జగన్ సర్కార్ ను నడిపిస్తున్న ఆ అదృశ్య శక్తి?
posted on Oct 11, 2023 6:12AM
ఏ రాష్ట్రంలో అయినా ప్రభుత్వం అంటే ఎన్నో శాఖలు.. మరెన్నో కార్పొరేషన్లు.. అన్నిటికీ ప్రత్యేకమైన విధి విధానాలు ఉంటాయి. అన్నీ కలిస్తేనే ప్రభుత్వం అవుతుంది. అదేంటో ఏపీలో మాత్రం అన్నిటికీ ఒక్కరే కనిపిస్తారు. పథకం ఏదైనా.. శాఖ ఏదైనా.. నిధులు ఎన్నైనా సీఎం జగన్ మోహన్ రెడ్డి ఒక్కరే కనిపిస్తారు. ఏ శాఖకి మంత్రి ఎవరైనా అన్నిటి గురించి సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఒక్కరే కనిపిస్తారు. కానీ, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్న ప్రకారం అసలు ఏపీ ప్రభుత్వాన్ని నడిపిస్తుంది జగన్ మోహన్ రెడ్డి కాదని.. ఓ అదృశ్య శక్తి నడిపిస్తోంది. ఇప్పటికిప్పుడు ఈ చర్చ రావడానికి జగన్ మోహన్ రెడ్డి తాజా వ్యాఖ్యలే కారణం. కేవలం చర్చతో ఆగిపోకుండా ఏమో జగన్ సర్కార్ ను నడిపిస్తున్న అదృశ్య శక్తి ఉందన్నదే నిజమని జనం నమ్ముతున్నారు కూడా. ఇంతకీ జగన్ ఏమన్నారంటే..
తాజాగా విజయవాడలో జరిగిన వైసీపీ విస్తృత స్థాయి సమావేశంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి తన ప్రసంగంలో అవినీతి, అక్రమాలు, మోసాలు, కుట్రల గురించి మాట్లాడారు. అక్కడితో ఊరుకోకుండా అసలు రాజకీయం అంటే ఏమిటి అనే దానికి ఆయన నిర్వచనం చెప్పేశారు. అయితే జగన్ నిర్వచనం పై నెటిజన్లు ఓ స్థాయిలో సెటైర్లు గుప్పిస్తున్నారు. అది వేరే సంగతి. కానీ వైసీపీ విస్తృత స్థాయి సమావేశంలో చంద్రబాబు అరెస్టు అంశాన్నిప్రస్తావించిన జగన్ ఆయన అరెస్టుతో తనకు ఎలాంటి సంబంధం లేదని జగన్ చెప్పారు. ఆ సందర్భంగా ఆయన మాట్లాడిన మాటలే జగన్ సర్కార్ ను నడిపిస్తున్న అదృశ్య శక్తి ఏదైనా ఉందా అన్న అనుమానాలు వ్యక్తం కావడానికి కారణమయ్యాయి. ఈ సభలో జగన్ చంద్రబాబు అరెస్టు క్రెడిట్ బీజేపీకి ఇద్దామని అనుకున్నారో లేకపోతే చంద్రబాబు అరెస్టు వెనుక ఉన్నది బీజేపీ అని చెప్పాలనుకున్నారో స్పష్టత లేదు కానీ, చంద్రబాబు అరెస్టుకు తాను ఎంత మాత్రం కారణం కాదని మాత్రం చెప్పుకున్నారు. కేంద్రంలో ఉన్న బీజేపీ యే చంద్రబాబు అరెస్టు వెనుక ఉన్నదని చెప్పడానికి ప్రయత్నించారు. కేంద్రం ఐటీ నోటీసు ఇచ్చిందని, సీఐడీ అరెస్ట్ చేసిందని జగన్ తనకు మాత్రమే సాధ్యమైన లాజిక్ తో మాట్లాడారు.
