నా హత్యకు సీఎం కుట్ర..రఘురామకృష్ణం రాజు
posted on Oct 25, 2022 @ 2:58PM
దీపావళి పండుగను కుటుంబ సభ్యులతో కలిసి జరుపుకోవడానికి హైదరాబాదుకు వెళ్ళిన తనని, బ్లాంక్ ఎఫ్ ఐ ఆర్ ద్వారా ఏపీ పోలీసులు అరెస్టు చేసే ప్రయత్నం చేశారని రఘురామరాజు చెప్పారు. రచ్చబండ కార్యక్రమంలో భాగంగా రఘురామకృష్ణం రాజు మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. తనకు ఖచ్చితమైన సమాచారం లభించడంతోనే, తాను తిరిగి ఢిల్లీకి చేరుకున్నానని తెలిపారు.
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తనని అంతమొందించడానికి చేస్తున్న కుట్రలు కుతంత్రాల గురించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్ షాలకు లేఖలు రాయనున్నట్లు తెలిపారు. ఏపీలో మంత్రులకు భద్రత పెంపుపై స్పందించిన ఆయన ఏపీలో జగన్ సర్కార్ తీరు కారణంగా ప్రజల నుంచి మంత్రులు, ప్రజా ప్రతినిధులకు రక్షణ కావాలనే పరిస్థితి ఇంత తొందరగా వస్తుందనుకోలేదని వైసీపీ రెంబల్ ఎంపీ రఘురామకృష్ణం రాజు అన్నారు.
ఈ నూతన ఒరవడికి శ్రీకారం చుట్టిన మా జగనన్న ప్రభుత్వానికి అభినందనలు తెలియజేస్తున్నానని సెటైర్ వైశారు. సిఐడి చట్టబద్ధంగానే పని చేస్తోందని, తప్పు చేయని వారు భయపడాల్సిన పని లేదని, అవసరమైతే కోర్టులకు వెళ్లే స్వేచ్ఛ వారికి ఉంటుందని మీడియాలో వచ్చిన కథనాలపైనా రఘురామకృష్ణంరాజు స్పందించారు. హక్కుల గురించి సిఐడి అధికారులు చెబితే తప్ప తెలుసుకోలేని దుస్థితిలో తాము లేమన్నారు. సిఐడి పోలీసులు ఎంతోమందిని అరెస్టు చేయగా, మెజిస్ట్రేట్ లు వారిని కస్టడీకి ఇవ్వకుండా తిరిగి వెనక్కి పంపిన ఉదాంతాలు అనేకం ఉన్నాయన్నారు.
అమాయకులను అన్యాయంగా అరెస్టు చేసిన పోలీసులను మెజిస్ట్రేట్ లు తక్షణమే శిక్షించాలని కోరారు. ఇదే విషయమై తాను త్వరలోనే సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ని కలుస్తానని చెప్పారు.ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పరదాలు, బారి కేడ్స్ మధ్య ప్రజల్లోకి వస్తున్నారన్న ఆయన , ఇకపై మంత్రులు, ఎమ్మెల్యేలు సైతం అదే పంథా ను అనుసరించాలని అపహాస్యం చేశారు.
సిఐడి కస్టడీలో పోలీసుల హింసను అనుభవించిన వారెవరు న్యాయస్థానానికి, మీడియాకు ఫిర్యాదు చేయలేదని సిఐడి చీఫ్ సునీల్ కుమార్ పేర్కొనడం హాస్యాస్పదంగా ఉందని రఘురామకృష్ణంరాజు మండిపడ్డారు . సిఐడి ని అభాసు పాలు చేసేందుకే కొంతమంది తప్పుడు ఆరోపణలు చేస్తున్నారన్నడం విడ్డూరంగా ఉందన్నారు. సిఐడి అధికారులకు కళ్ళు ఉన్నాయా?, లేవా? అంటూ ప్రశ్నించిన రఘురామకృష్ణంరాజు, తాను దాఖలు చేసిన పిటిషన్ సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉందని గుర్తు చేశారు.
ఈ కేసు విచారణ నిమిత్తం సిఐడి పోలీసులకు, న్యాయస్థానం ఇప్పటికే నోటీసులు కూడా జారీ చేసిందన్నారు. అమరావతి రైతులు చేస్తున్న పాదయాత్రను అడుగడుగునా పాలకులు అడ్డుకోవాలని చూస్తున్నారన్న రఘురామకృష్ణంరాజు, ఇది రైతులకు పరీక్షా సమయం కాదని… ప్రజాస్వామ్యానికే పరీక్ష అని వ్యాఖ్యానించారు.
కడప ఎంపీ స్థానం కోసమే వైఎస్ వివేకానంద రెడ్డి హత్య జరిగిందని, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిల చెప్పారంటే నిజమే అయి ఉంటుందని రఘురామకృష్ణం రాజు వ్యాఖ్యానించారు. వైఎస్ వివేకా హత్య వల్ల లబ్ధిదారులు ఎవరన్నది త్వరలోనే తేలనుందన్నారు.