ముంపు బాధితులను పట్టించుకోని జగన్ సర్కార్.. చింతమనేని
posted on Jul 20, 2022 @ 11:13AM
ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాలకు గోదావరికి వరద పోటెత్తింది. ఈ నేపథ్యంలో ఏలూరు జిల్లాలోని వేలూరుపాడు, కక్కునూరు గ్రామాలతోపాటు గోదావరికి అవతల ఒడ్డున ఉన్న విలీన గ్రామాల ప్రజలు సైతం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే జగన్ ప్రభుత్వం మాత్రం సహాయ చర్యల్లో తీవ్ర అలసత్వాన్ని ప్రదర్శిస్తోన్న విషయాన్ని గుర్తించిన దెందులూరు మాజీ ఎమ్మెల్యే తెలుగుదేశం నాయకుడు చింతమనేని ప్రభాకర్ నేరుగా రంగంలోకి దిగారు. ఆ క్రమంలో పోలవరం నియోజకవర్గంలోని పలు మండలాల్లో.. గోదావరి ముంపునకు గురై పునరావాస కేంద్రాల్లో తలదాచుకొంటున్న వారికి అందుతున్న సహాయక చర్యలను స్వయంగా పరిశీలించారు. అందులో భాగంగా వరద బాధితులతో నేరుగా మాట్లాడారు. అయితే తమకు ప్రభుత్వం అందిస్తున్నానని చెబుతోన్న కనీస నిత్యవసర వస్తువులు అందడం లేదని బాధితులు చింతమనేని వద్ద వాపోయారు. అదీకాక.. వరద బాధితుల కోసం ముఖ్యమంత్రి వైయస్ జగన్ ప్రకటించినవి ఏవీ తమకు అందడం లేదని చెప్పడంతో చింతమనేని ప్రభాకర్.. స్థానిక అధికారులను బాధితుల ఎదుటే నిలదీశారు. అంతే కాకుండా వరద బాధితుల కోసం టీడీపీ ఆధ్వర్యంలో 15 టన్నుల కూరగాయలను ఆయన కొనుగోలు చేశారు. ఆ క్రమంలో వేలేరుపాడు మండలంలోని వరద బాధిత కుటుంబాలకు ప్రతి రోజు పాల ప్యాకేట్స్ పంపిణీ చేయిస్తున్నారు. ఈ సందర్బంగా చింతమనేని ప్రభాకర్ మాట్లాడుతూ, అధికారంలో ఉన్నా... లేకున్నా ఆపదలో ఉన్న బాధితులను ఆదుకోవడమే తెలుగుదేశం పార్టీ సిద్దాంతమని స్పష్టం చేశారు. వరద సహాయక చర్యలు చేపట్టడంలో జగన్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. గత 4 రోజులుగా భాదితులకు కడుపు నిండా అన్నం పెట్టలేని స్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉందని ఆయన పేర్కొన్నారు. తమ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు వరద ముంపు గ్రామాల్లో పర్యటించనున్నారనీ, అందుకే ప్రభుత్వం ఈ మాత్రమైనా సాయం అందించడానికి ముందుకు వచ్చిందనీ, లేకుంటే బాధితులను జగన్ ప్రభుత్వం పట్టించుకునేది కాదని ఆయన పేర్కొన్నారు. గోదావరి ఉగ్రరూపంతో జిల్లాలోని కుక్కునూరు, వేలూరుపాడు మండలాల్లో 80 శాతం కుటుంబాలు నిర్వాసితులయ్యారని ఆయన చెప్పారు. మరోవైపు .. వరద బాధితులు చాలా కష్టాల్లో ఉన్నారని వారిని దయచేసి ఆదుకోవాలంటూ ఏలూరు జిల్లాలో వరదలపై ప్రభుత్వం నియమించిన ప్రత్యేక అధికారి కాటంనేని భాస్కర్‌ను కలిసి చింతమనేని ప్రభాకర్ విజ్జప్తి చేశారు.