తెలుగు వాడకం తగ్గిందా?
posted on Aug 29, 2022 @ 11:22AM
వాడుకభాష ఉద్యమానికి ఆద్యులు, బహుముఖ ప్రజ్ఞాశాతి గిడుగు రామ్మూర్తి జయంతిని తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకోవడం ఎంతో గర్వకారణమని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అన్నారు. తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా సీఎం జగన్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ... తెలుగు సాహిత్యాన్ని సరళీక రించి, తెలుగుభాష తీయదనాన్ని సామాన్యుడికి చేరువ చేసిన రామ్మూర్తి పంతులు తెలుగు భాషా సంస్క ర్తల్లో అగ్రగణ్యులుగా నిలిచారంటూ సీఎం జగన్ ట్వీట్ చేశారు.
తెలుగు వికాసంలో ఎవరెవరు ఎలాంటి మార్పులు తీసుకొచ్చారు అన్నప్పుడు కందుకూరి వీరేశలింగం పంతులు తెలుగు సమాజంలో మార్పు తేవడానికి.. గురజాడ అప్పారావు తెలుగు సాహిత్యానికి ఎంత సేవ చేశారో.. అధికార భాషను ప్రజల భాషగా మార్చడానికి గిడుగు రామమూర్తి పంతులు గారు అంతే కృషి చేశారు. వ్యావహారిక భాషోద్యమ నాయకుడు గిడుగు రామ్మూర్తి జయంతిని తెలుగు భాషాదినోత్సవంగా జరుపు కోవడం పరిపాటి. ఈ రోజు సభలు జరిపి, పదోతరగతి, ఇంటర్ వార్షిక పరీక్షల్లో తెలుగు లో ప్రతిభ చూపుతున్న విద్యార్థులకు ప్రోత్సాహకాలని, తెలుగు భాషా చైతన్య సమితి లాంటి స్వచ్ఛంద సంస్థలు అందచే స్తున్నాయి. ప్రభుత్వ కార్యాలయాలలో తెలుగు వినియోగం పెంచడానికి కృషి చేస్తు న్నారు.
ప్రపంచీకరణ వలన పిల్లలను ఆంగ్ల మాధ్యమంలో చదివించటానికి ఎక్కువ మంది తల్లిదండ్రులు ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుతము కేవలం 27% మంది పిల్లలు మాత్రమే తెలుగు మాధ్యమంలో చదువు తున్నా రని లెక్కలు కూడా తెలియజేస్తున్నాయి. ప్రత్యేకించి టెలివిజన్ మాధ్యమాల్లో పర భాష పదాల వాడుక పెరిగిపోతున్నది.
ఇలాగే కొనసాగితే , తెలుగు వాడుకలో తగ్గిపోయి, ఆంగ్లం మాతృభాషగా మారే ప్రమాదము న్నది. ఐక్య రాజ్య సమితి విద్య సాంస్కృతిక సంస్థ 1999/2002-12 తీర్మా నంలో ప్రపంచంలోని ఆరువేల భాషలలో 3వేలు కాలగర్భంలో కలసిపోగా, 2025 నాటికి భారతదేశంలో కేవలం హిందీ, బెంగాలీ, మరాఠీ, తమిళం, మలయా ళం మిగులుతాయని భాషా నిపుణులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
కాలానుగుణంగా సామాజిక, రాజకీయ,సాంకేతిక పరిణామాల అనుసరించి భాషలో కొన్ని కొత్త పదాలు వచ్చి చేరాయి. సాంకేతిక అభివృద్ధి పథంలో భాషా వినియోగం కాస్తంత తగ్గుముఖం పట్టింది. ఇది తెలుగు ప్రజలు ఆశించదగినది కాదు. మాతృభాషలో మాట్లాడటం నామోషీగా భావించే రోజులు రావడం విచారకరం.
ఆంగ్లమాధ్యమాల హడావుడి, ఆంగ్లభాషా వాడకం మితిమీరిపోవడంతో తెలుగు మాట్లాడే వారు ముఖ్యంగా వృత్తి, ఉద్యోగాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆంగ్లం పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపడం వల్ల తెలుగును కాదనడం, తెలుగు మీడియాకు ఆదరణ తగ్గడం గమనిస్తున్నాం. ఇది వాస్తవానికి ఆశించ దగ్గ పరిణామం కాదని విమర్శకుల మాట.