ఆర్ముర్ పాలిటిక్స్... విఠల్ రావు దెబ్బకి జీవన్ రెడ్డిలో పెరుగుతున్న అభద్రత!!
posted on Nov 12, 2019 @ 4:03PM
ఎంత వెలుగుకు అంత చీకటి అన్నట్లుగా ఉంది నిజామాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్ దాదన్నగారి విఠల్ రావు పరిస్థితి. తెలంగాణ ఉద్యమంలో ఆయన కీలక పాత్ర పోషించారు. నిస్వార్థంగా, నిరాడంబరంగా ఆయన ఉద్యమకారుల పక్షాన కదం తొక్కారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక ఏదైనా రాజకీయ గుర్తింపు ఉంటుందని ఆశించారు కానీ ఓ దఫా ప్రభుత్వ పాలన పూర్తయినప్పటికీ ఆయనకి ఎలాంటి పదవి రాలేదు. ఈ లోపు తెలంగాణ ఉద్యమంలో పని చేసిన వారిని తప్పకుండా ఆదుకుంటామని సీఎం కేసీఆర్ స్పష్టమైన హామీ ఇచ్చారు. టీఆర్ఎస్ అధినేత మాటపై నమ్మకముంచి విఠల్ రావు ఓపిక పట్టారు. మొన్నటి జడ్పీటీసీ ఎన్నికల్లో మక్లూర్ స్థానం నుంచి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయనపై వ్యక్తిగత అభిమానంతో కాంగ్రెస్.. బీజేపీలకు చెందిన అభ్యర్థులు కూడా పోటీలో నుండి తప్పుకున్నారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో మెజారిటీ జడ్పీటీసీ స్థానాలను టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. దీంతో జిల్లా పరిషత్ చైర్మన్ పీఠం కూడా టీఆర్ఎస్ కే దక్కింది. అప్పటికే నిజామాబాద్ జడ్పీ పీఠం విఠల్ రావ్ కు కేటాయించాలని పార్టీ శ్రేణులకు సూచించారు సీఎం కేసీఆర్. ఈ మేరకు జిల్లాలోని ఎమ్మెల్యేలు ఇతర ప్రజా ప్రతినిధులకు సంకేతాలిచ్చారు. కేసీఆర్ ప్రతిపాదనకు అందరూ ఆమోదం తెలపడంతో విఠల్ రావు ఎంపిక లాంఛనప్రాయంగా ముగిసింది.
మక్లూర్ మండలానికి చెందిన దాదన్నగారి విఠల్ రావు జడ్పీ పీఠం అయితే ఎక్కారు కానీ తన సొంత నియోజక వర్గంలోనే స్వేచ్ఛగా తిరగలేకపోతున్నారు. ఆర్మూర్ నియోజకవర్గానికి చెందిన మక్లూర్ ఆయన సొంత గ్రామం. ఆయన సొంత మండలం నుంచే జిల్లా పరిషత్ కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ప్రజాప్రతినిధి హోదాలోగాని.. పార్టీ నేతగా కానీ ఆయన తన సొంత మండలంలో క్యాడర్ ను పెంచుకోవలసి ఉంటుంది. భవిష్యత్ రాజకీయాల్లో నిలదొక్కుకోవడం కోసం ప్రజలకు చేరువ కావాల్సి ఉంటుంది. ఈ ఆలోచనతో ఆయన మక్లూర్ మండలంతో పాటు నందిపేట , ఆర్మూర్ ప్రాంతాల్లో పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వివిధ గ్రామాల్లో జరిగే అభివృద్ధి కార్యక్రమాలకు హాజరవుతున్నారు. ప్రోటోకాల్ ప్రకారం ఎక్కడ ఎలాంటి అభివృద్ధి పథకం చేపట్టినా అక్కడి శిలాఫలకంపై జడ్పీ ఛైర్మన్ పేరు రాయాల్సి ఉంటుంది. ఈ మర్యాద కోసమైనా విఠల్ రావు విస్తృతంగా పర్యటిస్తున్నారు. అయితే ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డికి విఠల్ రావు దూకుడు నచ్చడం లేదు. తనకు తెలియకుండా తన ప్రమేయం లేకుండా ఆర్మూర్ నియోజకవర్గంలో పర్యటించడం సభలు సమావేశాలు పెట్టడాన్ని ఆయన జీర్ణించుకోలేకపోతున్నారు. ఎవరి నియోజకవర్గానికి ఆ ఎమ్మెల్యేనే బాస్ అని స్వయాన కేసీఆర్ ఇచ్చిన సందేశాన్ని జీవనరెడ్డి ఫాలో అవుతున్నారు. ఈ పాయింట్ ఆధారంగానే తన నియోజకవర్గంలో తన అనుమతి లేకుండా తిరగవద్దని విఠల్ రావును ఆదేశించారు. విఠల్ రావు సన్నిహితులకు పలుమార్లు ఫోన్ చేసి కూడా ఇదే ఆంక్షలు విధించారు. ఇంతకీ వీరిద్దరికీ ఎక్కడ చెడిందో అంశంపై టీఆర్ఎస్ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది.
