ఎన్‌కౌంటర్‌లో అసలేం జరిగింది?
posted on Apr 8, 2021 @ 12:13PM
చిన్న పొరబాటు. చిన్న నిర్లక్ష్యం. పదుల సంఖ్యలో జవాన్ల ప్రాణాలు తీసింది. ఉన్నతాధికారులు చెప్పినా వినలేదు. అక్కడి నుంచి తిరిగొచ్చేయండంటూ ఆదేశాలు ఇచ్చినా పాటించలేదు. ఫలితం 23మంది జవాన్ల మరణమృదంగం. నక్సల్స్ ఆపరేషన్స్‌పై సరైన అవగాహన లేకపోవడమే ఆ జవాన్లు ప్రాణాలు పోవడానికి కారణం. కూంబింగ్‌లో బేసిక్ రూల్స్ పాటించకపోవడం వారి ప్రాణాలు తీసింది. సీఆర్పీఎఫ్ బలగాల ఓవర్ కాన్ఫిడెన్స్ వల్లే దండకారణ్యంలో మావోయిస్టులది అప్పర్ హ్యాండ్ అయింది.
ఛత్తీస్‌గఢ్ ఎన్‌కౌంటర్‌పై విశ్లేషణ చేస్తున్న పోలీస్ ఎక్స్‌పర్ట్స్ కీలక సమాచారం సేకరించారు. కూంబింగ్‌లో ఎక్కడ తప్పిదం జరిగింది? అంత పెద్ద ఎత్తున జవాన్లు చనిపోవడానికి కారణమేంటి? అనే దిశగా ఇన్ఫర్మేషన్ లాగుతున్నారు. 5 మృతదేహాలతో 6 గంటలపాటు జవాన్లు ఒకేచోటు వేచి ఉండటమే ఇంతటి ప్రాణనష్టానికి కారణమని తెలుస్తోంది.
అవును, 5 మృతదేహాలు.. 6 గంటలు. ఛత్తీస్‌గఢ్ ఎన్‌కౌంటర్ ఎపిసోడ్ ఒకేసారి జరిగింది కాదు. రెండు విడతలుగా.. రెండుసార్లు ఫైరింగ్ చోటు చేసుకుంది. మావోయిస్టులు బీజాపుర్ జిల్లా పువర్తి చుట్టుపక్కల ప్రాంతాల్లో సంచరిస్తున్నారని పోలీస్ బలగాలకు ఇన్ఫర్మేషన్ అందింది. పువర్తి పేరు వినగానే పోలీసులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. వెంటనే అలర్ట్ అయ్యారు. ఎందుకంటే.. పువర్తి గ్రామం మావోయిస్టు దళ కమాండర్ మడావి హిడ్మా స్వగ్రామం. హిడ్మా పోలీసులకు మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్. అతడ్ని ఎలాగైనా పట్టుకోవాలని ఎప్పటి నుంచో గట్టిగా ప్రయత్నిస్తున్నాయి భద్రతా బలగాలు. అందుకే, పువర్తి పేరు వినగానే పోలోమంటూ కూంబింగ్‌కు బయలు దేరాయి భద్రతా బలగాలు. ఈ నెల 3న ఉదయం సీఆర్పీఎఫ్, కోబ్రా, స్పెషల్ టాస్క్‌ఫోర్స్ జవాన్లు ఆపరేషన్ హంట్ మొదలుపెట్టాయి.
పువర్తి పరిసర ప్రాంతాలైన టేకులగూడెం, జొన్నగూడెం, జీరగూడెం, ఉసంపురా.. తదితర ప్రాంతాల్లో కూంబింగ్ చేపట్టాయి. మావోయిస్టులు స్నానాల కోసం తరచూ టేకులగూడెం శివార్లలోని ఓ బావి వద్దకు వస్తున్నారనే సమాచారంతో ఓ బృందం అక్కడికి వెళ్లింది. అక్కడ ఎవరూ కనిపించకపోవడంతో సమీపంలోని గుట్టపై కూంబింగ్ చేపట్టింది. అక్కడ మావోయిస్టులు ఎదురుపడటంతో కాల్పులు జరిగాయి. ఆ ఎన్‌కౌంటర్‌లో ఐదుగురు జవాన్లు చనిపోయారు. కాసేపటికి, కాల్పులు ఆగిపోవడంతో డెడ్‌బాడీస్‌ను మిగతా జవాన్లు టేకులగూడెం తీసుకొచ్చారు.