కానీ, అసలు కేంద్రం ఐటీ నోటీసులకూ, సీఐడీ అరెస్టుకు సంబంధం ఏమిటో చెప్పలేదు. కానీ కేంద్రంలో బీజేపీ ఉందని.. అందులో సగం మంది టీడీపీ వాళ్లేనని కూడా అన్నారు. అలాగే తాను లండన్‌లో ఉన్నపుడు చంద్రబాబును పోలీసులు అరెస్టు చేశారని, ఆ ఆరెస్ట్‌తోనూ తనకు ఎలాంటి సంబంధం లేదని పేర్కొన్నారు. అసలు లండన్ లో ఉన్న తనకు చంద్రబాబు అరెస్ట్ గురించి తెలియనే తెలియదని చెప్పుకొచ్చారు. దీంతోనే ఇప్పుడు అసలు రాష్ట్రంలో పాలనపైనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చంద్రబాబు అరెస్ట్ పై జగన్ చేసిన వ్యాఖ్యల అంశంపై బీజేపీ కార్యదర్శి సత్యకుమార్ స్పందించారు. తనకు తెలియకుండానే ప్రతిపక్ష నాయకుడి అరెస్ట్ జరిగిందని జగన్ అంటున్నారంటే రాష్ట్రంలో పాలన ఎటువంటి దయనీయ పరిస్థితుల్లో ఉన్నదో తెలుస్తోందని విమర్శలు గుప్పిస్తూ ట్వీట్లు చేస్తున్నారు. దీంతో సీఎంకు తెలియకుండానే చంద్రబాబు అరెస్ట్ జరిగిందంటే రాష్ట్రాన్ని జగన్ పాలిస్తున్నారా? లేక ఆయన పేరుతో మరెవరైనా పాలిస్తున్నారా అన్న అనుమానాలు కలుగుతున్నాయి..
చంద్రబాబు అరెస్ట్ గురించి జగన్ కు తెలియకపోతే మరి సీఐడీకి ఆదేశాలిస్తున్న ఆ అదృశ్య శక్తి ఎవరు? అన్న చర్చ ప్రజలతో పాటు ప్రభుత్వ వర్గాలలో కూడా వినిపిస్తున్నది. అయితే, నిజానికి జగన్ సీఎంగా ఉన్నా.. అన్ని శాఖలకు మంత్రులు ఉన్నా అన్నీ నడిపించేది ఒక్కరే.. ఆయనే సజ్జల అన్నది అందరికీ తెలిసిందే. ఇప్పుడు బీజేపీ కార్యదర్శి సత్యకుమార్ లేవనెత్తిన అనుమానాలు కూడా ఇవే. చంద్రబాబు అరెస్టు ఒక్కటే కాదు అసలు ప్రభుత్వం ఏం చేయాలన్నది.. ఏ మంత్రి ఎప్పుడు మీడియా ముందుకొచ్చి ఎవరిని విమర్శించాలన్నది అన్నీ ఆయనే డిసైడ్ చేస్తారని, పథకాల నుండి అప్పుల వరకూ అన్నీ ఆయన చేతుల మీదుగానే నడుస్తాయన్న ఆరోపణలు ఉన్నాయి. ఇటు వైసీపీని అటు ఏపీ ప్రభుత్వాన్ని ఆయనే నడిపిస్తున్నారని.. పార్టీ సమావేశాల నుండి ప్రభుత్వ పాలసీల వరకూ అన్నీ సజ్జల పర్యవేక్షణలోనే జరుగుతాయని పార్టీ శ్రేణులే చెబుతున్నాయి. ఇంకా చెప్పాలంటే జగన్.. సంతకానికి, ఇచ్చిన స్క్రిప్ట్ చదవడానికి మాత్రమే రబ్బర్ స్టాంప్ మాదిరి పనిచేస్తున్నారన్న అభిప్రాయం కూడా వ్యక్తం అవుతోంది.