175 కాదు 13 స్థానాల్లో గెలిస్తే గొప్పే .. రఘురామ కృష్ణం రాజు
posted on Jul 21, 2022 @ 11:31AM
గతం మరిచిన జగన్ సీఎంగా తాను సూపర్ మేన్ గా ఊహించుకుంటున్నారని వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణం రాజు ఎద్దేవా చేశారు. అందుకే జనం ఆగ్రహ జ్వాలలను గమనించి కూడా వచ్చే ఎన్నికలలో 175కు 175 స్థానాలలోనూ విజయం సాధిస్తామని చెబుతున్నారని అన్నారు. రచ్చబండ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన ప్రత్యేక హోదా విషయంలో జగన్ వైఫల్యాన్ని దుయ్యబట్టారు. ప్రత్యేక హోదా సాధించలేనప్పుడు ప్రత్యామ్నాయంగా కేంద్రం నుంచి ఏం సాధించుకోగలమన్నది యోచించాలనీ, ప్రత్యేక ఆర్థిక ప్యాకేసీ కోసం గత ముఖ్యమంత్రి చంద్రబాబు అదే చేశారని వివరించారు. గత ముఖ్యమంత్రి కేసులకు భయపడి ప్రత్యేక హోదాను కేంద్రానికి తాకట్టు పెట్టారని విమర్శించిన జగన్ ఈ మూడేళ్లలో చేస్తున్నది ఏమిటని నిలదీశారు. వైసీపీ నేతలు వేసిన ఒకటీ ఆరా కేసులు కొట్టివేసిన తరువాత చంద్రబాబుపై అసలు కేసులే లేవన్న రఘురామ రాజు.. ఏ కేసులూ లేని చంద్రబాబే భయపడ్డారని విమర్శించిన జగన్ 32 ఆర్థిక నేరాల కేసులలో అభియోగాలు ఎదుర్కొంటున్న జగన్ భయంతో వణికిపోతుండటం వల్లే రాష్ట్ర ప్రయోజనాల విషయంలో కేంద్రం వద్ద నోరు విప్పడం లేదని జనం భావిస్తే తప్పేముందని ప్రశ్నించారు.
పార్లమెంట్లో గాంధీ బొమ్మ వద్ద అందరూ తమ సమస్యల పరిష్కారం కోసం ఆందోళనలు చేస్తుంటారని, కానీ వైసీపీ వారు అలా ఆందోళనలు చేసిన దాఖలాలే లేవన్నారు. కేవలం ఒకే ఒక్కసారి సొంత పార్టీ ఎంపీ అయిన తనపై అనర్హత వేయాలని కోరుతూ మాత్రమే ఆందోళన చేశారంని ఆంధ్రప్రదేశ్ జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు ఎప్పటికీ పూర్తవుతుందో , అర్థం కాని పరిస్థితి నెలకొన్నదని రఘురామకృష్ణంరాజు అన్నారు.
నీటిపారుదల శాఖ మంత్రి వ్యక్తి , 2021 డిసెంబర్ నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని అసెంబ్లీలో ప్రకటించిన వీడియోను ఈ సందర్భంగా ప్రదర్శించారు. కేంద్ర ప్రభుత్వం మాత్రం 2024 జులై నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తవుతుందని పేర్కొంటే, రాష్ట్ర మంత్రి మాత్రం ఎప్పటికీ పూర్తవుతుందో చెప్పలేమని పేర్కొనడంలో అర్ధమేమిటని ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడం పట్ల రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదనడానికి ఇంత కంటే నిదర్శనమేముంటుందని రఘురామరాజు అన్నారు. ముఖ్యమంత్రి పాల్గొన్న ఒంగోలు సభ ను చూసి పార్టీ శ్రేణులు డిప్రెషన్ లోకి వెళ్లొద్దనీ రఘురామకృష్ణం రాజు అన్నారు. భవిష్యత్తులో ఇటువంటి సభలను మరిన్ని చూడవలసి వస్తుందని పేర్కొన్నారు. ఈ సభను చూసిన తర్వాత ముఖ్యమంత్రి గ్రాఫ్ పడిపోతున్నట్లు స్పష్టమవుతుందని చెప్పారు.. తన గ్రాఫ్ మాత్రమే బాగున్నదని, ఎమ్మెల్యేల గ్రాఫ్ బాగాలేదన్న ముఖ్యమంత్రి తన గ్రాఫ్ గురించి ఆత్మ విమర్శ చేసుకోవాలన్నారు.
రానున్న ఎన్నికల్లో 175 స్థానాలు గెలుస్తాం అని జగన్ అంటున్నారని, 13 స్థానాలలో గెలిస్తే గొప్పేనని రఘురామకృష్ణం రాజు అన్నారు. ముఖ్యమంత్రిని పట్టుకొని రోడ్డుమీదే కాల్చండి… బంగాళాఖాతంలో కలపండి… చెప్పులతో కొట్టండి అని జగన్ విపక్ష నేతగా చేసిన వ్యాఖ్యలకు అప్పటి టిడిపి ప్రభుత్వం ఎన్నిసార్లు 41ఏ నోటీసులను జారీ చేసిందని ప్రశ్నించారు. ఇప్పుడు టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి పట్టాభికి 41ఏ కింద నోటీసులు జారీ చేయడం పట్ల ఆయన అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. ప్రతిపక్ష పార్టీకి చెందిన నాయకులు విమర్శించకుంటే ముఖ్యమంత్రిని పొగుడుతారా అంటూ ప్రశ్నించారు