షర్మిలతో కాళ్ల బేరానికి జగన్?
posted on Oct 21, 2024 @ 11:59AM
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి దారులన్నీ మూసుకుపోయాయి. రాజకీయంగా మనుగడ సాగించాలంటే.. తన తీరు మార్చుకోక తప్పదని అర్ధమైంది. వైసీపీకి ఎటూ పొలిటికల్ ఫ్యూచర్ జీరో అని అవగతమైంది. ఇప్పుడు రాజకీయంగా ఉనికి కాపాడుకోవాలంటే కాంగ్రెస్ వినా మరో దిక్కు లేదని అవగతమైంది. కాంగ్రెస్ కు అనుకూలంగా ఎన్ని ప్రకటనలు చేసినా.. అడగకుండానే ఆ పార్టీకి మద్దతుగా మాట్లాడుతున్నా.. అటు నుంచి ఎటువంటి స్పందనా కనిపించడం లేదు. ఇందుకు కారణం ఆ పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షరాలిగా ఉన్న తన సొంత చెల్లి షర్మిల అనే విషయం బోధపడింది. ఇప్పుడు ఆమెతో సఖ్యత ఉంటే తప్ప కాంగ్రెస్ తనను దరి చేయనీయదన్న నిర్ధారణకు వచ్చినట్లు కనిపిస్తోంది. అందుకే ఆమెతో రాయబేరాలకు, రాజీ ప్రయత్నాలకు తెరతీశారు జగన్. అవసరమైతే కాళ్ల బేరానికి దిగైనా సరే షర్మిలతో సఖ్యత పెంచుకోవాలన్న నిర్ణయానికి వచ్చేశారు.
నిజానికి జగన్ నైజం తెలిసిన వారెవరూ జగన్ చెల్లెలితో కాళ్లబేరానికి దిగడం పట్ల ఆశ్చర్యపోరు. ఎందుకంటే జగన్ తీరు అందితే జుట్టు, అందకుంటే కాళ్లు అన్నట్లుగానే ఉంటుంది. ఐదేళ్లు అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి ఆద్యంతం అహంకార పూరితంగా వ్యవహరించారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన చంద్రబాబు నాయుడుతో దురుసుగా ప్రవర్తించడంతో పాటు, సొంత చెల్లి, తల్లి పట్ల కూడా అదే పద్దతిని అవలంబించారు. అధికార అహంతో తనకు వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్లపై కేసులు పెట్టి, పోలీసులతో కొట్టించి పైశాచికానందం పొందారు. ఇప్పుడా అధికారం పోయింది. జనం ఛీకొట్టారు. ఎంతగా అంటే ఆయనకు విపక్ష నేత హోదా ఇవ్వలేదు. ఆయన పార్టీకి కేవలం 11 స్థానాలు మాత్రమే ఇచ్చేశారు. ఇంత కాలం తనకు పెట్టని కోటగా ఉన్న కడప జిల్లాలో కూడా ఆయనకు అత్తెసరు మార్కులే వేశారు. అధికారంలో ఉన్నంత కాలం తనకు అన్ని విధాలుగా సహకారం అందించిన కేంద్రంలోని మోడీ సర్కార్ కూడా ఇప్పుడు ఆయనకు వీసమెత్తు విలువ కూడా ఇవ్వడం లేదు. పైపెచ్చు ఇప్పుడు బీజేపీ తెలుగుదేశంతో పొత్తులో ఉంది. కేంద్రంలో మోడీ సర్కార్ మనుగడ సాగించాలంటే.. చంద్రబాబు మద్దతు తప్పని సరి. అందుకే జగన్ కు దూరం పెడుతోంది. దీంతో ఇక ఇప్పుడు ఆయన మెడకు ఇంత కాలం విచారణకు కూడా రాకుండా పెండింగ్ లో ఉన్న కేసుల విచారణ వేగం పుంజుకోనుంది. కోడికత్తి కేసు, గులకరాయి దాడి కేసులలో కూడా ఆయన ఇక ముందు కోర్టుకు హాజరు కాకతప్పని పరిస్థితి. సో ఇక బీజేపీతో లాంభం లేదు. సార్వత్రిక ఎన్నికలలో సత్తా చాటి బలమైన విపక్షంగా అవతరించిన కాంగ్రెస్ పంచన చేరితేనైనా ఏదో మేరకు రక్షణ ఉంటుందని జగన్ భావిస్తున్నట్లుగా కనిపిస్తోంది.
అందుకే ఆ పార్టీ హర్యానా ఎన్నికలలో పరాజయం వెనుక ఈవీఎంల ట్యాంపరింగ్ ఉందంటూ తనంత తానుగానే ప్రకటించేసి ఆ పార్టీ దృష్టిలో పడేందుకు విఫలయత్నం చేశారు. అయితే జగన్ ఎన్ని రకాలుగా ప్రయత్నించినా కాంగ్రెస్ నుంచి మాత్రం స్పందన కనిపించడం లేదు సరికదా.. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు, సొంత చెల్లెలు వైఎస్ షర్మిల.. రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం కూటమి ప్రభుత్వంపై కంటే.. కనీసం విపక్ష హోదా కూడా లేకుండా, ఉనికి కోసం వెంపర్లాడుతున్న వైసీపీపైనా, జగన్ పైనే విమర్శలు ఎక్కుపెడుతున్నారు. జగన్ అరాచకపాలనలోని అన్యాయాలు, అక్రమాలను ఎలుగెత్తి చాటి.. జగన్ పై చర్యలకు చంద్రబాబు సర్కార్ ను డిమాండ్ చేస్తున్నారు. పనిలో పనిగా షర్మిలను మంచి చేసుకోవడం కోసం కాంగ్రెస్ ను వీడి వైసీపీలోకి వస్తే సముచిత స్థానం ఇచ్చి గౌరవిస్తానని కూడా రాయబారం నడిపినట్లు రాజకీయవర్గాలలో గట్టిగా వినిపిస్తోంది. అయితే జగన్ రాయబారాన్ని నిర్ద్వంద్వంగా తిప్పికొట్టారనీ ప్రచారం జరుగుతోంది. జగన్ ఫార్ములా అందితే జుట్టు అందకుంటే కాళ్లు ఫార్ములా షర్మిల వద్ద ఇసుమంతైనా పని చేసినట్లు కనిపించదు.
ఆస్తి విషయంలో అన్న జగన్ తమకు అన్యాయం చేశారని షర్మిల పదేపదే చెబుతున్నారు. ఇప్పుడు షర్మిలను మంచి చేసుకోవడానికి ఆమెకు జగన్ ఆస్తులు ఇచ్చేందుకు ముందుకు వచ్చారని పరిశీలకులు చెబుతున్నారు. జగన్ బెంగళూరులో మకాం వేసి మరీ మధ్యవర్తులద్వారా షర్మిలతో రాయబేరాలు జరుపుతున్నట్లు చెబుతున్నారు. పది అడుగులు కిందకు దిగైనా సరే షర్మిలతో సత్సంబంధాలు ఏర్పరుచుకుంటే రాజకీయంగా ఏదో మేరకు నిలదొక్కుకోవచ్చని, కాంగ్రెస్ కు దగ్గర కావచ్చనీ జగన్ భావిస్తున్నట్లు పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. చూడాలి మరి జగన్ ప్రయత్నాలు ఏ మేరకు ఫలిస్తాయో?!