పబ్లిక్ లో జగన్ కు పరాభవం.. సన్మానాన్ని తిరస్కరించిన సీజేఐ
posted on Aug 20, 2022 @ 3:45PM
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్‌కు పబ్లిక్ లో పరాభవం జరిగింది. శనివారం విజయవాడలో న్యాయ స్థానాల ప్రాంగణంలో నిర్మించిన జీ ప్లస్ సెవన్ (7) నూతన భవనాలను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ ప్రారంభించారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన వేదికపై సీజేఐ జస్టిస్ ఎన్.వి.రమణ, సీఎం జగన్ ప్రసంగించారు.
ఆనంతరం జస్టిస్ ఎన్ వి రమణకు సీఎం జగన్.. సన్మానం చేయాలని భావించారు. అందు కోసం వేదికపై సిహాసనం లాంటి కుర్చీ కూడా వేశారు. అయితే ఆ సన్మానానికి జస్టిస్ ఎన్వీ రమణ నిరాకరించారు. సున్నితంగా తిరస్కరించారు. దీంతో ఇదే వేదికపై ఉన్న ప్రముఖులు, ఈ కార్యక్రమానికి హాజరైన వారితోపాటు అక్కడే ఉన్న మీడియా సైతం ఆశ్చర్యపోయారు. స్వయంగా ముఖ్యమంత్రి సన్మానం చేయాలని భావించినా జస్టిస్ ఎన్వీరమణ నిరాకరించడంతో సన్మాన కార్యక్రమం జరగలేదు.
కాగా తిరుపతి పర్యటన ముగించుకొని... సీజేఐ జస్టిస్ ఎన్.వి.రమణ విజయవాడ చేరుకొని.. ఓ హోటల్‌లో బస చేశారు. ఆయనతో ముఖ్యమంత్రి జగన్‌తో సతీసమేతంగా భేటీ అయ్యారు. దాదాపు 20 నిమిషాల పాటు ఆయనతో జగన్ దంపతులు సమావేశమయ్యారు. వారు అటు వెళ్లగానే.. ఇటు ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. సీజేఐ ఎన్ వి రమణతో 20 నిమిషాలు సమావేశమయ్యారు. ఈ సందర్బంగా జస్టిస్ ఎన్.వి.రమణను చంద్రబాబు శాలువా కప్పి... శ్రీవెంకటేశ్వరస్వామి ప్రతిమను అందజేశారు. అందుకు సంబంధించిన చిత్రాలు.. అటు మీడియాలో ఇటు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
అయితే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎన్ వి. రమణ బాధ్యతలు చేపట్టిన తర్వాత.. ఆంధ్రప్రదేశ్‌కు పలుమార్లు వచ్చారు. తొలిసారిగా సీజేఐగా జస్టిస్ ఎన్.వి.రమణ రాష్ట్రానికి వచ్చినప్పుడు సీఎం జగన్ ఆయనను కలవలేదు. కానీ రెండో సారి ఆయన ఏపీలో పర్యటించినప్పుడు భారీగానే స్వాగత కార్యక్రమాలు ఏర్పాటు చేయడమే కాదు.. ప్రత్యేకంగా ఆయనకు జగన్ విందు కూడా ఇచ్చారు. కానీ ఆ సమయంలో జస్టిస్ ఎన్.వి. రమణను చంద్రబాబు కలవలేదు. అయితే ప్రస్తుతం విజయవాడ వచ్చిన జస్టిస్ ఎన్.వి.రమణను చంద్రబాబు కలిశారు. మరోవైపు జస్టిస్ ఎన్వీ రమణకు.. ఆచార్య నాగార్జున యూనివర్శిటీ డాక్టరేట్ ప్రదానం చేయనుంది. అందుకు ఇప్పటికే యూనివర్శిటీలో భారీ ఏర్పాట్లు చేశారు. జస్టిస్ ఎన్.వి.రమణ మరికొద్ది రోజుల్లో పదవి విరమణ చేయనున్నారు. తదుపరి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా యు.యు. లలిత్ బాధ్యతలు చేపట్టనున్నారు.