అప్పటికే 5 గంటలు గడిచిపోయాయి. ఆ ఎన్‌కౌంటర్ విషయం తెలిసి పరిసర ప్రాంతాల నుంచి మావోయిస్టు దళాలు పెద్ద ఎత్తున అటు వైపు వస్తున్నాయంటూ బీజాపూర్ ఎస్పీ కార్యాలయంకు ఇన్ఫార్మర్ల నుంచి సమాచారం వచ్చింది. దీంతో.. జవాన్లను అప్రమత్తం చేశారు. వెంటనే అక్కడి నుంచి వచ్చేయమంటూ ఆదేశించారు. ఉన్నతాధికారుల హెచ్చరికలను సీఆర్పీఎఫ్ బలగాలు పట్టించుకోలేదు. బెటాలియన్‌లోని నాగాలాండ్‌కు చెందిన జవాన్లు మృతదేహాలు తరలించకుండా వెనక్కి వచ్చేది లేదని పట్టుబట్టారు. హెలికాప్టర్‌లో మృతదేహాలను తరలిద్దామనే ఉద్దేశంతో మరో గంట పాటు అక్కడే ఉండిపోయారు. మొత్తంగా దాదాపు 6 గంటల పాటు వాళ్లు ఒకే ప్రదేశంలో ఉన్నారు. ఆలోగా చుట్ట పక్కల ప్రాంతాల్లో సంచరిస్తున్న మావోయిస్టు దళాలన్నీ ఏకమై.. జవాన్లను చుట్టుముట్టి.. పెద్ద ఎత్తున కాల్పులు జరిపారు. భీకర ఎన్‌కౌంటర్‌లో 23మంది జవాన్లు నేలకొరిగారు. నలుగురు మావోయిస్టులు హతమయ్యారు. ఒక కోబ్రా కమెండోను బందీగా పట్టుకెళ్లారు.
ఇంతటి భారీ ఎన్‌కౌంటర్‌కు స్కెచ్ వేసింది మావోయిస్టు దళ కమాండర్ మడావి హిడ్మా అని పోలీసులు అనుమానిస్తున్నారు. అందుకే, తనకు బాగా పట్టున్న తన స్వగ్రామం చుట్టూ పక్కల ప్రాంతాల్లో సంచరిస్తూ.. భద్రతా బలగాలకు వల విసిరాడని.. ఆ ట్రాప్‌లో చిక్కుకుని జవాన్లు అమరులయ్యారని అంటున్నారు. అయితే.. దండకారణ్య ప్రత్యేక జోనల్ కమిటీ సభ్యుడు మడావి హిడ్మా ప్రత్యక్షంగా ఈ ఎన్‌కౌంటర్‌లో పాల్గొనలేదని నిఘా వర్గాలు అంటున్నాయి. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన తన దళానికి డైరెక్షన్ మాత్రమే చేశాడని.. షూట్అవుట్ స్పాట్‌లో అతను లేడని భావిస్తున్నారు.
కూంబింగ్‌కు వెళ్లిన బలగాలు ఒకేచోట ఎక్కువ సమయం ఉండకూడదనేది ప్రాథమిక నిబంధన. సీఆర్పీఎఫ్ బలగాలు ఈ రూల్‌ను బ్రేక్ చేయడమే ఇంతటి ప్రాణనష్టానికి కారణం. తమ సహచరుల మృతదేహాలను తరలించడంలో ఆలస్యం జరగడం.. వెనక్కి వచ్చేయమంటూ ఉన్నతాధికారులు చేసిన హెచ్చరికలను పట్టించుకోకపోవడం వల్లే ఇంతమంది జవాన్లు చనిపోయారని చెబుతున్నారు. అందుకే, కూంబింగ్‌లో చిన్నపాటి నిర్లక్ష్యానికి పెద్ద మూల్యమే చెల్లించుకోవాల్సి వచ్చింది.