ఎదురుదాడి ఒక్కటే జగన్ ఎజెండా?
posted on Dec 20, 2023 @ 11:16AM
సీఎం జగన్ మోహన్ రెడ్డి ఏపీకి మూడు రాజధానులు ఏర్పాటు చేస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రకటించడమే కాదు 2020లో అధికార వికేంద్రీకరణ పేరుతో మూడు రాజధానులు ఏర్పాటు చేస్టున్నట్లు అసెంబ్లీ సాక్షిగా చట్టం కూడా చేశారు. అయితే న్యాయస్థానాలలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పులు రావడంతో చివరికి జగన్ సర్కార్ స్వయంగా ఆ చట్టాన్ని వెనక్కు తీసుకుంది.
అయితే ఇప్పటికీ మూడు రాజధానులు ఏర్పాటు చేస్తామనే జగన్, ఆయన పార్టీ నేతలూ చెబుతూ వస్తున్నారు. సీఎం జగన్ మూడు రాజధానుల ప్రకటన చేసి మూడేళ్లు గడిచిపోయినా ఇప్పటికీ ఆ దిశగా ఒక్కటంటే ఒక్క అడుగు ముందుకు వేయలేకపోయారు. ఇక మరో మూడు నెలలలో ఎన్నికలు కూడా వస్తున్న తరుణంలో మూడు రాజధానుల మాట ఉత్తి ముచ్చటే అన్న భావన సర్వత్రా వ్యక్తం అవుతున్నది. ప్రస్తుతం మూడు రాజధానుల వ్యవహారం సుప్రీంకోర్టులో ఉండగా.. అక్కడ తీర్పు వచ్చే వరకూ ఈ అంశంపై ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఇసుమంతైనా లేదు. దీంతో రాజధాని అనే మాట లేకుండా సీఎం జగన్ విశాఖ నుండి పరిపాలన అంటూ కొత్త పల్లవి ఎత్తుకున్నారు. అందు కోసం నిబంధనలను తుంగలోకి తొక్కి రుషికొండకు బోడిగుండు కొట్టి మరీ నిర్మాణాలు చేపట్టారు. అంతే అంతకు మించి ఒక్క అంగుళం కూడా ముందుకు కదలలేకపోయారు.
కనీసం సీఎం క్యాంప్ ఆఫీసు కూడా విశాఖకు మార్చ లేకపోయారు. సీఎం మకాం మార్చేస్తున్నారని ఇదిగో అదిగో అంటూ ముహుర్తాలైతే మారుతున్నాయి కానీ.. జగన్ తాడేపల్లి ప్యాలెస్ గడప మాత్రం దాటలేదు. పైగా రుషికొండపై కట్టడాలకు కూడా అనుమతులను ఉల్లంఘించి, పరిధి మించి నిర్మించారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇక ఐఏఎస్ అధికారులు, ఐపీఎస్ లూ కూడా తాము విశాఖకు మకాం మార్చేది లేదని కుండబద్దలు కొట్టేశారు. ఇక రుషికొండ కట్టడాల వివాదం కోర్టుకు చేరింది. జగన్ విశాఖ కాపురం అయ్యేదీ పెట్టేదీ లేదని తేటతెల్లమైపోయింది. అసలు మొత్తంగా జగన్ ఇంత కాలం చెబుతున్న మూడు రాజధానుల ముచ్చట, విశాఖ నుండి పాలన అన్నది జరిగే పని కాదని విస్పష్టంగా తేలిపోయింది.
నిజానికి జగన్ కు, ఆయన సర్కార్ కు మూడు రాజధానుల వ్యవహారంపై స్పష్టత లేదు. చేసిన చట్టంలోనూ, వెనక్కు తీసుకున్న చట్టంలో నూ కూడా మూడు రాజధానులు అనే మాటే లేదు. అమరావతి, విశాఖ, కర్నూలులో రాజధానులు ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం చెప్పినా.. అలా చెప్పిన స్వల్ప వ్యవధిలోనే జగన్ సర్కార్ కర్నూలు ఊసెత్తడం మానేసింది. న్యాయరాజధాని అన్నది తమ ఎజెండాలోనే లేదని కోర్టుకు విన్నవించింది. ఇక జగన్ కేబినెట్ లోని కొందరు మంత్రులైతే.. అసలు మూడు రాజధానుల ప్రతిపాదన, ప్రస్తావనే ప్రభుత్వం చేయలేదనీ, ఉండేది ఒకే ఒక్క రాజధాని అది విశాఖ అంటూ బాహాటంగా చెప్పారు. బహిరంగ ప్రకటనలు చేశారు. దీంతో ఏపీ రాజధాని అనేది అమరావతి వర్సెస్ విశాఖ అనేలా మారిపోయింది. ప్రభుత్వం విశాఖను రాజధాని చేయాలని చూసినా అది చట్ట ప్రకారం వీలు కాదని తేలిపోయింది. ఈ విషయం జగన్ కు ముందే తెలిసినా, కేవలం అమరావతిని పాడుబెట్టడం కోసం, అమరావతిపై విషం చిమ్మడం కోసం మాత్రమే విశాఖను తెరపైకి తెచ్చినట్లు పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
కాగా, ఇప్పుడు మొత్తానికి వైసీపీ మూడు రాజధానుల నాటకానికి తెరదించే సమయం ఆసన్నమైంది. నెలల వ్యవధిలో ఎన్నికలు జరగనున్న తరుణంలో సర్కార్ మూడు రాజధానులు అన్న మాట ఎత్తే ధైర్యం చేయదు. అలాగే విశాఖకు జగన్ అన్న మాట కూడా చెప్పే అవకాశం లేదు. ఎందుకంటే ఎన్నికలలోపు ఇది జరిగే అవకాశం లేదని స్వయంగా జగన్ సర్కారే కోర్టుకు చెప్పింది. దీంతో ఇక ఇప్పుడు జగన్ సర్కార్ కు, ఆయన పార్టీకి మిగిలిన ఆప్షన్ ఎదురుదాడి మాత్రమే. తామేదో ప్రపంచంలో ఎక్కడా లేనట్లుగా మూడు రాజధానులు ఏర్పాటు చేయాలని భావిస్తే.. ప్రతిపక్షాలు కుట్రలు పన్ని అడ్డుకున్నాయని వైసీపీ నేతలు అటాక్ చేసేందుకు సిద్ధమవుతున్నారు. ముఖ్యంగా సీఎం జగన్ మోహన్ రెడ్డి మనసంతా విశాఖ మీదనే ఉందని.. విశాఖ నుండి పరిపాలన సాగించి ఉత్తరాంధ్రను అభివృద్ధి చేయాలన్నదే ఆయన అభిమతమని చెప్పుకుంటున్నారు. మూడు ప్రాంతాలకు మూడు రాజధానులు ఏర్పాటు చేసి రాష్ట్రాన్ని సమాంతరంగా అభివృద్ధి చేసి అందరికీ న్యాయం చేయాలని జగన్ మోహన్ రెడ్డి ప్రయత్నిస్తే.. ప్రతిపక్షాలు రూపంలో దుష్టశక్తులుఅడ్డుకున్నాయనే ఎదురుదాడి ఎజెండాతో వైసీపీ రావడం ఖాయంగా కనిపిస్తుంది. అయితే, అంగ బలం, అర్ధ బలం, ఆర్ధిక బలం, అధికారం అన్నీ చేతిలో ఉన్నా చేయలేకపోయామని వైసీపీ నేతలు చెప్పే మాటలు ప్రజలు ఎంత వరకు నమ్ముతారన్నది చూడాల్సి ఉంది.