సూపర్ స్టార్ల మధ్యే అసలు పోటీ!
posted on Nov 7, 2022 @ 12:03PM
హమ్మయ్య...సూపర్ 12 గ్రూప్ 42 మ్యాచ్ ల కష్టాల నుంచి బయటపడి మొత్తానికి టీ20 ప్రపంచకప్ సెమీస్ లోకి నాలుగు జట్లు సెమీస్ చేరుకున్నాయి. గ్రూప్ 1 నుంచి ఇంగ్లండ్, భారత్, 2 నుంచి పాకిస్తాన్, న్యూజి లాండ్ ఊహించని విజయా లతో, అవాంతరాలను అధిగ మించడంతో సెమీస్ లో తల పడేందుకు సిద్ధపడ్డాయి. బుధవారం సిడ్నీలో పాకిస్తాన్ న్యూజిలాండ్ తో తలపడుతుంది. గురువారం మరో సెమీస్ లో భారత్ అడెలైడ్ లో ఇంగ్లండ్ తో తలపడుతుంది. వెస్టిండీస్, ఆతిథ్య ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా జట్లు సెమీస్ కూడా చేరలేకపోవడం, టోర్నీ నుంచి ఇక కరాచీ వెళ్లడమే ఆలస్యం అనుకున్న పాకిస్తాన్ కి మంచి అవకాశం రావడం క్రికెట్ వీరాభిమనానులను ఎంతో ఆశ్చర్యపరిచింది.
ఈసారి సెమీస్ అత్యంత ఉత్కంఠభరితంగా జరిగే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా బయటికి పోతుందని అందరూ అనుకున్న పాకిస్తాన్ సెమీస్ చేరుకుంది. వారి సీనియర్లు, మాజీల చేత తిట్టు తింటున్న పాక్ ప్లేయర్లు సెమీస్ చేరడంలో చివరి గ్రూప్ మ్యాచ్ లో రాణించారు. కనుక సెమీస్ కి మరింత ఉత్కంఠత చేకూర్చింది. వాస్తవా నికి నాలుగు మ్యాచ్ ల మధ్య జరిగే పోరు కంటే సూపర్ స్టార్లు మధ్య పోటీ అనాలి. కేన్ విలియంసన్, కింగ్ కోహ్లీ, జోస్ బట్లర్, అఫ్రిదీ, గ్లెన్ ఫిలిప్స్, రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, రిజ్వాన్ సత్తా మరింతగా ప్రేక్షకులు ఆస్వాదించనున్నారు. గెలిచినా, ఓడినా, చివరగా టైటిల్ పోటీకి నిలిచినా, ఓడినా.. ఏమయినప్పటికీ సెమీస్ నుంచీ టైటిల్, విజేత వరకూ ఈ నాలుగు జట్ల లోని హేమాహేమీల మధ్య హోరాహోరీ పోటీతత్వం చూడడానికి ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. లెక్కల ప్రకారం చూస్తే, ఇంతవరకూ జరిగిన మ్యాచ్ లు ఫలితాల ప్రకారం చూస్తే అదృష్టం కూడా కలిసి వస్తే భారత్ టైటిల్ నెగ్గడానికే అవకాశాలున్నాయని క్రికెట్ పండితుల మాట. కానీ కివీస్ ని మాత్రం తక్కువ అంచనా వేయడానికి వీలు లేదు. మిగతా రెండు జట్ట కంటే ఈసారి కివీస్ మరింత పదునుగా ఉంది. టైటిల్ సాధించేందుకు అన్ని విధాలా గొప్ప నైపుణ్యాన్ని ప్రదర్శిస్తోంది. కనుక మనవాళ్లు బహు జాగ్రత్తపడాల్సిన అవసరం ఎంతయినా ఉంది. భారీ షాట్ల మీదనే దృష్టి పెట్టడం కంటే స్కోర్ ను పరుగులెత్తించడానికి వేగంగా పరుగులు చేయడం పైనే కెప్టెన్ శర్మ, రాహు లుడూ శ్రమించాల్సి ఉంటుంది.
