ఎన్నికల ముందు మొదలైన ఐటి దాడులు.. ప్రతిపక్షాల గగ్గోలు
posted on Mar 19, 2021 @ 11:00AM
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తన రాజకీయ ప్రత్యర్థులపై సిబిఐ, ఐటి, ఇడి వంటి సంస్థలను అడ్డుపెట్టుకుని రాజకీయంగా లబ్ది పొందే ప్రయత్నం చేస్తోందని ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్న సంగతి తెల్సిందే. ఈ సంస్థలను ప్రయోగించి బీజేపీ ప్రత్యర్థులను గుక్క తిప్పుకోకుండా చేసి అడ్డు తొలగించుకుంటోందని ఆయా పార్టీల ముఖ్య ఆరోపణ. దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా తన ప్రత్యర్థులపై ఈ సంస్థలను ఉపయోగించి తమ పార్టీకి, అలాగే తమ పార్టీ కూటమికి లబ్ది చేకూరేలా ఈ సంస్థలను వాడుకుంటోందని బీజేపీ పై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి.
తాజాగా తమిళనాడులో బీజేపీ చీఫ్ ఎల్.మురుగన్ పోటీ చేస్తున్న తిరుప్పూరు జిల్లా ధారాపురం నుంచి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఈ నియోజకవర్గంలో రెండు రోజులుగా ఆదాయపు పన్ను శాఖ అధికారులు నిర్వహించిన తనిఖీల్లో ప్రత్యర్థులు, వారి బంధువుల ఇళ్లు, కార్యాలయాల్లో జరిపిన సోదాలలో రూ.8 కోట్ల నగదు పట్టుబడింది. ఆ నియోజకవర్గంలో డీఎంకే తరఫున సెల్వరాజ్ పోటీ చేస్తున్నారు. ఆయనకు మద్దతుగా డీపీఐ, ఎండీఎంకే, కాంగ్రెస్ పార్టీలు ప్రచారం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో బుధవారం ఆ ప్రాంతంలోని ఎండీఎంకే నేత కవిన్ నాగరాజ్, ఆయన సోదరుడు మక్కల్ నీదిమయ్యం కోశాధికారి చంద్రశేఖర్, డీఎంకే నాయకుడు ధనశేఖర్ ఇళ్లు, వ్యాపార సంస్థలు, కార్యాలయాల్లో ఐటీ అధికారులు ఏకకాలంలో సోదాలు జరిపారు. ఈ తనిఖీలు గురువారం ఉదయం కూడా కొనసాగాయి.
రెండు రోజులుగా జరిపిన సోదాల్లో లెక్క చూపని రూ.8 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నామని,. అదే సమయంలో పన్నుల ఎగవేతకు సంబంధించి కొన్ని కీలకపత్రాలు లభించాయని ఐటీ అధికారులు మీడియాకు తెలిపారు. అయితే తాజా ఐటి రెయిడ్స్ పై డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్, టీఎన్‌సీసీ అధ్యక్షుడు అళగిరి తమ తీవ్ర నిరసన వ్యక్తంచేశారు. ఎన్నికలలో ప్రత్యర్థులను భయపెట్టేందుకే బీజేపీ ఈ తనిఖీలు చేయించిందని వారు ఆరోపించారు.ఐటి దాడులు జరిగిన చంద్రశేఖర్ కోట్లకు పడగెత్తిన పారిశ్రామికవేత్త అని, ఐటీ అధికారులు కేవలం దురుద్దేశపూర్వకంగా ఈ దాడులు చేస్తున్నారని విమర్శించారు. అయితే, ఐటీ దాడులకు, తమ పార్టీకి ఎటువంటి సంబంధంలేదని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు మురుగన్ చెప్పారు.