలింది. అయినా, తృణమూల్ దాన్ని దాడిగానే భావిస్తోంది.అంతే కాదు, అది మమతపై జరిగిన హత్యా ప్రయత్నంగా ప్రచారం చేసుకుంటోంది. సానుభూతి పొందే ప్రయత్నం చేస్తోంది. మరోవంక బీజేపే, అదంతా డ్రామా అని కొట్టి పారేసింది.
అదలా ఉంటే,తప్పుడు వివరాలతో నామినేషన్ దాఖలు చేశారంటూ ఇటు మమత అటు మమతా ఒకరిపై ఒకరు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. మమతా బెనర్జీ తమఫై ఉన్న ఆరు క్రిమినల్ కేసులను దాచిపెట్టారని సువేందు అధికారి తరపున బీజేపీ బృందం ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. మమతా బెనర్జీ నామినేషన్ రద్దు చేయాలని బీజేపీ నేతలు ఎన్నికల సంఘాన్ని కోరారు.అందుకు జవాబుగా అన్నట్లుగా సువేందు అధికారికి రెండు నియోజక వర్గాల (నందిగ్రామ్,హల్దియా)లో ఓట్లున్నాయని, ఇలా రెండు నియోజక వర్గాల్లో ఓటు హక్కు ఉండడం ప్రజాప్రాతినిధ్య చట్టానికి వ్యతిరేక కాబట్టి, సువేందు అధికారి నామినేషన్ రద్దు చేయాలని తృణమూల్ కాంగ్రెస్ ఎన్నికల సంఘానికి రాసిన లేఖలో పేర్కొంది.
దీంతో ఇప్పుడు ఎన్నికల సంఘం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనే విషయంలో అస్తికర చర్చ జరుగుతోంది.అయితే, అన్నీ తెలిసిన అనుభవజ్ఞులు మాత్రం, ఏమీ జరగదు,ఎవరి నామినేషన్ రద్దు కాదు. ఇదంతా ఎన్నికల ఆటలో మామూలు వ్యవహారమే అంటున్నారు. అయితే నందిగ్రామ్ ఓటర్లు మాత్రం ఒకరిని ఓడించి, రద్దు పద్దులో చేరుస్తారని అంటున్నారు.