ఆర్టీసీ ఎండీగా సజ్జనార్.. సీపీగా స్టీఫెన్ రవీంద్ర.. కేసీఆర్ లెక్క ఏంటంటే...
posted on Aug 25, 2021 @ 2:45PM
తెలంగాణ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. ఇద్దరు సమర్థులైన ఐపీఎస్ అధికారులను రెండు కీలక పోస్టుల్లో నియమించింది. ఇప్పటి వరకూ సైబరాబాద్ సీపీగా ఉన్న సజ్జనార్‌ను ఆర్టీసీ ఎండీగా నియమించగా.. డైనమిక్ ఐపీఎస్ ఆఫీసర్‌గా పేరున్న స్టీఫెన్ రవీంద్రను సైబరాబాద్ పోలీస్ కమిషనర్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది తెలంగాణ సర్కారు.
సైబరాబాద్ సీపీగా సజ్జనార్ మూడేళ్లకు పైగా పని చేస్తున్నారు. సజ్జనార్ హయాంలోనే దిశా హత్యాచార కేసులో నిందితుల ఎన్‌కౌంటర్ జరిగింది. దీంతో ఆయన పేరు దేశవ్యాప్తంగా మారుమోగిపోయింది. సజ్జనార్‌కు ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్‌గా గుర్తింపు వచ్చింది. సైబరాబాద్ సీపీగా ఆయన పనితీరు అందరి ప్రశంసలు పొందింది. ఇలాంటి సమయంలో కీలకమైన టీఎస్‌ఆర్టీసీకి ఎండీగా పంపించి ఆయనకు మరింత ఉన్నత స్థానాన్ని కట్టబెట్టింది. ఆర్టీసీ ఎండీగా చేసిన పలువురు ఆ తర్వాత డీజీపీ కావడం ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్. ఆ లెక్కన నెక్ట్స్ తెలంగాణ డీజీపీ సజ్జనారే అవుతారా?
ఇక డైనమిక్ ఆఫీసర్ స్టీఫెన్ రవీంద్రకు.. సైబరాబాద్ సీపీగా కీలక పోస్ట్ కట్టబెట్టారు. గతంలో నక్సల్స్ ఏరివేతలో సమర్థవంతంగా పని చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంతో ఉద్యమకారులపై ఉక్కుపాదం మోపారనే విమర్శ కూడా ఆయనపై ఉంది. జగన్ ఏపీ సీఎం కాగానే.. స్టీఫెన్ రవీంద్రను డిప్యూటేషన్‌పై ఏపీకి రప్పించాలని గట్టిగా ప్రయత్నించారు. ఆయనను ఏపీకి తీసుకొచ్చి ఐబీ చీఫ్‌ను చేస్తారంటూ ప్రచారం జరిగింది. అయితే, ఏపీకి పంపించడానికి కేంద్ర హోంశాఖ ఒప్పుకోకపోవడంతో ఆ డిప్యూటేషన్ సాధ్యం కాలేదు. ప్రస్తుతం ఆయన తెలంగాణలో హైదరాబాద్ రీజియన్ ఐటీగా ఉన్నారు. అలాంటి స్టీఫెన్‌ను సైబరాబాద్ సీపీగా నియమించడం ఆసక్తికరంగా మారింది. ఈ మధ్య దళిత అధికారులకు కేసీఆర్ సర్కారు సరైన గుర్తింపు, ప్రాధాన్యం ఇవ్వడం లేదనే ఆరోపణలు బాగా వినిపిస్తున్నాయి. ఆ నేపథ్యంలో స్టీఫెన్ రవీంద్రకు ముఖ్యమైన సైబరాబాద్ పోలీస్ కమిషనర్ బాధ్యతలు కట్టబెట్టారా? అనే ప్రచారం కూడా జరుగుతోంది. కారణం ఏదైనా.. ఇద్దరు సమర్థులైన ఐపీఎస్ అధికారులకు.. రెండు కీలకమైన పదవులు కట్టబెట్టడాన్ని అంతా స్వాగతిస్తున్నారు.