రావొద్దనుకున్నారా? రానీయొద్దనుకున్నారా?
posted on Dec 20, 2023 @ 11:45AM
అయోధ్యలో రామ మందిరం ప్రారంభోత్సవానికి ముహూర్తం దగ్గర పడుతోంది. మరో నెల రోజుల్లో అంగరంగ వైభవంగా ఆలయంలో ప్రాణప్రతిష్ఠ జరుగనున్నది. వచ్చే నెల జనవరి 22న నిర్వహించ తలపెట్టిన ఈ కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు వేగంగా సాగుతున్నాయి. ఆలయ ట్రస్టు సభ్యులు ఇప్పటికే ప్రముఖులను ఆహ్వానించే పనిలో బిజీగా ఉన్నారు.బీజేపీ కురువృద్ధులు అద్వానీ, మురళీ మనోహర్ జోషీల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని వారిని అయోధ్య రామాలయం ప్రారంభోత్సవానికి రావద్దని కోరామని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ వెల్లడించిన సంగతి తెలిసిందే. తమ వినతిని ఇద్దరూ అంగీకరించారని చెప్పిన సంగతి విదితమే. ఈ అంశం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. దీని వెనుక ఏదో ఉందని పలువురు అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో అద్వానీ, జోషీలకు విశ్వహిందూ పరిషత్ ఆహ్వానం పలికింది. విశ్వహిందూ పరిషత్ అంతర్జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు అలోక్ కుమార్ వీరిని స్వయంగా కలిసి ఆహ్వానం పలికారు. మరోవైపు, రామాలయం ప్రారంభోత్సవానికి హాజరయ్యేందుకు ప్రయత్నిస్తామని ఇద్దరు నేతలు చెప్పినట్టు సమాచారం. అయితే తొమ్మిది పదుల వయస్సున్న మాజీ ప్రధాని దేవేగౌడకు ఆహ్వానం పంపిన ఆలయ ట్రస్టు.. అయోధ్య రామ మందిర ఉద్యమానికి ఊపిరి పోసిన లాల్‌కృష్ణ అద్వానీ, కేంద్ర మాజీ మంత్రి మురళీ మనోహర్ జోషిలను మాత్రం కార్యక్రమానికి రావద్దని చెప్పింది. సోమవారం ఆలయ ట్రస్టు చేసిన అభ్యర్థనను అద్వానీ, జోషీ కూడా అంగీకరించారు. ట్రస్టు ప్రధాన కార్యదర్శి చంపత్‌రాయ్ ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఆలయ ప్రారంభోత్సవానికి రావాలంటూ మంగళవారం అద్వానీ, జోషీలకు ఆహ్వానాలు అందడం ప్రాధాన్యం సంతరించుకుంది. విశ్వహిందూ పరిషత్ వారికి ఆహ్వానం అందజేసింది.ఆరోగ్యం, వృద్ధాప్యం దృష్ట్యా రామాలయం ప్రారంభోత్సవానికి రావద్దని సోమవారం అద్వానీ, జోషీలకు విజ్ఞప్తి చేసిన ఆలయ ట్రస్టు.. మంగళవారం అందుకు భిన్నంగా ఆహ్వానాలు పంపడం చర్చనీయాంశమైంది. ఈ క్రమంలో ఎల్‌కే అద్వానీ, మురళీ జోషీలు కార్యక్రమానికి హాజరవుతారా..? లేదా..? అనేది సర్వత్రా ఆసక్తిగా మారింది. అయితే విశ్వహిందూ పరిషత్ అధ్యక్షుడు అలోక్‌కుమార్ మాట్లాడుతూ.. కార్యక్రమానికి వచ్చేందుకు తాము శాయశక్తులా ప్రయత్నిస్తామని నేతలిద్దరూ చెప్పారని తెలిపారు.అద్వానీ, జోషీలకు ఆహ్వానాలు అందించిన వారిలో వీహెచ్‌పీ అధ్యక్షుడు అలోక్ కుమార్‌తో పాటు ఆర్‌ఎస్‌ఎస్ నేతలు కృష్ణగోపాల్, రాంలాల్ ఉన్నారు. అద్వానీ ఆహ్వానం అందుకున్న సమయలో ఆయన కుమార్తె ప్రతిభ కూడా అక్కడే కనిపించారు.