రెవిన్యూ డివిజన్ ల పునర్విభజన సమయంలో మక్లూరు మండలాన్ని ఆర్మూర్ డివిజన్ లో కలపాలని ఎమ్మెల్యే జీవనరెడ్డి ఆశించారు. ఈ మేరకు ఆయన ప్రభుత్వ పెద్దలకు ప్రతిపాదన పంపారు. అయితే మక్లూర్ మండలం నిజామాబాద్ కు దగ్గరలో ఉంటుందని.. దాన్ని నిజామాబాద్ లోనే కొనసాగించాలని ఆ మండల నాయకులు పట్టుబట్టారు. గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీ సభ్యులు, వివిధ పార్టీల నాయకులంతా తమ మండలాన్ని ఆర్మూర్ లో కలుపవద్దంటూ పోరాటం చేశారు. దీనికి దాదన్నగారి విఠల్ రావు నాయకత్వం వహించారు. కేసీఆర్ కుటుంబంతో ఉన్న సాన్నిహిత్యంతో ఆయన హైదరాబాద్ లెవల్ లో పావులు కదిపారు. మక్లూర్ మండలంలోని ప్రజాప్రతినిధులు.. నాయకులందరినీ హైదరాబాద్ తీసుకెళ్లి అనుకున్నది సాధించారు.అయితే తనకు వ్యతిరేకంగా పని చేసి.. తన నిర్ణయాన్ని ధిక్కరించారంటూ అప్పట్నుంచే విఠల్ రావు పై ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి కోపం ఉంది. ఈ క్రమంలో ఆయన జడ్పీ చైర్మన్ కావడంతో చేసేది ఏమి లేక అంటిముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. ఆయన జడ్పీటీసీ సభ్యుడిగా ఏకగ్రీవంగా ఎన్నిక కావడం మొదలు జడ్పీ చైర్మన్ అయ్యే వరకు మౌనంగా ఉన్న జీవన్ రెడ్డి.. తీరా ఆయన దూకుడు పెంచాక తన ప్రతాపం చూపించడం మొదలెట్టారు. విఠల్ రావును తన నియోజకవర్గంలోనూ తిరగవద్దంటూనే ఇతర మండలాల నాయకులు కూడా ఆయన వద్దకు వెళ్లవద్దంటూ ఆదేశించారు. ఎమ్మెల్యే సూచన మేరకు తన సొంత మండలమైన మక్లూరు నేతలు కూడా ప్రస్తుతం జడ్పీ చైర్మన్ ను కలవాలంటే జంకుతున్నారు.
ఇటీవల ఆర్మూర్ పట్టణంలో జరిగిన పలు అభివృద్ధి పనులకు సంబంధించిన శిలాఫలకాలపై జడ్పీ చైర్మన్ విఠల్ రావు పేరు కూడా రాయించలేదు. ప్రోటోకాల్ ప్రకారం జరగాల్సిన గౌరవ మర్యాదలను కూడా పాటించడం లేదని స్వయాన కేసీఆర్ రికమెండ్ చేసిన విఠల్ రావును తన సొంత నియోజక వర్గ ఎమ్మెల్యేనే టార్గెట్ చేయడం ప్రస్తుతం అన్ని రాజకీయ పక్షాలలో హాట్ టాపిగ్గా మారింది. ఇప్పటికే విఠల్ రావుతో ఉన్న పాత వివాదాలకు తోడు రాబోయే రోజుల్లో తన టిక్కెట్ కు ఎసరు పెడతాడన్న భావనతోనే ఎమ్మెల్యే జీవనరెడ్డి ఇలా వ్యవహరిస్తున్నారని పార్టీ శ్రేణులు గుసగుసలాడుతున్నాయి. టీఆర్ఎస్ పెద్దల వద్ద జీవన్ రెడ్డి గ్రాఫ్ పడిపోయిందని.. ప్రత్యామ్నాయంగా విఠల్ రావును వారు ప్రోత్సహిస్తున్నారని కొందరు చెవులు కొరుక్కుంటున్నారు. కారణమేదైనా తన సొంత నియోజకవర్గంలో తనకు స్వేచ్ఛ లేకుండా పోయిందని విఠల్ రావు ఆవేదన చెందుతున్నారు. ఇటీవల ఈ విషయాన్ని పార్టీ పెద్దల చెవిన కూడా వేశారు. ఆర్మూర్ లో ఏం జరుగుతోందన్న విషయమై గులాబి పార్టీ పెద్దలు సైతం ఆరా తీస్తున్నారు. చూద్దాం హైకమాండ్ ఎలాంటి కమాండ్ జారీ చేస్తుందో.