డిల్లీ వెళ్లేందుకు అదొక సాకు అంతే!
posted on Jul 11, 2014 @ 5:02PM
వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి తీరు చాలా విచిత్రంగా ఉంటుంది. ఆంద్ర రాష్ట్రాన్ని ముప్పతిప్పలు పెడుతున్న తెలంగాణా ప్రభుత్వాన్ని పల్లెత్తు మాటనరు, కానీ స్వంత రాష్ట్ర ప్రభుత్వంపై మాత్రం నిప్పులు చేరుగుతుంటారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రజలలో చులకన చేయడానికి చేయగలిగినంతా చేస్తుంటారు. మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం చేయలేని పనిని తానే చేస్తున్నట్లు కేంద్రం వద్దకు వెళ్లి రాష్ట్రానికి అన్ని విధాల సహాయం చేయాలని కోరుతుంటారు. రాష్ట్రంలో ప్రభుత్వంతో నిత్యం కయ్యానికి కాలు దువ్వుతూ, మొగుడుని చితకబాది వీధినపడి ఏడ్చినట్లు, తెదేపా, బీజేపీకి మిత్రపక్షమని తెలిసి ఉన్నప్పటికీ డిల్లీ వెళ్లి దానిపై పిర్యాదులు చేస్తుంటారు.
ఇదంతా రాష్ట్ర ప్రజల మెప్పు పొందేందుకా? లేక ఈ వంకతో డిల్లీ వెళ్లి తన సీబీఐ కేసులు మాఫీ చేసుకోవడానికా? లేక నిత్యం ఇటువంటి హడావుడి ఏదో చేస్తూ మీడియా దృష్టిని ఆకర్షిస్తూ పార్టీ ఉనికిని కాపాడుకోవడానికా? అనేది ఆయనే చెప్పాల్సి ఉంటుంది. కానీ ఏది ఏమయినప్పటికీ తరచూ ఏదో సాకుతో డిల్లీ పర్యటనలు చేస్తూ కేంద్ర మంత్రులను కలుస్తూనే ఉంటారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కూడా రాష్ట్రాభివృద్ధి, పునర్నిర్మాణం కోసం అనేక చర్యలు చేపడుతున్న సంగతి అందరికీ కనబడుతున్నా, ఒక్క జగన్మోహన్ రెడ్డికి మాత్రం కనబడక పోవడం విచిత్రం. నిన్న ఆర్ధికమంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టిన బడ్జెట్ లో రాష్ట్రానికి ఐఐటీ, ఎయిమ్స్, విశాఖ నుండి చెన్నై వరకు పారిశ్రామిక కారిడార్, కాకినాడలో హార్డ్ వేర్ పరిశ్రమల ఏర్పాటు వంటివి ప్రకటించడమే కాకుండా, రాష్ట్ర విభజన బిల్లులో పొందుపరచిన ప్రతీ అంశానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని పార్లమెంటు సాక్షిగా ప్రకటించారు. అందుకు అనుగుణంగానే ఈరోజు పోలవరం ప్రాజెక్టు క్రింద ముంపుకు గురవుతున్న గ్రామాలను ఆంధ్రాలో విలీనం చేస్తూ లోక్ సభలో బిల్లు ఆమోదింపజేశారు. అయినప్పటికీ జగన్మోహన్ రెడ్డి పనిగట్టుకొని డిల్లీ వెళ్లి ఆర్ధిక మంత్రిని కలిసి రాష్ట్ర విభజన సందర్భంగా గత ప్రభుత్వం ఇచ్చిన హామీలను అన్నిటినీ అమలు చేయాలని, రాష్ట్రానికి ఉదారంగా ఆర్ధిక సహాయం చేయాలని కోరడం చాలా హాస్యాస్పదం.
ఒకవేళ కేంద్ర ప్రభుత్వం కూడా గత యూపీయే ప్రభుత్వం లాగే రాష్ట్రం పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే, తప్పకుండా ఆయన వెళ్లి గుర్తుచేసినా అర్ధం ఉంటుంది. కానీ అడగకుండా కేంద్రమే అన్నిటినీ అమలు చేస్తున్నపుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి పనిగట్టుకొని డిల్లీ వెళ్లి జైట్లీకి మళ్ళీ బొట్టు పెట్టి చెప్పాల్సిన అవసరం ఏముంది? అని ఆలోచిస్తే, ఆయన పర్యటనకు, కేంద్ర మంత్రుల కలవడం వెనుక పరమార్ధం వేరే ఉందని స్పష్టమవుతోంది. తాటి చెట్టు క్రింద కూర్చొని పాలు త్రాగుతున్నా, అది కల్లే అని అందరూ భావించినట్లే, పది సీబీఐ ఛార్జ్ షీట్లు పోగేసుకొన్న జగన్ డిల్లీ వెళ్ళినా అది కేసుల మాఫీకేనని జనాలు అనుమానించడంలో అసహజమేమీ లేదు.
ఒకసారి సీబీఐ కేసులు గనుక తిరిగి మొదలయితే ఆయనకు మళ్ళీ కష్టాలు తప్పవు. గనుక బహుశః ఆయన ముందే జాగ్రత్తగా కేంద్రం చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నట్లున్నారు. కానీ అవినీతి భూతాన్ని అంతం చేస్తానని ఎన్నికల ప్రచార సమయంలోనే విస్పష్టంగా ప్రకటించిన నరేంద్ర మోడీ, జగన్ కేసులను ఉపేక్షిస్తారని ఆశించడం అత్యాశే అవుతుంది.