గ్రూప్ మ్యాచ్ ల్లో చివరగా విలియంసన్ కివీస్ జట్టు ఆస్ట్రేలియా పై గెలిచి తమ సత్తాను మరోసారి తెలియజేసింది. ఆఫ్ఘనిస్తాన్ తో తలపడిన మ్యాచ్ వర్షార్ఫణమే అయినా వారి ప్రయాణాన్ని అడ్డుకోలేదు. గ్లెన్ ఫిలిప్స్ వంటి డాషింగ్ బ్యాటర్ వెన్నుదన్నుగా లంక ను వెనక్కి పంపగలిగింది. గ్లెన్ 64 బంతుల్లో సెంచరీ సాధించడంలో గొప్ప బ్యాటింగ్ నైపుణ్యం ప్రదర్శించి అలరించాడు. ఐర్తాండ్ తో ఆడిన మ్యాచ్ లో కివీస్ కెప్టెన్ విలియంసన్ మంచి ఫామ్ ప్రద ర్శించి జట్టుకు సునాయాశ విజయాన్నే అందించాడు. కివీస్ ఆఫ్ఘన్ తో తలపడిన తర్వాత మూడు మ్యాచ్ ల్లో ఇంగ్లండ్ చేతుల్లో కేవలం 20 పరుగుల తేడాతో ఓడినప్పటికీ ఐర్లాండ్ మీద 35 పరుగులతో గెలచింది. అలా ఈసారి సెమీస్ కు ముందుగా చేరింది. తమ బ్యాటింగ్, ఫీల్డింగ్ సత్తాతో ఆసీస్, ఇంగ్లండ్ జట్లకు హెచ్చరికలు చేయడం గమనించాం. కానీ భారత్ తో తలపడిన హోరాహోరీ పోరులో మ్యాచ్ లో 2009 ఛాంపియన్లు ఊహించని పరాభవమే ఎదుర్కొన్నది. అంతకు మించి జింబాబ్వే చేతిలో ఓడి అమితాశ్చర్యపరిచింది.
గ్రూప్ 1 నుంచి సెమీస్ చేరిన రెండో జట్టు ఇంగ్లండ్. వర్షం దెబ్బతీసిన మ్యాచ్ లో ఐర్లాండ్ పై 5 పరుగుల తేడాతో అదీ డిఎల్ఎస్ పద్దతిలో గెలిచి సెమీస్ చేరుకుంది. అయితే అందుకు ముందు మ్యాచ్ జోస్ బట్లర్ జట్టు ఆఫ్ఘన్ పై 5 వికెట్ల తేడాతో ఘనవిజయమే సాధించింది. అలాగే న్యూజిలాండ్ పై 20 పరుగులతో, లంక పై 4 వికెట్ల తేడాతో విజయం సాధించి సెమీస్ కి మార్గం సుగమం చేసుకుంది.
పాకిస్తాన్ విషయానికి వస్తే, బాబర్ అజామ్ జట్టు కొంత పేలవంగా ఆడుతూ ప్రేక్షకులను నిరాశపరిచింది. కానీ గ్రూప్ మ్యాచ్ ల్లో చివరి దశలో దక్షిణాఫ్రికా పై ఘనవిజయంతో సెమీస్ అవకాశాలు నిలబెట్టుకుంది. ఇంగ్లండ్ తో హోరా హోరీగా జరిగిన మ్యాచ్ లో గెలిచి ఫైనల్ ఫోర్ లో నిలిచి అభిమానులకు ఆనందం కలిగించింది. ఆ మ్యాచ్ లో వారి ప్రధాన పేసర్ షాహిన్ అఫ్రిదీ అద్భుతంగా రాణించి 22 పరుగులిచ్చి 4 వికెట్ల తీసుకోవడంలో తాను తిరిగి మంచి ఫామ్ లోకి వచ్చానని ప్రకటించాడు. కానీ జట్టును మాత్రం కెప్టెన్ బాబార్ అజామ్ అంతగా ఫామ్ లో లేకపోవడమే ఇంకా వేధిస్తోంది. 5 మ్యాచ్ ల్లో అతను కేవలం 39 పరుగులే చేయగలిగాడు.
రోహిత్ శర్మ నాయకత్వంలోని భారత్ జట్టు గ్రూప్ మ్యచ్ ల్లో పాకిస్తాన్ పై సాధించిన విజయమే కీలకంగా మారింది. 90 వేలమంది ప్రేక్షకుల మధ్య దాయాదులను చిత్తు చేయడంలో కింగ్ కోహ్లీ సూపర్ డూపర్ బ్యాటింగ్ ప్రదర్శన క్రికెట్ లోకం చూసి ఆనందోత్సాహంలో మునిగితేలింది. పాక్, నెదర్లాండ్స్ పై విజయాలు తర్వాత దక్షిణాఫ్రికా చేతిలో 5 వికెట్ల తేడాతో ఓటమి భారత్ పెద్దగా బాధించలేదు. కానీ గెలిచి ఉంటే ఆనందం వేరేగా ఉండేది. కానీ టోర్నీలో అందరి కంటే ప్రముఖ బ్యాటర్ గా కింగ్ అందరి మన్ననలూ అందుకోవడం గమనార్హం. అతని ధాటికి ప్రత్యర్థులకు ఫైనల్ భయాలు పట్టుకున్నాయి. అతనితో పాటు సూపర్ ఫాస్ట్ ప్లేయర్ గా సూర్యకుమార్ యాదవ్ అవతరించడంతో మిడిల్ ఆర్డర్ కు ఢోకా లేకపోవడం మంచి స్కోర్ కి అవకాశాలు మెరుగుపడటంతో ఫైనల్ కి అవకాశాలు మెరుగుపడి నట్టే నని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు. టీ20 ప్రపంచకప్ తొలి టైటిల్ సాధించిన భారత్ ఈ పర్యాయం కప్ సాధించుకోవడానికి కూడా మంచి అవకాశం ఉంది.