జగన్ ఇన్కం ట్యాక్స్ ఎంతో తెలుసా?
posted on Mar 19, 2021 @ 11:09AM
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వేల కోట్ల ఆస్తులున్నాయని విపక్షాలు ఆరోపిస్తూ ఉంటాయి. అక్రమాస్తుల కేసులో ఆయనపై ఈడీ, సీబీఐ కేసులు కూడా నమోదయ్యాయి. గతంలో ఆయన జైలుకు కూడా వెళ్లి వచ్చారు. దీంతో జగన్ రెడ్డికి ఎన్ని ఆస్తులు ఉన్నాయన్నదానిపై జనాల్లోనూ చర్చ జరుగుతూ ఉంటుంది. ఆయన ఎంత ఆదాయపన్ను చెల్లిస్తారన్న దానిపై కూడా ప్రజల్లో ఆసక్తి ఉంటుంది.
అయితే 2020-21 ఆర్థిక సంవత్సరానికి గాను జగన్మోహన్ రెడ్డి ఇన్ కమ్ ట్యాక్ ఫైల్ చేయనున్నారు .2020-21 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించి సీఎం జగన్ ఇన్ కమ్ ట్యాక్స్ సంబంధించిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. సీఎం జగన్ 2020-21 ఆర్ధిక సంవత్సరానికి ఆదాయపన్నుగా చెల్లించాల్సిన రూ.7,14,924లను మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రవాణాశాఖ మరియు సమాచార శాఖ మంత్రి మంత్రి పేర్ని వెంకట్రామయ్య ఆదాయ పన్నుగా చెల్లించాల్సిన రూ.2,91,096 కూడా ప్రభుత్వం విడుదల చేసింది. సీఎం, మంత్రికి కలిపి మొత్తం రూ.10,06,020 మంజూరు చేస్తూ జీఏడీ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ ఉత్తర్వులు జారీ చేశారు.
సీఎం జగన్మోహన్ రెడ్డి ఏడాదికి చెల్లిస్తున్న ఇన్ కం ట్యాక్స్ కేవలం ఏడు లక్షల 14 వేల రూపాయలుగా ఉండటం అందరిని ఆశ్చర్యపరుస్తోంది. అయితే జగన్మోహన్ రెడ్డికి సంబంధించి బిజినెస్ వ్యవహారాలన్ని అతని భార్య భారతీ రెడ్డి నిర్వహిస్తారు కాబట్టి.. జగన్ కట్టే ఇన్ కం ట్యాక్స్ తక్కువగా ఉంటుందని చెబుతున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం నెలకు కేవలం ఒక్క రూపాయి మాత్రమే జీతం తీసుకుంటున్నారు.