బాబు అరెస్టు అక్రమమేనా?.. సీఎస్ నేతృత్వంలో ఏజీ, సీఐడీ చీఫ్ గవర్నర్ తో భేటీ సంకేతమదేనా?
posted on Oct 10, 2023 @ 4:01PM
స్కిల్ కేసులో చంద్రబాబు అరెస్టు అక్రమమని జగన్ సర్కార్ అంగీకరించేసిందా? సుప్రీం కోర్టులో ఈ కేసుపై చంద్రబాబు దాఖలు చేసిన స్క్వాష్ పిటిషన్ పై మంగళవారం (అక్టోబర్ 10) జరిగిన విచారణలో ముకుల్ రోహత్గీ వాదనలు వీగిపోక తప్పదన్న భావనకు వచ్చిందా? అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
ఈ అనుమానాలు వ్యక్తం కావడానికి కారణమేమిటంటే.. ఇప్పటి దాకా స్కిల్ కేసులో చంద్రబాబు అరెస్టు విషయం ముందుగా గవర్నర్ దృష్టికి తీసుకెళ్లాల్సిన అవసరం లేదనీ, ఆయన అనుమతి అక్కర్లేదనీ చెబుతూ వస్తున్న సర్కార్.. ఇప్పడు సుప్రీం కోర్టులో ఈ కేసు విచారణ శుక్రవారానికి వాయిదా పడిన తరువాత హడావుడిగా ఈ కేసుకు సంబంధించిన వివరాలను ప్రభుత్వం తరఫున సీఎస్ జవహర్ రెడ్డి, అడ్వొకేట్ జనరల్ శ్రీరామ్, సీఐడీ చీఫ్ సంజయ్ లు గవర్నర్ ను కలిసి వివరించారు. అంటే.. స్కిల్ కేసులో చంద్రబాబు అరెస్టు విషయంలో ముందుగా గవర్నర్ అనుమతి తీసుకోకపోవడం కరెక్ట్ కాదని పరోక్షంగా ప్రభుత్వం అంగీకరించేసినట్లేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
అలాగే సోమవారం వైసీపీ విస్తృత స్థాయి సమావేశంలో మాట్లాడుతూ.. జగన్ చంద్రబాబు అరెస్టు తనకు తెలిసి జరిగింది కాదనీ, స్కిల్ కేసు దర్యాప్తు చేస్తున్న సీఐడీ ఆ కేసు దర్యాప్తులో భాగంగా అరెస్టు చేసిందనీ చెప్పి చేతులు దులిపేసుకోవడానికి ప్రయత్నించారు. అంటే ఇప్పుడు సుప్రీం కోర్టులో చంద్రబాబుకు అనుకూలంగా తీర్పు వస్తే ఏపీ సీఐడీ నిండా ఇరుక్కున్నట్లే అవుతుంది. ఈ నేపథ్యంలోనే సుప్రీం కోర్టులో చంద్రబాబు క్వాష్ పిటిషన్ శుక్రవారానికి వాయిదా పడగానే.. సీఎస్ జవహర్ రెడ్డి ఆధ్వర్యంలో అడ్వొకేట్ జనరల్, సీఐడీ చీఫ్ గవర్నర్ ను కలిశారని చెబుతున్నారు. ముందునుంచీ చంద్రబాబు తరఫు న్యాయవాదుల బృందం చెబుతున్నట్లుగానే ఈ కేసులో 17ఎ వర్తిస్తుందని ఈ రోజు సుప్రీం కోర్టులో జరిగిన విచారణ సందర్భంగా సీనియర్ న్యాయవాది సాల్వే వాదనలపై న్యాయమూర్తులు సానుకూలంగా స్పందించినట్లు న్యాయనిపుణులు అభిప్రాయపడ్డారు.
అలాగే ప్రభుత్వం తరఫున ముకుల్ రోహత్గీ వాదిస్తున్న సందర్భంగా న్యాయమూర్తులు నాలుగు కీలక ప్రశ్నలు సంధించారనీ, అవన్నీ కూడా 17ఏకు సంబంధించి ముకుల్ రోహత్గీ చేస్తున్న వాదనలపైనేననీ అంటున్నారు. ఇంతకీ ఆ ప్రశ్నలు ఏమిటంటే..
సుప్రీంకోర్టు ప్రశ్నలకు సరైన సమాధానం చెప్పని రోహత్గి
1. 17A నేరానికి వర్తిస్తుందా? నిందితులకు వర్తిస్తుందా?
2. 2018లో విచారణ ప్రారంభించినప్పుడు ఏం కనిపెట్టారు?
3. అవినీతికి సంబంధిందిన సెక్షన్ అమలు కాకపోతే మిగతా సెక్షన్ల కింద ప్రత్యేక కోర్టు విచారించవచ్చా?
4. మిగతా సెక్షన్ల కింద పెట్టిన కేసులు చెల్లుతాయా? లేదా?
అయితే ఈ నాలుగు ప్రశ్నలకూ ముకుల్ రోహత్గీ సరైన సమాధానం ఇవ్వకుండా పాత వాదననే కొనసాగించారని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఏపీ సీఎస్ జవహర్ రెడ్డి నేతృత్వంలో అడ్వొకేట్ జనరల్ శ్రీరామ్, ఏసీ సీఐడీ చీఫ్ సంజయ్ గవర్నర్ అబ్దుల్ నజీర్ ను కలవడం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. గవర్నర్ కు వీరు ముగ్గురూ స్కిల్ కేసు, చంద్రబాబు అరెస్టు, తదననంతర పరిణామాలను వివరించారని తెలుస్తోంది. ఏది ఏమైనా సుప్రీంలో చంద్రబాబు క్వాష్ పిటిషన్ విచారణ, 17ఏ సెక్షన్ పై పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న సమయంలో ప్రభుత్వం గవర్నర్ ను సంప్రదించడం కీలకంగా మారింది. అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.